చేప పిల్లలు మింగేశారు..! | Fraud In Govt Free Fish Distribution In Joint Nalgonda District | Sakshi
Sakshi News home page

చేప పిల్లలు మింగేశారు..!

Published Mon, Sep 30 2019 8:28 AM | Last Updated on Mon, Sep 30 2019 8:28 AM

Fraud In Govt Free Fish Distribution In Joint Nalgonda District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

‘‘ చేప పిల్లలను మింగేశారు.. ఇదేంటి.. మృగశిరకార్తె కూడా కాదు.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేపమందు పంపిణీ చేయడం లేదు.. మరి చేప పిల్లలను మింగేయడం ఏంటని అనుకుంటున్నారా..! అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదీ.. మత్స్యశాఖ అధికారుల మాయాజాలం.’’ వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల చేప పిల్లలను డిండి మండల పరిధిలోని చెరువుల్లో ఆ శాఖ అధికారులు పోయాల్సి ఉండగా సగానికి సగం మాయం చేసేసి ఆ చెరువుల్లోనే వాటిని వదిలామని చెబుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. 

సాక్షి, దేవరకొండ:  డిండి మండల పరిధిలో నీటి సౌకర్యం ఉన్న చెరువులు, కుంటలు సుమా రు 20 వరకు ఉన్నాయి. చేపల వేటనే జీవనధారంగా చేసుకుని మండలంలో దాదాపు 500 మంది మత్యకారులు బతుకుతున్నారు. అయితే  వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మండలంలోని తంబాలబండ, ఏనెకుంట, మొద్దులకుంట, బాపన్‌కుంట, కాంట్రోన్‌కుంట తదితర చెరువుల్లో నీటి సౌకర్యం ఉన్నందున 6.60 లక్షల చేప పిల్లలను వదిలేందుకు మత్య్సశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. 

లెక్కింపు యంత్రం లేకుండానే..
అధికారుల ప్రతిపాదనల మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు డిండి మండలానికి ఈ నెల 19వ తేదీన 6.60 లక్షల చేప పిల్లలను పంపించారు. అదే రోజు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చేప పిల్లల లెక్కింపు యంత్రం లే కుండానే ఆయా చెరువుల్లో వాటిని వదిలేశారు. 

మిగిలిన 3.20 లక్షల చేప పిల్లలు ఏమైనట్టు..?
మండలంలోని ఆయా చెరువుల్లోని మత్స్య సహకార సొసైటీ సభ్యుల లెక్కల ప్రకారం మత్స్యశాఖ అధికారులు ఆయా చెరువుల్లో వదిలింది.. 3.40 లక్షల చేప పిల్లలే. అయితే మిగిలిన చేప పిల్లలు ఏమయ్యాయని అధికారులను కోరితే ఆయా చెరువుల్లోనే సర్దేశామంటూ పొంతలేని సమాధానాలు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి చెరువులో చేప పిల్లలు వదిలిన తర్వాత మళ్లీ పోయాలంటే సొసైటీ సభ్యుల తీర్మానం, ఉన్నతాధికారుల ఉత్తర్వులు ఉండాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుం డా అధికారులు బుకాయిస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత శాఖ క్షేత్ర స్థాయి అధికారులు చేప పిల్లలను పక్కదారి పట్టించి ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయించుకున్నారని మత్స్యసహకరా సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

వర్షపాతం లెక్కలు చూడకుండానే..
ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చెప పిల్లలు వదిలే కార్యక్రమంలో భాగంగా సంబంధిత మత్స్యశాఖాధికారులు ముందుగానే మండలంలో వర్షపాతం ఎలా ఉంది? చెరువులు, కుంటల్లో ఏ పాటి నీరు ఉందోనని గుర్తించిన తర్వాతే ఆ నీటికి తగినట్లుగా చేప పిల్లలను వదిలే నివిదికను ఉన్నతాకారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మండల మత్స్యశాఖాధికారులు అలాంటి లెక్కలేమి లేకుండా సుమారుగా లెక్కలు వేసి ఇచ్చిన నివేదిక ప్రకారంగా వచ్చిన చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలారు. మండలంలోని చెరువులు, కుంటల్లోకి డిండి ప్రాజెక్టు ద్వారా, లేదా వర్షాధారంతోనే నీరు చేరుతోంది. ప్రస్తుతం డిండి ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. అదే విధంగా ఐదు నెలలుగా మండలంలో కురవాల్సిన దానికంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో  నెల రోజుల పాటు వర్షం కురవకపోతే చేప పిల్లలు వదిలిన సదరు కుంటల్లో మూడు మాత్రం పూర్తిగా ఎండిపోయే ప్రమా దం ఉంది. అలాగైతే ఆ చేప పిల్లలు బతికే పరి స్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. 

అధికారుల మాయాజాలం
మండలంలోని ఆయా చెరువుల సొసైటీ సభ్యుల నిర్ణయం మేరకు అంతంతమాత్రంగానే ఉన్నా చెరువుల్లో నిర్ణయించిన మేరకు చేప పిల్లలను వదిలే అవకాశం లేదని మత్స్యసహకార సొసైటీ సభ్యులు తేల్చారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని ఏం చక్కా వినియోగించుకున్నారు. లెక్కించే యంత్రం లేకుండానే తంబాలబండ చెరువులో 2,95,800 చేప పిల్లలను వదలాల్సి ఉండగా లక్ష పిల్లలను మాత్రమే వదిలారు. అదే విధంగా ఏనెకుంటలో 97,500కు 50వేలు, మొ ద్దులకుంటలో 70,500కు 20 వేలు, బాపన్‌కుం టలో 1,20,000లకు 1,20,000, కాంట్రోన్‌కుం టలో 76,200కు 50వేల చొప్పున వదిలారు.

చేప పిల్లలు పోయలేదు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చెప పిల్లలను మండలలోని చెరువులు, కుంటలకు పంపిన ప్రతిపాదలన ప్రకారంగా వదలలేదు. ఇదేమిటని సంబందితాధికారులను నిలదీయగా ఈ చెరువులో నీరు తక్కువగా ఉందని వేరే చెరువులో వదులుతామని  సమాధానం ఇచ్చారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి  ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. 
– నూకం చంద్రయ్య, మత్స్యకారుడు, డిండి

నీరులేక అడుగంటి పోతున్నాయి
మండలంలో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో  డిండి ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. చెరువుల్లో వదిలిన చేప పిల్లలు బతికేందుకు కేఎల్‌కేవై ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీరందించి తద్వారా మండలంలోని చెరువులు, కుంటలు నింపాలి. 
– తవిటి సైదులు, మత్స్యకారుడు

అమ్ముకున్న మాట అవాస్తవం
రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత చెప పిల్లలను ఇటీవల మండలంలోని పలు కుంటల్లో  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వదిలాం. దీనిపై మండల కేంద్రానికి చెందిన పలువురు మత్స్యకారులు అక్రమంగా చెప ప్లిలలను సంబంధిత అధికారులు అమ్ముకున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. 
మారయ్య, ఎఫ్‌డీఓ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement