డిండి ప్రాజెక్టు కింద నల్లగొండ జిల్లాలో నిర్మాణం
3.14 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రణాళిక
ఆమోదముద్ర వేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌ను ప్రభుత్వం ఓ కొలిక్కి తెచ్చింది. నీటి వినియోగం, నిర్మించే రిజర్వాయర్లు, వాటి సామర్థ్యాలపై కసరత్తు పూర్తి చేసింది. రూ.5,200 కోట్లతో ఐదు రిజర్వాయర్లను నిర్మించాలనే అభిప్రాయానికి వచ్చింది. కృష్ణాలో వరద ఉండే రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉండే నార్లాపూర్ నుంచి 60 రోజుల్లో రోజుకు అర టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తీసుకునేందుకు నిర్ణయించింది. శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ప్రాజెక్టులో నిర్మించే రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదముద్ర వేశారు.
డిండి కింద మొత్తంగా 3.41 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చేలా ప్రణాళిక ఖరారు చేశారు. నార్లపూర్ నుంచి డిండికి అక్కడి నుంచి 3 ఆఫ్‌లైన్, 2 ఆన్‌లైన్ రిజర్వాయర్ల ద్వారా నీటిని తరలించనున్నారు. 22 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆఫ్‌లైన్‌లో సింగరాజుపల్లి (0.81 టీఎంసీ), గొట్టిముక్కల (1.76 టీఎంసీ), చింతపల్లి (0.9 టీఎంసీ) రిజర్వాయర్లు, ఆన్‌లైన్‌లో కిష్టరాంపల్లి (6.78 టీఎంసీ), శివన్నగూడెం (11.96 టీఎంసీ) రిజర్వాయర్లు ఉండనున్నాయి. 59 కిలోమీటర్ల మేర కెనాల్, ఇందులో 2.5 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. వీటికి మొత్తంగా రూ.5,200 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. కిష్టరాంపల్లిలో చిన్నపాటి మార్పులు జరిగే అవకాశం ఉందని, అది మినహా మిగతా రిజర్వాయర్లు అన్నీ కొలిక్కి వచ్చినట్లేనని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా వీటికి టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు.
5 రిజర్వాయర్లు.. రూ.5,200 కోట్లు!
Published Mon, Jul 4 2016 4:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
Advertisement
Advertisement