పలికే జల ప్రవాహం
నివాళి
కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో, సుప్రీం కోర్టులో తెలంగాణ వాదనలు రూపొందించడంలో ఆయనదే కీలక పాత్ర. అఫిడవిట్లు ఆయన ఆమోదించిన తర్వాతనే వాటిని సమర్పించడం జరిగేది. ఇప్పుడు అవన్నీ కీలకమైన దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో ఆయన లేకపోవడం పెద్ద లోటుగానే భావిస్తున్నాను. ఇక మహారాష్ట్రతో గోదావరిపై అంతర్రాష్ట్ర ఒప్పం దాలు కుదుర్చుకునే ప్రతీ సందర్భంలో విద్యాసాగర్‌రావు సహకారాన్ని అందించేవారు.
తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు రామరాజు విద్యాసాగర్‌రావు కన్నుమూశారన్న వార్త జీర్ణించుకోలేనిది. తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఆయన మన మధ్య లేకపోవడం నాకు వ్యక్తిగతంగా కూడా పూడ్చలేని లోటు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయనతో సన్నిహిత, వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. ఆయన నిరాడంబర జీవిత శైలి విశిష్టమైనది. అందుకే వయసుతో, హోదాతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఆయన దగ్గరవుతారు.
ఆయన పాఠాలే మాకు మార్గదర్శకం
కేసీఆర్æ పక్కన కూర్చొని సాగునీటిపై జరిపే చర్చలని నేను కూడా శ్రద్ధగా ఆలకించేవాడిని. తీరిక లేని ఉద్యమ కార్యాచరణ వలన విద్యాసాగర్‌రావు రాసిన వ్యాసాలని క్రమం తప్పకుండా చదవలేకపోయినా, కంట పడినప్పుడు మాత్రం తప్పక చదవేవాడిని. అది ముఖ్యమైన వ్యాసమని తోచినప్పుడు, అప్పుడు చదవడానికి తీరిక చిక్కకపోతే దాచుకొని చదివిన సందర్భాలు కూడా ఉన్నాయి. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు నిర్వహించినప్పుడు నీటి వనరుల గురించి పాఠాలు చెప్పేది విద్యాసాగర్‌రావు మాత్రమే.
జటిలమైన సాంకేతక అంశాలని అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పే ఆయన పద్ధతి వలన సాగునీటి సంగతులు, టీఎంసీలు, క్యూసెక్కుల లెక్కలు అవగతమైనాయి. కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన వాటాల గురించి, గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుల గురించి ఆయన చెప్పిన పాఠాల కారణంగానే మా వంటివారికి స్పష్టత వచ్చింది. అంతర్రాష్ట్ర సమస్యలపైన కూడా ఆయనకున్న అవగాహన వేరొకరిలో కనిపించదు. ప్రాజెక్టుల స్థితిగతులపై ఎంతో కొంత తెలిసిన వారు ఉన్నప్పటికీ అంతర్రాష్ట్ర సమస్యలపై, గోదావరి, కృష్ణా ట్రిబ్యునళ్ల గురించి విద్యాసాగర్‌రావు మాత్రమే సాధికారికంగా వివరించేవారు.
ప్రాజెక్టుల అంతరార్ధాలను పసిగట్టినవాడు
పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సాగునీటి రంగంపై మాట్లాడే అవకాశం విద్యాసాగర్‌రావుకు కేసీఆర్ ఇస్తూ ఉండేవారు. ఆయన మాట్లాడితేనే ఆ అంశానికి సాధికారత వస్తుందని ఆయన నమ్మకం. విషయంలోని అంతస్సూత్రాన్ని పసిగట్టడంలోనే విద్యాసాగర్‌రావు నైపుణ్యం కనిపిస్తుంది. ఉదాహరణకు శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని 834 అడుగుల నుంచి 854 పెంచడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం ఏమై ఉంటుందో, అకస్మాత్తుగా ఎటువంటి సర్వేలు, డీపీఆర్‌లు లేకుండానే 165 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తి పోసే దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ పథకాన్ని ఎందుకు చేపట్టినారో, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా పోలవరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టిందో.. అంతరార్ధాన్ని ఆయన మాత్రమే వివరించి చెప్పగలిగేవారు. ఈ అవగాహన తర్వాత కాలంలో నేను మంత్రిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడింది. పుష్కలంగా నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తెలంగాణ అవసరాలకు వినియోగించుకోవడానికి రీ ఇంజనీరింగ్ చేపట్టడానికి విద్యాసాగర్‌రావు ఇచ్చిన అవగాహన ఎంతగానో ఉపయోగపడింది.
జల ఒప్పందాలలో పెద్ద దిక్కు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి సలహాదారుగా విద్యాసాగర్‌రావునే నియమించినారు. సాగునీటి శాఖలో ప్రతి కార్యక్రమంలో సలహాదారుగా తనవంతు పాత్రని ఆయన పోషించారు. ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన కొన్ని వందల గంటల మేధోమథనంలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు. అయన అపార అనుభవం ప్రాజెక్టుల రూపకల్పనలో కీలకమైనది. వారం వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్షా సమావేశాలకు, కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు ఆయనను తప్పనిసరిగా ఆహ్వానించేవాడిని. సాధ్యమైనప్పుడల్లా నేను కూడా పాల్గొనేవాడు.
ఢిల్లీలో కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో ఆయనకున్న సంబంధాలను పురస్కరించుకుని అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించే బాధ్యతను ఆయనకే అప్పగించేవాడిని. ఆయన ఎంతో దీక్షతో ఆ పనులని నెరవేర్చేవారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో, సుప్రీం కోర్టులో తెలంగాణ వాదనలు రూపొం దించడంలో ఆయనదే కీలక పాత్ర. అఫిడవిట్లు ఆయన ఆమోదించిన తర్వాతనే వాటిని సమర్పించడం జరిగేది. ఇప్పుడు అవన్నీ కీలకమైన దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో ఆయన లేకపోవడం పెద్ద లోటుగానే భావిస్తున్నాను. ఇక మహారాష్ట్రతో గోదావరిపై అంతర్రాష్ట్ర ఒప్పం దాలు కుదుర్చుకునే ప్రతీ సందర్భంలో కేసీఆర్ వెన్నంటి ఉండి విద్యాసాగర్‌రావు తనవంతు సహకారాన్ని అందించేవారు.
సొంతూరుకు మేలు చేయాలని..
ప్రభుత్వ సలహాదారు పదవి నిర్వహిస్తున్నా ఆయన సాదాసీదా జీవితం గడిపేవారు. అయన పదవిలో ఉండగా నా సహాయం కోసం అడిగినవి కూడా వారి∙వ్యక్తిగతానికి సంబంధించినవి కావు. దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న సామెత మనందరికీ ఎరుకే. విద్యాసాగర్‌రావు కన్న ఊరు జాజిరెడ్డిగూడెంను మరువలేదు. తన ఊరికి ఏదైనా చెయ్యాలని ఎంతో తపనపడ్డారు. ఆ ఊరి చెరువులు నింపి శాశ్వత వ్యవస్థ ఏర్పాటుకావాలని కోరుకున్నారు. జాజిరెడ్డిగూడెంలో ఒక మార్కెట్ యార్డుని మంజూరు చేయమని అడిగారాయన.
ఊరికి ఒక కల్యాణ మంటపం కావాలని కోరుకున్నారు. అందుకు తమ పూర్వీకుల ఇంటి జాగాని విరాళంగా ఇచ్చి నా చేతనే శంకుస్థాపన చేయించారు కూడా. అయన కోరినట్లు చెరువులని నింపడానికి ఎస్‌ఆర్‌ఎస్‌పీ డిస్ట్రిబ్యూటరీ నుంచి ఒక తూముని ఏర్పాటు చెయ్యమని అధికారులని ఆదేశించినాను. జాజిరెడ్డిగూడెంలో మార్కెట్ యార్డుని మంజూరు చేశాను. కల్యాణ మంటపం పనులని త్వరలోనే ప్రారంభింపజేసి ఆయన మొదటి వర్ధంతి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తాం. అర్వపల్లిలో ఉన్న ప్రాచీన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కోటి రూపాయలను ఇటీవలే మంజూరు చేశారు. జాజిరెడ్డిగూడెంలో ఆయన అనుకున్న పనులని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.
ఒక ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు
ప్రభుత్వం ఆయన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలని చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రొ. జయశంకర్ లాగానే విద్యాసాగర్‌రావుని క్యాన్సర్ భూతం మన నుంచి దూరం చేసింది. ఆయన మరణ ప్రకటన వెలువడిన తరువాత అధికారికంగా అంత్యక్రియలు జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఒక సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. సాగునీటి శాఖ అధికారులతో సంప్రదించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాం. విద్యాసాగర్‌రావు కన్న కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుంది. కృష్ణా , గోదావరి జలాల్లో తెలంగాణ కు న్యాయమైన వాటాను సాధిస్తాం. ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మారుస్తాం. ఇదే మేం విద్యాసాగర్‌రావు గారికి అర్పించే ఘనమైన నివాళి కాగలదు.
(వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి)
తన్నీరు హరీష్‌రావు