నీరూ.. నిప్పు! | Politics Started Around the Irrigation Projects in the Nalgonda District | Sakshi
Sakshi News home page

నీరూ.. నిప్పు!

Published Fri, Aug 23 2019 11:03 AM | Last Updated on Fri, Aug 23 2019 11:05 AM

Politics Started Around the Irrigation Projects in the Nalgonda District - Sakshi

సాక్షి, నల్లగొండ : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ రాజకీయం మొదలైంది. నిధులు ఇవ్వడం లేదని, జిల్లా రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రతిగా.. అసలు ప్రాజెక్టులను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ అనవసర విమర్శలు చేస్తోందని, తెలంగాణ ఏర్పాటై టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎక్కువగా విడుదల అవుతున్నాయని అధికార పార్టీ నాయకులు ప్రతివిమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా ప్రా జెక్టుల వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. జిల్లాలోని  శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలు.. ఇలా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ చర్చనీయాంశమయ్యాయి.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. బ్రాహ్మణ వెల్లెంల, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులపై ప్రభుత్వ విధానాలను తూర్పారా బట్టారు. అదే మాదిరిగా, నల్లగొండ ఎంపీ, టీ.పీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతిగా, శాసనమండలి సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ ఇరువురు ఎంపీల ప్రకటనలపై మండిపడ్డారు. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేయడం లేదని, ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. ఈనెల 26వ తేదీన బ్రాహ్మణవెల్లెంల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు పాదయాత్ర ద్వారా హైదరాబాద్‌ జల సౌధకు చేరుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. దీనికోసం ఆయన పోలీసుల అనుమతి కోరనున్నట్లు ప్రకటించారు. ఒకవేళ పోలీసులు అనుమతిని నిరాకరిస్తే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయ రంగం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇవీ... పెండింగ్‌ ప్రాజెక్టులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో, రెండోసారి 2018లో ఏర్పాటైన ప్రభుత్వంలో రెండు పర్యాయాలు కూడా ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టింది. ‘ నీళ్లు–నిధుల–నియామకాలు ’ అన్న నినాదంతోనే  తెలంగాణ ఉద్యమం సాగిందని, స్వరాష్ట్రం సిద్ధించాక తమ నినాదాన్ని మరిచిపోయి, జిల్లాలో ప్రాజెక్టులను ఏమ్రాతం పట్టించుకోవడం లేదని, బడ్జెట్‌లో నిధులు కేటాయించడం లేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు ఎక్కడివక్కడ నిలిచిపోగా.. నిధులూ అంతంత మాత్రంగానే విడుదల చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ సొరంగం పనులు పూర్తయితే.. నేరుగా శ్రీశైలం రిజర్వాయరు నుంచే నీటిని తీసుకోవడం ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుకు, అక్కడి నుంచి ఎఎమ్మార్పీ కాల్వల ద్వారా ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథానికి నీళ్లు అందుతాయనని చెబుతున్నారు. కానీ, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు ఏళ్లుగా కొనసాగుతుండడంపై ఈ ప్రాంత నాయకులు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతోపాటు డిండి ఎత్తిపోతల పథకం, పిలాయిపల్లి, ధర్మారెడ్డి , బునాదిగాని కాల్వల పనులు పూర్తికావడం లేదు. దీంతో అనుకున్న మేర రైతులకు సాగునీరు అందడం లేదు. ఈ అంశాలన్నింటిపైనా కాంగ్రెస్‌ నాయకులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. 

తెలంగాణ ప్రభుత్వంలోనే నిధులు : గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ఫ్లోరైడ్‌ ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు రూ.6,500 కోట్లతో డిండి ప్రాజెక్టు పనులు చేపట్టాం. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్ట్‌ మరో 10.5 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.2,150 కోట్లు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కి కేటాయిం చాం. 2021 డిసెంబర్‌ కల్లా ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి కాంట్రాక్ట్‌ కంపెనీ జయప్రకాష్‌ అండ్‌ కంపెనీ ఒప్పం దం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతనే  బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించి రిజర్వాయర్‌ పూర్తి చేశారు. మరో 11 నెలల్లో సొరంగమార్గం పూర్తి చేసి నీటి విడుదల చేస్తాం. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ప నులకు రూ.260 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిది. 

ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ
బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ. రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరినా ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్‌ హయాంలోనే యాభై శాతం పనులు పూర్తయ్యాయి. ధనిక రాష్ట్రమని చెబు తున్న సీఎం ఎందుకు బునాదిగాని కాల్వ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులపై ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు. కాంగ్రెస్‌కు మంచిపేరు వస్తదనే భయంతోనే పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. 5వేల మందితో పాదయాత్రగా జలసౌధకు వెళతా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement