నార్లాపూర్ నుంచే ‘డిండి’కి నీరు?
♦ అక్కడ్నుంచి అయితేనే కల్వకుర్తి ఆయకట్టు నష్టం తగ్గింపు
♦ ప్రభుత్వానికి నీటిపారుదల నిపుణుల సూచన
♦ ఈ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్న ముఖ్యమంత్రి
♦ త్వరలోనే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోనే ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని మళ్లించే ప్రణాళికను దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యాపక్కనపెట్టాలని యోచిస్తోంది. నార్లాపూర్ నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని (ఇన్‌టేక్ కెపాసిటీ) 2 నుంచి 3 టీఎంసీలకు పెంచి అందులో 2 టీఎంసీలు పాలమూరు ప్రాజెక్టుకు, మరో టీఎంసీ డిండికి తరలించడం ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రయోజనాలను కాపాడవచ్చంటున్న నీటిపారుదల రంగ నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి త్వరలోనే అధికారులు, రెండు జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
మారిన ప్రతిపాదనలు...
డిండి మొదటి ప్రతిపాదన ప్రకారం శ్రీశైలంలో వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి తరలించాలని అధికారులు ప్రణాళిక తయారు చేశారు. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాలకు లక్ష ఎకరాలకు నీరిచ్చేందుకు మరో 10 టీఎంసీలు అవసరమని లెక్కించి వాటిని డిండి ద్వారానే తరలించేలా కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో మొత్తంగా శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీలు కాకుండా ఒక టీఎంసీ నీటిని డిండికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాలమూరు ప్రాజెక్టులో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీటిని తరలించాలని ప్రతిపాదనలు కూడా తయారయ్యాయి. కానీ ఏదుల రిజర్వాయర్ ఎత్తు 445 మీటర్లుకాగా, అప్పర్ డిండి ఎత్తు 396 మీటర్లు ఉంటుందని... అక్కడి వరకు నీటిని తరలించే బదులు ఏదుల రిజర్వాయర్‌ను 430 మీటర్ల ఎత్తు వద్దే నిర్మించి అక్కడి నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని అధికారులు కొత్తగా ప్రతిపాదించారు. 430 మీటర్ల ఎత్తు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ఇర్విన్, జేపల్లి వద్ద కొత్త రిజర్వాయర్‌ల ఏర్పాటుతోపాటు కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు.
కొలిక్కి తెచ్చే యత్నాల్లో ప్రభుత్వం...
డిండి అలైన్‌మెంట్‌తో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 90 వే ల ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉంటుందని మహబూబ్‌న గర్ జిల్లా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటీవలే సర్వే చేసిన అధికారులు..ఆయకట్టు నష్టం 27,551 ఎకరాల మేరకే ఉంటుందని తేల్చారు. ఇందులో కల్వకుర్తి ప్యాకేజీ 29లో 20,122 ఎకరాలు, ప్యాకేజీ 30లో మరో 7,629 ఎకరాలకు నష్టం ఉంటుందని లెక్కించారు. ఈ లెక్కలతో నల్లగొండ జిల్లా ప్రతినిధులు విభేదిస్తున్నారు. పాల మూరులోని ఇతర రిజర్వాయర్‌ల కింద నష్టపోయే ఆయకట్టును డిండి నష్టం కింద లెక్కగడుతున్నారని..దీంతోపాటే భూసేకరణనూ ఇందులో కలిపారని వాదిస్తున్నారు. ఈ సమస్యను కొలిక్కి తెచ్చే యోచనలో సీఎం ఉన్నారు.