కొనసాగుతున్న నీటి బెంగ
- కరుణించని వరుణుడు
- నిండని రిజర్వాయర్లు
- ఆయకట్టు భూములకు నీటి కష్టాలు
జిల్లా రైతాంగాన్ని సాగునీటి బెంగ వెంటాడుతోంది. ఖరీఫ్ తొలి దశలో వరుణుడు కరుణించకపోవడంతో డీలాపడినా.. ఆ తర్వాత చినుకు రాలడంతో ఒడిసిపట్టి ఎలాగోలా నాట్లు పూర్తిచేసింది. తర్వాతైనా వర్షాలు కురిసి రిజర్వాయర్లు నిండితే ఖరీఫ్ ఆసాంతం సాగునీటికి ఢోకా ఉండదని భావిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
విశాఖ రూరల్ : వర్షాభావ పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆయకట్టు భూములకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాలు పడుతున్నా.. రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరగలేదు. ప్రధాన జలాశయాల్లో 50 శాతం కూడా నీటి నిల్వలు లేవు. ఫలితంగా పంటలకు అవసరమైన నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితం.. ఖరీఫ్ రైతులకు బెంగ పట్టుకుంది.
వర్షాధారం కావడంవల్లే ఆందోళన
జిల్లాలో 90 శాతం పంటలు వర్షాధారమైనవి. అయితే ఏటా మాదిరిగానే ఈ ఖరీఫ్‌లో కూడా అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వారాల క్రితం వరకు వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోయాయి. పది రోజులుగా వర్షాలతో పుంజుకున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం కనిపించింది. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో మళ్లీ డీలా పడ్డారు. కనీసం ఆయకట్టు భూముల కింద ఉన్న పంటలకైనా సక్రమంగా నీరందే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
నీటి విడుదల అంతంతమాత్రమే!
జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడంతో ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు విడుదల చేసే పరిస్థితి లేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. తాండవ జలాశయం కింద అత్యధికంగా 51 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి 40 శాతం తక్కువగా 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. రైవాడ కింద 15 వేల ఎకరాలుండగా, ప్రస్తుతం 150 క్యూసెక్కులు, కోనాం పరిధిలో 12,500 ఎకరాలు ఉండగా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పెద్దేరు రిజర్వాయర్ కింద మాత్రం 19,900 ఎకరాలు ఆయకట్టు ఉంది. దీనికి కేవలం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. పెద్దేరు సామర్థ్యం తక్కువ కనుక 9 సార్లు నిండితే తప్ప ఆ ఆయకట్టుకు సరిపడా నీరందే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంపై అధికారుల ప్రచారం రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయకపోవడానికి గల కారణాలపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. గ్రామాలకు స్వయంగా వెళ్లి రిజర్వాయర్లలో నీటి మట్టాల పరిస్థితి వివరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.
వరద ముప్పు తక్కువే
ప్రస్తుత పరిస్థితుల్లో భారీ వర్షాలు కురిసినా వరద ముప్పు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. పెద్దేరు మినహా మిగిలిన జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో వర్షాలు అవశ్యమని పేర్కొంటున్నారు. గడచిన మూడేళ్లుగా సెప్టెంబర్ తర్వాత నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండవచ్చని వారు అంచనావేస్తున్నారు. అతి భారీ వర్షాలు కురిస్తే తప్ప ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు.