‘డిండి’ మళ్లీ మొదటికి!
- వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదనలో రిజర్వ్ ఫారెస్ట్
- రీ సర్వే చేయాలని కోరిన నీటి పారుదల శాఖ
- నార్లాపూర్–డిండి అలైన్‌మెంట్ పనుల్లో మరింత జాప్యం
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు సర్వే మళ్లీ మొదటికి వచ్చింది. నార్లాపూర్–డిండి అలైన్‌మెంట్‌కు వ్యాప్కోస్ సూచించిన రెండో ప్రతిపాదనలో రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో రీ సర్వే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో అటవీ సమస్యల కారణంగా కేంద్ర సంస్థల అనుమతులు క్లిష్టంగా మారిన నేపథ్యంలో.. ఇక్కడ అలాంటివి పునరా వృతం కాకుండా ఉండేందుకు నీటి పారుదలశాఖ రీ సర్వేకు ఆదేశించింది. శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునేందుకు నాలుగు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఇందులో వట్టిపల్లి, ఆలేరు, తెలకపల్లి గ్రామాల మీదుగా నీటిని తీసుకెళ్లి రంగాయపల్లి వద్ద పంప్‌హౌస్, గ్రావిటీ టన్నెల్ నిర్మించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి రూ.3,384.47 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరం సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వలు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపా దనపై పరిశీలన చేసిన ప్రాజెక్టు అధికా రులు రిజర్వ్ ఫారెస్ట్ అంశాన్ని గుర్తించారు. 5వ కి.మీ. నుంచి 20వ కి.మీ. వరకున్న అలైన్‌మెంట్ అంతా రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని తేల్చారు. ఇక రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ సైతం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని తేల్చారు. అటవీ ప్రాంతాన్ని తప్పించేందుకు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్ మార్గాన్ని తెలకపల్లి గ్రామం మీదుగా తరలించే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లుగా తెలిసింది. దీనిపై ప్రస్తుతం వ్యాప్కోస్ సర్వే చేస్తోంది. అది పూర్తయితేనే అలైన్‌మెంట్ ఖరారు కానుంది.
ఏడాదిగా కసరత్తు చేస్తున్నా..
నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తీసుకునే అలైన్‌మెంట్‌పై ఏడాదిగా కసరత్తు చేస్తున్నా ఎటూ తేలడం లేదు. మొదటగా కల్వకుర్తి ఆయకట్టు నష్టంపై అభ్యంతరాలు రాగా.. తర్వాత అలైన్‌మెంట్ అంచనా వ్యయాల్లో తేడాలొచ్చాయి. దీంతో కల్వకుర్తి ఆయకట్టుకు నష్టం లేకుండా అలైన్‌మెంట్ ఖరారు అంశాన్ని వ్యాప్కోస్‌కు కట్టబెట్టగా.. ఇదీ ఎటూ తేలడం లేదు. నార్లాపూర్ నుంచి డిండి అలైన్‌మెంట్ ఖరారు కానుందున.. ఆలోపు సింగరాజు పల్లి(0.8 టీఎంసీలు), గొట్టిముక్కల (1.8), చింతపల్లి(0.99), కిష్టరాంపల్లి (5.68), శివన్నగూడం (11.96 టీఎంసీల) రిజర్వాయర్లు.. వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ప్రభుత్వం టెండ ర్లు పిలిచి పనులు ఆరంభించింది. మొత్తం గా 7 ప్యాకేజీలకుగానూ రూ.3,940 కోట్ల పనులు చేపట్టింది. ఈ పనులు సాగుతు న్నా.. తొలి దశ పనులకు మాత్రం మోక్షం ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది.