శుక్రవారం డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
ప్రాజెక్టులకు ఆంధ్రా సన్నాసులు అడ్డుపడుతున్నరు.. అయినా ‘పాలమూరు’కన్నా ముందే పూర్తిచేస్తాం: కేసీఆర్
♦ సమైక్య పాలనలో నాలుక తుడుచుకునే జీవోలే తప్ప నీళ్లు రాలేదు
♦ ఇప్పుడు మనం నీళ్లు తెచ్చుకుంటుంటే ఆంధ్రా నేతలు లఫంగితనం చేస్తున్నరు
♦ నిర్వాసితులను ఆదుకుంటం.. అవసరమైతే వెయ్యి ఉద్యోగాలు సృష్టిస్తం
♦ డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: డిండి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఆంధ్రా సన్నాసులు అడ్డుపడుతున్నారని.. అయినా ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి తీరుతామన్నారు. పాలమూరు కన్నా ముందే ‘డిండి’ని పూర్తిచేస్తామన్నారు. ఈ రెండు పథకాలకు ‘సమైక్య’ పాలనలోనే అనుమతులు వచ్చాయని.. కానీ అప్పుడు నాలుక తుడుచుకునేందుకు జీవోలొచ్చాయే తప్ప నీళ్లు రాలేదని చెప్పారు.
శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం శివారులోని చర్లగూడెం చెరువు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించి డిండి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. భయంకరమైన ఫ్లోరైడ్ విషయంలో సమైక్య రాష్ట్రంలో ఏమీ చేయలేకపోయామని ఆయన పేర్కొన్నారు. ‘‘ఫ్లోరైడ్ ప్రభావానికి గురై లక్షలాది మంది నల్లగొండ బిడ్డల నడుము వంగి, బొక్కలు కుంగి, జీవితాలు నాశనమైనా ఎవరూ పట్టించుకోలేదు. ఎంత మొరపెట్టుకున్నా, ప్రధాని టేబుల్‌పై ఫ్లోరైడ్ బాధితులను తీసుకెళ్లి పడుకోబెట్టి చూపించినా ఎవరూ ఏమీ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. మీరు ఆశీర్వదించిన బిడ్డలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నరు. ఇప్పుడు నీళ్లు వచ్చి తీరుతాయి..’’ అని కేసీఆర్ చెప్పారు.
బతకనీయడం లేదు..
పాలమూరు, డిండి పథకాలకు కృష్ణా జలాలు వినియోగించుకునే హక్కు తెలంగాణకు ఎక్కడిదంటున్న ఆంధ్రప్రదేశ్ నేతలపై సీఎం మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లు తెచ్చుకుంటుంటే ఆంధ్రా నేతలు లఫంగితనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘అసలు ఈ ప్రాజెక్టులు కొత్తవేం కాదు. సమైక్య రాష్ట్రంలో రూపొందించిన పాత ప్రాజెక్టులే. డిండి పథకానికి 2007లో సర్వే పూర్తి చేసి, 2008లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇచ్చారు. 2010లో కిరణ్ ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు కూడా విడుదల అయ్యాయి. ఇదంతా జీవోలో ఉన్నదే.. హరికథలు చెప్పేది కాదు. అయినా తెలంగాణకు ఆ జలాలపై హక్కు ఎక్కడుందని ఓ ఆంధ్రా సన్నాసి (మంత్రి ఉమా) ప్రశ్నిస్తున్నాడు.
అసలు ఆయనకు తెలివి ఉందా, మెదడు పనిచేస్తుందా?’’ అని విరుచుకుపడ్డారు. ఆ ఏపీ మంత్రి పేరేమిటంటూ కేసీఆర్ పక్కనే ఉన్న మంత్రులను అడగగా.. వారు ‘ఉమ’ అని బదులిచ్చారు. దీంతో కేసీఆర్ మళ్లీ ప్రసంగిస్తూ... ‘‘ఉమనా? అంటే ఆడా, మగా? పేరు ఎటూకాకుంట ఉంది. ఆయనొక్కడే మనిషయి పుట్టిండట. మనం మనుషులం కాదట. మనకు రైతులు లేరట.. ఈ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రా లఫంగిగాళ్లు పంచాయితీకి వస్తున్నరు.
ఏదిఏమైనా వందకి వందశాతం ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతం..’’ అని స్పష్టం చేశారు. పాలమూరు కన్నా ముందే, రెండేళ్లలో డిండి పథకాన్ని పూర్తిచేసి నీళ్లు ఇస్తామని, తాను అన్న మాట జరిగి తీరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధర్మంగా, న్యాయంగా ఉంది కనుకనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పునాది వేస్తున్నప్పుడే వర్షం రూపంలో అక్షింతలు పడ్డాయని, ఇది శుభసూచకమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
భారీ వర్షంతో అంతరాయం
శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకే కేసీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించాల్సి ఉన్నా.. భారీ వర్షం కారణంగా సాయంత్రం 4:47కు ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరాల్సిన సమయంలోనే వాతావరణం మేఘావృతమై హెలికాప్టర్ ప్రయాణానికి వీలుకాలేదు. దీంతో సీఎం యాచారం మీదుగా రోడ్డుమార్గంలో బయలుదేరారు. మరోవైపు పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ జరగాల్సిన శివన్నగూడెంలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో సభా వేదికతో పాటు ప్రాంగణంలోని టెంట్లు పడిపోయాయి. సభకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రజలు కూడా తిరుగుముఖం పట్టారు. నాలుగున్నరకు అక్కడికి చేరుకున్న సీఎం కేసీఆర్.. పైలాన్‌ను ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి 20 నిమిషాలు ప్రసంగించి వెళ్లిపోయారు.
ఉద్యోగాలు సృష్టిస్తాం..
డిండి ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేస్తామని, వారి కడుపు నింపాకే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘‘ఇది మన రాష్ట్రం. మన బతుకులు బాగుపడాలె. నీళ్లు వచ్చి 30, 40 ఊళ్లు బాగుపడతాయంటే... రెండు మూడు ఊళ్లు పోతాయి. వారిని కడుపులో పెట్టుకుని చూసుకోవాలె..’’ అని పేర్కొన్నారు. భూమి కోల్పోయిన వారికి ఐదింతలు పరిహారం చెల్లిస్తామన్నారు. కావాలంటే ఆయకట్టు కింద భూములు కొనిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, అర్హులు ఇద్దరుంటే వారిద్దరికీ ఉద్యోగం ఇస్తామని... అవసరమనుకుంటే వెయ్యి, రెండు వేల ఉద్యోగాలు సృష్టించి నిర్వాసితులకు న్యా యం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ చేపడతామని చెప్పారు.