డిండి ప్రాజెక్టు.. ఎటూ తేల్చని ప్రభుత్వం | dindi project: design yet to finalise | Sakshi
Sakshi News home page

డిండి ప్రాజెక్టు.. ఎటూ తేల్చని ప్రభుత్వం

Published Thu, Jul 13 2017 3:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

డిండి ప్రాజెక్టు.. ఎటూ తేల్చని ప్రభుత్వం

డిండి ప్రాజెక్టు.. ఎటూ తేల్చని ప్రభుత్వం

- శంకుస్థాపన చేసి రెండేళ్లయినా ఖరారుకాని డిజైన్‌.. తేలని నీటి కేటాయింపులు
- నార్లాపూర్‌ నుంచి నీటిని తీసుకునే ప్రక్రియపై అనేక అభ్యంతరాలు
- కల్వకుర్తి ఆయకట్టు నష్టం, ‘పాలమూరు’కు నీటి కష్టంపై ఆ జిల్లా నేతల గుర్రు
- ఎటూ తేల్చని ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌

పూర్వ మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ బాధిత మండలాలకు పరిశుద్ధ తాగునీటిని అందించే ప్రధాన లక్ష్యంతో చేపడుతున్న డిండి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ జరిగి రెండేళ్లు కావస్తున్నా ప్రాజెక్టుకు నీటిని తీసుకునే అంశంపై ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రాజెక్టు శంకుస్థాన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించినా, ప్రాజెక్టుపై నెలకొన్న ప్రాధమిక అవాంతరాలను ఇంతవరకు దాటలేదు. శ్రీశైలం నుంచే నేరుగా నీటిని తీసుకుందామని ఒకమారు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఏదుల రిజర్వాయర్‌ నుంచి తీసుకుందామని మరోమారు, నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి తీసుకుందామని ఇంకోమారు మార్పులు చేస్తూ ఏదీ ఖరారు చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు.

ఎన్ని మార్పులో...
డిండికి నీటిని తీసుకునే అంశంపై అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. శ్రీశైలం వరద నీటిపై ఆధారపడుతూ చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల నీటిని డిండికి తరలించేలా మొట్టమొదటి ప్రక్రియ ఖరారైంది. అయితే అధిక ఖర్చు దృష్ట్యా శ్రీశైలం నుంచే నేరుగా నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచే నీటిని తీసుకునే ప్రక్రియ ఖరారు కావడంతో డిండికి శ్రీశైలం నుంచి కాకుండా పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఏదుల రిజర్వాయర్‌ నుంచి రోజుకి 0.5 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు సైతం ఇచ్చింది. అనంతరం హైదరాబాద్‌ తాగునీటిì అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి వాటిని డిండి ద్వారానే 60 టీఎంసీల మేర తరలించాలని మరలా కొత్త ప్రణాళిక తెరపైకి తెచ్చారు. అయితే ఈ 60 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏదుల కన్నా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నయమంటూ మరలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

నార్లాపూర్‌తో మొదలైన వివాదం...
అయితే నార్లాపూర్‌ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్‌మెంట్‌తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే ప్రమాదముందని మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు మొదట అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై వారంతా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అనంతరం దీనిపై సర్వే చేసిన అధికారులు మొత్తంగా కల్వకుర్తి పరిధిలోని ప్యాకేజీ 29లో 20,122 ఎకరాలు, ప్యాకేజీ 30లో మరో 7,629 ఎకరాలకు నష్టం ఉంటుందని తేల్చారు. అయితే నష్టం 4వేల ఎకరాలకు మించదని నల్లగొండ జిల్లా ప్రతినిధులు చెప్పుకొచ్చారు. నేతల మధ్య యుద్ధం జరుగుతుండగానే ప్రాజెక్టు ఇంజనీర్ల మధ్య వివాదాలు పొడసూపాయి. డిండి టన్నెల్, ఓపెన్‌చానల్‌లకు సూచించిన అలైన్‌మెంట్‌ ప్రకారం వ్యయ అంచనా, రూ.9,189 కోట్లు ఉంటుందని పాలమూరు ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేయగా, డిండి అధికారులు వేసిన అంచనా రూ.7,106 కోట్లుగా తేలింది. అంచనాల్లో రూ.2వేల కోట్ల వ్యత్యాసం ఉండటంతో, ప్రభుత్వం దీనిపై వ్యాప్కోస్‌తో సర్వే చేయించింది. వ్యాప్కోస్‌ సర్వే చేసి ఐదు ప్రత్యామ్నాయాలను చూపినా, చివరికి నార్లపూర్‌ నుంచి డిండికి నీటిని తీసుకెళ్లే డిజైన్‌ను ఓకే చేసింది. ప్రస్తుతం ఈ డిజైన్‌పైనా వ్యతిరేకత వస్తోంది. నార్లాపూర్‌ నుంచి నీటిని తీసుకెళితే పాలమూరు పథకానికి 90 టీఎంసీలే మిగులుందని, దీనిద్వారా 12.30 లక్షల ఎకరాలకు నీళ్లెలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తుండగా, కల్వకుర్తి కింద ముంపుపై మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

డిండిని విడిగా చేపట్టాలి: రమేశ్‌రెడ్డి, డి.గోవర్ధన్‌రెడ్డి, ఎన్‌.రఘుమారెడ్డి – మేధావులు, రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం
‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో సంబంధం లేకుండా డిండి ప్రాజెక్టును వేరుగా చేపట్టాలి. శ్రీశైలం నుంచే నేరుగా నీటిని తీసుకోవాలి. పాలమూరు కింది 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు 120 టీఎంసీలు అవసరం. ఇందులో 30 టీఎంసీలు డిండికి తీసుకెళ్తే 90 టీఎంసీలతో పూర్తి ఆయకట్టుకు నీరివ్వడం అసాధ్యం. అందుకే డిండికి నేరుగా శ్రీశైలం నుంచే 0.5 లేక 0.75 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రణాళిక ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అలాకాకుండా పాలమూరు మొదటి రిజర్వాయర్‌ నుంచి నీటిని తోడేస్తే జిల్లా ఆయకట్టుకు నష్టమే. కల్వకుర్తి నుంచి నీటిని తీసుకెళ్తూ ఆ నియోజకవర్గ ఆయకట్టుకు నీరివ్వకపోవడం మంచిది కాదు’.

ఫ్లోరైడ్‌ జిల్లాకు నీళ్ళొద్దా: శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, రాంరెడ్డి, – రిటైర్డ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌
‘నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ ప్రాంతాల కష్టాలను తీర్చేందుకు సాగునీటి ప్రాజెక్టు అత్యావశ్యకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా సూచన చేసింది. ఫ్లోరైడ్‌ ప్రాంతాల్లో బోర్లతో వ్యవసాయం ద్వారా ఫ్లోరోసిస్‌ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. దీనికి శాశ్వత పరిష్కారం సాగునీటి పారుదల ద్వారానే సాధ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే డిండిని చేపట్టారు. కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతినకుండా నీటిని సరఫరా చేసేలా వ్యాప్కోస్‌ సర్వే చేసి నివేదిక ఇచ్చింది. ఈ అంశాన్ని మానవీయ కోణంలో చూసి సహకరించాలి’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement