డిండి ప్రాజెక్టు డిజైన్లు సిద్ధం
♦ కాలువల ద్వారానే నీటిని తరలించేలా రూపకల్పన
♦ డిజైన్లపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి టన్నెల్‌లు నిర్మించాల్సిన అవసరం లేకుండా... కాలువల ద్వారానే నీటిని తరలించగలిగేలా డిండి ప్రాజెక్టుకు అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. దీనిపై సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగే సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అధికారులు అంచనాలను సిద్ధం చేయనున్నారు. దీంతోపాటు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్యాకేజీలపైనా ఈ సమీక్షలో తుది నిర్ణయం తీసుకుంటారు.
టన్నెళ్లు అవసరం లేకుండా..
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు డిండి ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తరలించాలని తొలుత ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఈ డిజైన్‌లో టన్నెళ్లు నిర్మించాల్సిన అవసరం నెలకొంది. ప్రతిపాదిత ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లు కాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుంది. దీంతో 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి కాలువల ద్వారా నీటిని తరలించాలని కొత్తగా ప్రతిపాదించారు.
ఇలా అయితే టన్నెళ్ల అవసరం ఉండదని, కాలువల ద్వారా ఖర్చు రూ. 50 కోట్ల వరకు తగ్గుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. కొత్త డిజైన్ ప్రకారం ఏదుల నుంచి కాలువ ద్వారా అప్పర్‌డిండికి ఎగువన మేడిపూర్ దగ్గర 430 కాంటూర్ పరిధిలో రిజర్వాయర్ నిర్మించవచ్చు. అక్కడి నుంచి ప్రధాన కాలువ ద్వారా పలు రిజర్వాయర్లకు తరలించి ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. అయితే అప్పర్ డిండికి ఎగువన రిజర్వాయర్ల కాంటూర్ నిర్మాణం ఎక్కడ మొదలుపెట్టాలనేది తేలాలి.
ఒకవేళ 415 కాంటూర్‌లో అయితే పాత డిజైన్‌లోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, అర్కపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల సామర్థ్యంలో మార్పు ఉండదు. 430 కాంటూర్‌తో రిజర్వాయర్ నిర్మిస్తే కొత్తగా ఇర్విన్ దగ్గర 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించాలి. దీంతో పాటు కిష్టరాంపల్లి సామర్థ్యాన్ని 5.7 నుంచి 9 టీఎంసీలకు, శివన్నగూడెం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది. దీనిపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలో నిర్ణయం తీసుకుంటారు.
పాలమూరు ప్యాకేజీలపైనా..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 35,200 కోట్ల అంచనాతో చేపట్టిన విషయం తెలిసిందే. దీని డిజైన్‌లో మార్పులు, డిండి ఎత్తిపోతలను కలపడంతో ప్రాజెక్టు వ్యయం రూ.40 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. పూర్తిస్థాయి సర్వే, అంచనాలు పూర్తయ్యాక స్పష్టత రానుంది. ప్రాజెక్టులోని ఆరు రిజర్వాయర్లకుగాను ఐదింటికి అంచనాలు సిద్ధమయ్యాయి. పంప్‌హౌజ్‌లు, ఓపెన్ చానల్‌ల సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనుల అంచనాలూ వచ్చేశాయి. అయితే టెండర్లు పిలిచేముందు ఈ పనులను ఎన్ని ప్యాకేజీలుగా విభజించాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఒక్కో పనిని రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లుగా విభజించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని అధికారులు చెబుతుండగా... రూ.వెయ్యి కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల మధ్యలో ప్యాకేజీలను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైనా సీఎం సమీక్షలో నిర్ణయం తీసుకుంటారు.