ఇప్పటికే 4 రిజర్వాయర్లకు రూ.1,875 కోట్లతో అంచనాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలిచేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు పరిధిలో నల్లగొండ జిల్లాలో నిర్మించదలిచిన రిజర్వాయర్ల అంచనాలు ఓ కొలిక్కి వచ్చినందున వాటికి వెంటనే టెండర్లు పిలవాలని భావిస్తోం ది. శివన్నగూడెం రిజర్వాయర్ వ్యయ అంచనాలను పూర్తిచేసి త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయించింది.
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీలు కాకుండా 1 టీఎంసీ నీటిని డిండికి తరలించడం ద్వారా మునుగోడు, నకిరేకల్‌తోపాటు మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీరు తరలించేలా ప్రతిపాదనలు త యారయ్యాయి. అయితే ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లు కాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుందని, అక్కడివరకు నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే మేడిపూర్ వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని కొత్తగా ప్రతిపాదించారు. 430మీటర్ల ఎత్తువద్ద రిజర్వాయర్ చేపడితే కొత్తగా ఇర్విన్ దగ్గర 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంటుంది.
అయితే ఈ అలైన్‌మెంట్ విషయమై కొంత సందిగ్ధత ఉండటం, రిజర్వాయర్ల అంచనాలు ఇంకా పూర్తికాని దృష్ట్యా, వాటిని ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఇప్పటికే అంచనాలు పూర్తయిన నల్లగొండ జిల్లాలోని రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సిద్ధమైన అంచనాల మేరకు సింగరాజుపల్లి (0.8 టీఎంసీ)కి రూ.100 కోట్లు, గొట్టిముక్కల(1.8 టీఎంసీ)కు 125 కోట్లు, చింతపల్లి (1.1టీఎంసీ)కి 150 కోట్లు, కిష్టరాంపల్లి (10టీఎంసీ)కి 1,500 కోట్లు ఖర్చవుతాయని లెక్కలేశారు. ఇక మరో రిజర్వాయర్ శివన్నగూడెం (12 టీఎంసీలు) అంచనాలను ఒకట్రెండు రోజుల్లో అధికారులు పూర్తి చేయనున్నారు. దీనికి రూ.1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా నల్లగొండ జిల్లాలో రూ.3,375 కోట్ల పనులకు నాలుగు రోజుల్లో టెండర్లు పిలవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
తేలని ‘నార్లాపూర్’
డిండికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించడం, ఇంటెక్ కెపాసిటీని పెంచే విషయమై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం డిండికి 0.5 టీఎంసీల నీటిని పెంచడంతో మహబూబ్‌నగర్ జిల్లా అవసరాలకు కొరత ఏర్పడుతుందంటూ ఆ జిల్లా నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నార్లాపూర్ ఇంటెక్ కెపాసిటీని 2 నుంచి 3 టీఎంసీలకు పెంచి డిండికి ఒక టీఎంసీని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2 టీఎంసీలను తరలించాలని సూచిస్తున్నా, దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
త్వరలో డిండికి టెండర్లు
Published Thu, Feb 11 2016 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement
Advertisement