జెట్‌ స్పీడ్‌తో ‘పాలమూరు’ | KCR Review Meeting On Palamuru Rangareddy Lift Irrigation Project | Sakshi
Sakshi News home page

జెట్‌ స్పీడ్‌తో ‘పాలమూరు’

Published Fri, Aug 9 2019 4:45 AM | Last Updated on Fri, Aug 9 2019 8:06 AM

KCR Review Meeting On Palamuru Rangareddy Lift Irrigation Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మాదిరే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇంజనీర్లను ఆదేశించారు. ప్రాజెక్టు పనులకు ప్రధాన అవరోధంగా ఉన్న నిధుల సమస్యను అధిగమించిన దృష్ట్యా పనులను జెట్‌ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో రూ.10 వేల కోట్ల రుణాలు వస్తున్న నేపథ్యంలో పంప్‌హౌస్‌ పనులతోపాటు రిజర్వాయర్లు, కాల్వలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పనులన్నీ సమాంతరంగా జరగాలని మార్గదర్శనం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు పూర్వ జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్, కల్వకుర్తి, తుమ్మిళ్ల పనులపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో ఇంజనీర్లతో సుమారు 6 గంటలపాటు సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో నెలకొన్న సమస్యలు, వాటిని అధిగమించే చర్యలు, ప్రాజెక్టుల పూర్తి, వాటి నుంచి నీటి విడుదల తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.

ఈ భేటీకి జిల్లా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ ఖగేందర్, రమేశ్, ఎస్‌ఈలు అంజయ్య, మనోహర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పథకం కింద ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 18 ప్యాకేజీల్లో జరుగుతున్న పనులపై అధికారులు వివరణ ఇచ్చారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లతోపాటు ఆయా అప్రోచ్‌ కాల్వలు, టన్నెళ్ల నిర్మాణాలు సాగుతున్న తీరును వివరించారు. ఏదుల పనులు 90 శాతం మేర పూర్తవగా నార్లాపూర్, కరివెన పనులు 55 శాతం దాటాయని, వట్టెం రిజర్వాయర్‌ పనులు 30 శాతం వరకు పూర్తవగా, ఉదండాపూర్‌ పనులు ఇప్పుడిప్పుడే సాగుతున్నాయని తెలిపారు. అప్రోచ్‌ కాల్వల పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని, వట్టెం, ఉదండాపూర్‌ రిజర్వాయర్ల కింద భూసేకరణ పూర్తయితే తప్ప పనులు ముందుకు సాగే పరిస్థితి లేదని వివరించారు.

దీనిపై ముఖ్యమంత్రి స్పం దిస్తూ రిజర్వాయర్ల పనుల్లో అప్రమత్తత పాటించాలని, పెద్ద రిజర్వాయర్లు కావడం వల్ల ఎలాంటి నాణ్యతా లోపాలున్నా ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రాజెక్టు ఇంజనీర్లు, ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్లు పూర్తి అప్రమత్తతతో పని చే యాలని ఇంజనీర్లను ఆదేశించారు. టన్నెల్‌ పనుల భద్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రక్షణ ఏర్పాట్లతోనే పనులు జరిపేలా సిబ్బందికి సూచించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జిల్లాలో పాక్షికంగా ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు జరగాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని, అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది.  

వరద నీటితో పూర్తిఆయకట్టుకు నీరు..
కృష్ణా బేసిన్‌లో విస్తృత వర్షాలు కురుస్తున్నాయని, దీంతో మరో 20 రోజులు జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద కొనసాగే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా ఒడిసిపడుతూ ఆయకట్టుకు తరలించాలని, గతేడాది మాదిరే ఈ ఏడాదీ చెరువులు నింపేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కల్వకుర్తి కింద 3.50 లక్షల ఎకరాలకు, మొత్తం ప్రాజెక్టు కింద 7.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డితోపాటు తుమ్మిళ్ల ఎత్తిపోతలను పరిశీలించేందుకు త్వరలోనే జిల్లాకు వస్తానని సీఎం చెప్పినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement