డిండితో నల్లగొండ కరువు తీరాలి | Nalgonda with dindi must drought | Sakshi
Sakshi News home page

డిండితో నల్లగొండ కరువు తీరాలి

Published Sun, Jul 3 2016 12:35 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

డిండితో నల్లగొండ కరువు తీరాలి - Sakshi

డిండితో నల్లగొండ కరువు తీరాలి

పనులు త్వరగా పూర్తిచేయండి: అధికారులకు సీఎం ఆదేశం
- రెండేళ్లలో మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు రావాలి
- అవసరాన్ని బట్టి ఉత్తర, దక్షిణ తెలంగాణలకు నీటి  పంపిణీ
- నిండిన నీళ్లను నిండినట్టే గొలుసుకట్టు చెరువులకు మళ్లించాలి
- నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: డిండి ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాలకు సాగునీటిని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చింతపల్లి, గొట్టిముక్కల, సింగరాయపల్లి, కృష్ణంపల్లి రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపి నల్లగొండ కరువును తీర్చేలా పనులు సాగాలని జిల్లా ఇంజనీర్లకు సూచిం చారు. అలాగే మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు నీళ్లు తరలించే పనులను రెండేళ్లలోపే పూర్తిచేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణకు సాగు అవసరాలను బట్టి నీటిని పంపిణీ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ వరకు నిర్మించ తలపెట్టిన ప్రధాన రిజర్వాయర్లలో నిండిన నీళ్లను గొలుసుకట్టు చెరువులకు మళ్లించాలని ఆదేశించారు. లిఫ్టులతో జలాశయాలను నింపుతూనే చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మళ్లించాలన్నారు. డిండి ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణాలపై నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఆ జిల్లా మంత్రి జి.జగదీశ్ రెడ్డి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మించతలపెట్టిన రిజర్వాయర్ల డిజైన్లు, పనుల పురోగతిని సమీక్షించారు. గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సమాంతరంగా లిఫ్టు ద్వారా నీటిని ఎల్లంపల్లి నుంచి దిగువ రిజర్వాయర్లకు మళ్లించే కార్యాచరణను రూపొం దించాలని ఈ సందర్భంగా సీఎం నీటిపారుదల శాఖను ఆదేశించారు.

 రిజర్వాయర్లలో ఎప్పుడూ నీళ్లుండాలి
 డిండి ప్రాజెక్టు నుంచి చౌటుప్పల్ వరకు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణం, డిజైన్ల పురోగతిని సీఎం పరిశీలించారు. డిండి నుంచి శివన్నగూడెం వరకు కాలువ నిర్మాణంపై చర్చించారు. నర్లాపూరు నుంచి డిండి ప్రధాన కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ నాలుగు రిజర్వాయర్ల నిర్మాణాల పరిధిలో ముంపు అతి తక్కువగా ఉండేలా, దూరం పెరగకుండా ఇంజనీరింగ్ నైపుణ్యంతో కాల్వల నిర్మాణం చేపట్టాలన్నారు. రిజర్వాయర్లలో నిరంతరం నీటి నిల్వ ఉండేలా చూడాలన్నారు. ‘‘ఈ నీళ్లతో చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జల నీటి మట్టం పెరుగుతుంది. వర్షాలు కురవడానికి సైతం రిజర్వాయర్లు దోహదపడతాయి.

అటు కాళేశ్వరం నుంచి బస్వాపూర్ వరకు ఇటు డిండి నుంచి చివరి రిజర్వాయర్ వరకు త్వరగా పనులు పూర్తయ్యేలా నల్లగొండ జిల్లా ఇంజనీర్లు కృషి చేయాలి. ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంతానికి లిఫ్టు ద్వారా సాగునీటిని అందించాలి’’ అని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలు, మండలాల పునర్విభజనపై ప్రజల ఆకాంక్షలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర నాయక్, నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement