డిండి.. ఈసారికి ఇంతేలెండీ! | Dindi Project Designs Rangareddy | Sakshi
Sakshi News home page

డిండి.. ఈసారికి ఇంతేలెండీ!

Published Tue, Oct 2 2018 12:27 PM | Last Updated on Tue, Oct 2 2018 12:27 PM

Dindi Project Designs Rangareddy - Sakshi

రాచకొండ ఎత్తిపోతల పథకం మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, ప్రతినిధి,రంగారెడ్డి: కరువు నేలకు ఇప్పట్లో సాగునీటి భాగ్యం లేనట్లే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన రాచకొండ ఎత్తిపోతల(డిండి) ప్రాజెక్టు డిజైన్‌ ఖరారుకు గ్రహణం వీడడం లేదు. దీంతో సేద్యపు జలాల కోసం ఇక్కడి రైతాంగం మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లక్ష ఎకరాల సాగు లక్ష్యంగా.. 50 నుంచి 100 చెరువులు, కుంటలను కృష్ణా జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తరలించి అటు నుంచి రాచకొండ ఎత్తిపోతలతో 0.10 టీఎంసీల నీటిని సాగు అవసరాలకు వినియోగించుకునేలా ఈస్కీ (ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా) ప్రతిపాదనలు తయారు చేసింది. రూట్‌ మ్యాప్‌ సర్వే, డీపీఆర్‌ తయారీ కోసం ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సర్వే పూర్తి చేసిన ఈస్కీ.. ప్రాజెక్టు రిపోర్టును చీఫ్‌ ఇంజ నీర్‌కు అప్పగించింది. ఈ డిజైన్‌ను పరిశీలించిన చీఫ్‌ ఇంజనీర్‌ స్వల్ప మార్పులను సూచించారు. దీంతో మరోసారి ప్రాజెక్టు స్వరూపం మార్చడానికి ఇంజనీర్ల బృందం కసరత్తు చేస్తోంది.

ఇప్పట్లో కష్టమే.. 
రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు డిజైన్‌ కొలిక్కి రాకపోవడంతో ఈ పథకం ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు నగారా మోగడంతో ప్రాజెక్టుకు మోక్షం లేనట్టే. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగితే డిండి ప్రాజెక్టుకు అంకురార్పణ చేయాలని ప్రభుత్వం భావించినా ప్రస్తుత పరిస్థితులతో ముందుకు కదల్లేని పరిస్థితి తలెత్తింది.  

ప్రాజెక్టు స్వరూపం ఇలా.. 

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని 4 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, 4.50 కి.మీల సొరంగం ద్వారా యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలం వావిల్లపల్లి పైభాగాన 2.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఒక రిజర్వాయర్, అక్కడి నుంచి లిఫ్ట్‌ ద్వారా ఆరుట్ల శివారులో 2.62 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రెండో రిజర్వాయర్, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల, యాచారం మండలం గునుగల్‌ గ్రామాల మధ్య ... ఒక టీఎంసీ కెపాసిటీతో మూడో రిజర్వాయర్‌ను నిర్మించే విధంగా ఈస్కీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ రిపోర్టు, రూట్‌ మ్యాప్‌ను పరిశీలించిన నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశం గ్రావిటీ కాల్వల నిర్మాణంపై కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం ఈస్కీ మరోమారు ప్రాజెక్టు స్వరూపాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమైంది.

నిధులకు ఢోకాలేదు 
ఈస్కీ బృందం రూపొందించిన డిజైన్‌లో ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కొన్ని సూచనలు చేశారు. దీనికి అనుగుణంగా మరోసారి రూట్‌ మ్యాప్‌ను తయారు చేసే పనిలో ఈస్కీ నిమగ్నమైంది. త్వరలో ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.  –శ్యాంప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement