‘డిండి’కి విద్యాసాగర్‌రావు పేరు  | Dindi Project In Telangana Named After Vidyasagar Rao | Sakshi
Sakshi News home page

‘డిండి’కి విద్యాసాగర్‌రావు పేరు 

Published Sun, Apr 15 2018 1:42 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Dindi Project In Telangana Named After Vidyasagar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫ్లోరైడ్‌ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటిరంగ నిపుణుడు ఆర్‌.విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. కొద్దిరోజుల్లోనే విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఘన నివాళి అర్పించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్‌.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా పరిగణించాలని నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ‘‘సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన వివక్షను విద్యాసాగర్‌రావు ఎలుగెత్తి చాటారు. సంక్లిష్టమైన విషయాలను సులువుగా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పి, జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్య పరిచారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా సాగునీటి అంశాలపై విస్తృత చర్చకు అవకాశం కల్పించారు. ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది ఆయన జీవితాశయంగా ఉండేది. ఆయన కలగన్నట్లుగానే సాగునీటి రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాకు నీరందించే డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకోవడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాం’’అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విద్యాసాగర్‌రావు అనారోగ్యంతో బాధపడుతూ తన చివరి కోరికగా తన సొంతూరు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి అప్పుడే దేవాలయ పునరుద్ధరణకు కోటి రూపాయలు మంజూరు చేశారు. 

జేఏసీ సైతం.. 
ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ఇంజనీర్స్‌ జేఏసీ సైతం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్‌ టి.వెంకటేశం, కన్వీనర్‌ వెంకటేశ్వర్లు, కోచైర్మన్‌ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు శనివారం ఓ ప్రకటనలో తమ సంతోషం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 

మంత్రి హరీశ్‌రావు హర్షం 
డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. విద్యాసాగర్‌రావుకు ఇది సరైన నివాళి అని అభిప్రాయపడ్డారు. సముచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీటి పారుదల శాఖ తరఫున, ఇంజనీర్లు, అధికారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఫ్లోరైడ్‌ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, మంచినీరు అందిస్తామని హరీశ్‌ ప్రకటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement