‘డిండి’పై కొత్త వివాదం! | new controversy on dindi project | Sakshi
Sakshi News home page

‘డిండి’పై కొత్త వివాదం!

Published Sat, Feb 20 2016 3:09 AM | Last Updated on Tue, Oct 2 2018 7:51 PM

‘డిండి’పై కొత్త వివాదం! - Sakshi

‘డిండి’పై కొత్త వివాదం!

కల్వకుర్తి ఆయకట్టుపై పాలమూరు, డిండి ఇంజనీర్ల మధ్య విభేదాలు
90వేల ఎకరాలకల్వకుర్తి ఆయకట్టుకు నష్టం: పాలమూరు ఇంజనీర్లు
నష్టం తక్కువేనంటున్న డిండి ఇంజనీర్లు.. విభేదాలతో ఆగిన టెండర్లు

 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేర్పులపై వివాదం రగులుకుంది. డిండి ప్రాజెక్టు కొత్త అలైన్‌మెంట్‌తో తమ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆయకట్టుకు భారీగా నష్టం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఇంజనీర్లు... ఎవరి నుంచి ఏరకమైన ఫిర్యాదులు లేకపోయినా ‘పాలమూరు’ ఇంజనీర్లు కావాలని వివాదం చేస్తున్నారని నల్లగొండ ఇంజనీర్లు వాదనకు దిగుతున్నారు. తొలి ప్రతిపాదనల ప్రకారం శ్రీశైలంలో వరద ఉండే  60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీ నీటిని తరలించడం ద్వారా 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి తరలించేలా ప్రణాళిక తయారు చేశారు.

అయితే హైదరాబాద్ అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి.. ఈ నీటిని కూడా డిండి ద్వారా తరలించేలా కొత్తగా ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం శ్రీశైలం నుంచి రోజుకు 0.5 టీఎంసీలకు బదులు ఒక టీఎంసీ చొప్పున తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లుకాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుంది. దీంతో అంతదూరం నుంచి నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి... కాల్వల ద్వారా నీటిని తరలించాలని కొత్తగా ప్రతిపాదించారు.

 వివాదమంతా ఇక్కడే..
 డిండికి రోజుకు అదనంగా 0.5 టీఎంసీ సరఫరా పెంచాలని నిర్ణయించడంతో... పాలమూరు ప్రాజెక్టుకు కేవలం రోజుకు ఒక టీఎంసీ నీటి లభ్యతే ఉంటోంది. ఈ నేపథ్యంలో 60 రోజుల పాటు ఈ నీటిని తరలించి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కాదని పాలమూరు ప్రాజెక్టు అధికారులతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు అభ్యంతరం లేవనెత్తుతున్నారు. మారిన డిండి అలైన్‌మెంట్ కారణంగా కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వేల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక 430 మీటర్ల వద్ద కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తే... ఇర్విన్ దగ్గర 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం గల రిజర్వాయర్లను చేపట్టాల్సి వస్తుందని డిండి అధికారులు తేల్చారు. దీనిపైనా పాలమూరు అధికారులు అభ్యంతరం లేవ నెత్తారు.

వాటితో కల్వకుర్తి ఆయకట్టు మరికొంత దెబ్బతింటుందని చెబుతున్నారు. మరోవైపు డిండి ఇంజనీర్లు మాత్రం.. కొత్త డిజైన్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో అదనంగా 50వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని లెక్కలేశారు. అదే సమయంలో కల్వకుర్తి కింద 3 వేల ఎకరాలకు మించి నష్టముండదని అంటున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచి... డిండికి ఒక టీఎంసీ నీటిని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2 టీఎంసీల నీటిని తరలించాలని సూచిస్తున్నారు. తద్వారా రెండు ప్రాజెక్టులకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
 
 టెండర్లు ఆలస్యం
 డిండి ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో చేపట్టే రిజర్వాయర్ల టెండర్లను గత మంగళవారమే పిలవాల్సి ఉంది. కానీ కల్వకుర్తి ఆయకట్టు నష్టంపై తేలేవరకు టెండర్లు పిలవరాదని పాలమూరు ప్రాజెక్టు అధికారులు సూచించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇప్పటివరకు కల్వకుర్తి ఆయకట్టు చిత్రాలు అధికారుల వద్ద లేవు. పూర్తిస్థాయి సర్వే పూర్తయితేగానీ నష్టపోయే ఆయకట్టు ఎంతన్నది తేలే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు ప్రాంతాలు, ప్రస్తుత డిండి ప్రాజెక్టుతో నష్టపోయే ఆయకట్టు వివరాలను తెలపాలని డిండి సీఈ శుక్రవారం కల్వకుర్తి ఎస్‌ఈకి లేఖ రాశారు. ఈ వివాదంపై శనివారం మంత్రి హరీశ్‌రావు సైతం సమీక్షించే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement