సాక్షి, నల్లగొండ: జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టును మినహాయిస్తే అత్యధిక శాతం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వారే అధికం. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ విద్యుత్ మోటార్లు ఇక్కడే ఉన్నాయి. సహజంగానే విద్యుత్ వినియోగం కూడా జిల్లాలోనే ఎక్కువ. తాజా బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టులకు నామ మాత్రంగా కూడా నిధులు కేటాయించలేదు. ఒక్కో ప్రాజెక్టుకు కోట్ల రూపాయల్లో బకాయిలు ఉండగా, కనీసం సిబ్బంది జీత భత్యాలకు సరిపడినంత కూడా నిధులు కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అరకొరగా ఇస్తున్న బడ్జెట్ కేటాయింపులు ఉద్యోగుల జీత భత్యాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులకే సరిపోతుండడంతో ప్రాజెక్టుల పనులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న విధంగా తయారయ్యాయి. జిల్లాలోని ఏఎమ్మార్పీ/ఎ స్‌ఎల్‌బీసీ, డిండి, ఉదయం సముంద్రం– బ్రా హ్మణ వెల్లెంల, మూసీ ప్రాజెక్టుల్లో కేవలం డిండి కి మాత్రమే ఓ మాదిరి కేటాయింపులు జరిపారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం
2005లో సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2,853కోట్లతో చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) 2010 వరకు పూర్తి కావాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం ఇన్‌లెట్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా మన్నెవారిపల్లి గ్రామపంచాయతీ కేశ్యతండా ఔట్‌లెట్ వరకు 43కిలోమీటర్ల ఇన్‌లెట్ సొరంగ మార్గాన్ని, అలాగే నక్కలగండి తండా ఇన్‌లెట్ నుంచి నేరెడుగొమ్ము ఔట్‌లెట్ వరకు మరో 7 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు ఉన్నాయి. 2010 నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 60 శాతం కూడా పూర్తి కాకపోవడంతో 2012లో ప్రాజెక్టు నిర్మాణ కాల పరిమితిని 2017 డిసెంబర్ వరకు పెంచారు. ఇప్పుడు కాస్తా 2020 నాటి వరకు అవకాశం కల్పించారు. గత బడ్జెట్‌లో రూ.700 కోట్లుగా పేర్కొని రూ.500కోట్లకు సవరించారు. కాగా ఈ బడ్జెట్‌లో కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈప్రాజెక్టుకు ప్రభుత్వం నీళ్లొదిలిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.752.71 పేరుకుపోయాయి. ఏఎమ్మార్పీకి అనుసంధానించేలా రూపొందిం చిన ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగంగా ఉన్న నక్కలగండి బండ్ నిర్మాణం పనులూ వేగం పుంజుకోలేదు. నాగార్జున సాగర్ లో లెవల్ కెనాల్, ఏఎమ్మార్పీలోనే అంతర్భాగంగా ఉన్న ఉదయ సముద్రం–బ్రాహ్మణవెల్లెంలకు అసలు నిధులే ఇవ్వలేదు.
ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం
2009లో నాటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో మొదలైన ఉదయసముద్రం–బ్రాహ్మణ వెల్లెంల పనులు ముందుకు పడడం లేదు. ఆయకట్టేతర ప్రాంతమైన నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నకిరేకల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, వీటితో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం, నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండలాలకు తాగునీటితో పాటు, సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టుకు దశాబ్ధ కాలంగా అరకొర నిధులే ఇస్తున్నారు. నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగంగా చేపట్టారు. రూ.699కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా పనులు కొనసాగుతున్నాయి. ఈ బడ్జెట్‌లో పైసా విదిల్చలేదు. భూ సేకరణకు రూ.200 కోట్లు, మిగిలిన పనులన్నీ పూర్తి చేయడానికి మరో రూ.250కోట్లు వెరసి రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు.
డిండి
దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో 3.4లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీ టిని అందించేందుకు మూడున్నరేళ్ల కిందట మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. రూ.6,190కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఐదు రిజర్వాయర్లను నిర్మించనున్నారు. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో 7 టీఎంసీల సామర్థ్యం, చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి వద్ద 5.7 టీఎంసీలు, చింతపల్లి మండల కేంద్రంలో 1.9 టీఎంసీలు, గొట్టిముక్కల వద్ద 1.835 టీఎంసీలు, డిండి మండలం సింగరాజుపల్లి వద్ద 7 టీఎంసీల సా మర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయిం చారు. ఇప్పటికే ఈ పనులు ప్రారంభం కాగా ఇంకా 4,350 ఎకరాల భూమిని రైతులనుంచి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం అదేమీ పట్టించుకోవడం లేదు. ఈ బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.90.87 కోట్లు మా త్రమే కేటాయించారు. ఆరువేల కోట్ల రూపాయల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరీ ఇంత చిన్న మొత్తంలో నిధులు కేటాయిస్తే పనులు పూ ర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ ప్రాజెక్టులో రూ.345.93కోట్లు పెండింగు బిల్లులు చెల్లించాల్సి ఉంది.
మూసీ
మూసీ ప్రాజెక్టు 1963లోనే అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ లక్ష్యం నెరవేరలేదు. నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందివ్వలేకపోతోంది. ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం 41వేల 800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరివ్వడం. రూ.2.20కోట్ల నిర్మాణ వ్యయంతో పూర్తయిన ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలంటే కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. నిర్వహణ నిధులు మినహా మరమ్మతుల కోసం ఇప్పటి దాకా ఇచ్చింది కేవలం రూ.19కోట్లు. వీటితో ఇతరత్రా పనులన్నీ పూర్తయినా, కాల్వల లైనింగ్ సహా ఇతర ఆధునీకరణ పనులు మొదలే కాలేదు. గత బడ్జెట్‌లో రూ.4.62 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ సారి మరింత తగ్గించి రూ.4.17కోట్లు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో చెల్లించాల్సిన బకాయిలే రూ.12.24 కోట్లు ఉండడం గమనార్హం. మొత్తంగా జిల్లాలోని ప్రాజెక్టులకు అరకొరగా నిధులు ఇస్తుండడంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రాజెక్టులు పూర్తయ్యి, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో, బీడు భూములకు సాగునీటిని ఎప్పటికి అందిస్తాయో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం
2005లో సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2,853కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. 2010 నాటికే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును 2020 వరకు పూర్తిచేయాలని అవకాశం కల్పించారు. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించడంతో దీనికి ప్రభుత్వం నీళ్లొదిలిందా అన్న అనుమానాలు
వ్యక్తం అవుతున్నాయి.
ఉదయ సముద్రం
నకిరేకల్, తుంగతుర్తి, నల్లగొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగు,సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టుకు దశాబ్ద కాలంగా అరకొర నిధులే ఇస్తున్నారు. రూ.699కోట్ల అంచనా వ్యయంతో మొదలైన దీనిని రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో పైసా విదిల్చలేదు. మొత్తం రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు.
డిండి..
దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలో 3.4లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతా లకు తాగునీ టిని అందించేందుకు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.6,190కోట్లతో చేపడుతున్న దీని పరిధిలో ఐదు రిజర్వాయర్లను నిర్మించనున్నారు. వీటి పనులు ప్రారంభమైనప్పటికీ ఇంకా 4,350 ఎకరాల భూమిని రైతులనుంచి సేకరించాల్సి ఉంది.
మూసీ
మూసీ ప్రాజెక్టు నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతోంది. మొత్తానికి నీరు అందాలంటే ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలి. ఇందుకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఈ సారి బడ్జెట్‌లో రూ.4.17కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో చెల్లించాల్సిన బకాయిలే రూ.12.24 కోట్లు ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment