భట్టి విక్రమార్క మల్లు
సాక్షి, తవక్లాపూర్ (దేవరకొండ) : దళిత, గిరిజనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ముఖాముఖీ-పొలం బాట, పోరుబాటలో భాగంగా ఆయన బ్రుందం దేవరకొండ నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి రైతులతో ముఖాముఖీ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకే సీఎల్పీ బ్రుందం బయలుదేరిందని భట్టి విక్రమార్క తెలిపారు. రాజకీయ సమావేశాల కోసమో, ఎన్నికల కోసమో కాంగ్రెస్ శాసనసభా పక్షం రాలేదని, కేవలం రైతాంగం కోసం, ప్రజల కోసం మాత్రమే రాష్ట్రమంతా తిరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రం వ్యవహరిస్తున్న రైతాంగా విధానలతో రైతులు ఆందోళనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
రైతులు దేశానికి వెన్నుముక వంటి వారని... అటువంటి వెన్నుముకను విరగ్గొట్టి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రైతులను కాపాడేందుకు, వారి గొంతును వినిపించేందుకు సీఎల్పీ, కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. కోనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే బతుకులు ఏమవుతాయనే భయాందోళనలో రైతులు ఉన్నారన్నారు. ఐకేపీ సెంటర్లు తీసేస్తే.. పండించిన పంటలను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు లేకపోతే.. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను ముంచేస్తారన్నారు. రైతుల పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉన్నా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని ఆయన పేర్కొన్నారు. కనీస మద్దతు ధర లేక, కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తే.. పోరాటం తప్ప మరో మార్గం లేదన్న భావనలో రైతాంగం ఉందని చెప్పారు.
రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం దాగున్నాయని.. ఈ నేపథ్యంలో మరో ఉద్యమానికి రైతులు సిద్ధమవుతున్నారన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే గ్రామంలో వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని, అలాగే 700 ఫెన్షన్లు కూడా మంజూరు చేసిందని ఈ సందర్భంగా తెలిపారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, కొత్తగా ఒక్క ఫెన్షన్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్.. తరువాత కొత్తగా భూమి ఇవ్వకపోగా నాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చెప్పిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ పంచిన భూములను, నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దళిత, గిరిజనులకు పంచిన భూములను లాక్కుంటుంటే.. చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు.
ఇక ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకువస్తానని చెప్పిన కేసీఆర్.. 5 ఏళ్లుగా ఒక్క ఎకరాకైనా నీళ్లు పారించారా? అన్నారు. డిండి పేరుమీద వేల కోట్ల రూపాయలు విడుదల చేసి కాలువలు తవ్వించారు కానీ.. అసలు డిండికి నీళ్లు ఎక్కడ నుంచి తసుకువస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. చెరువు ఎక్కడుందో చెప్పకుండా కాలువలు తవ్వితే ఎలా అన్నారు. డిండి ప్రాజెక్టపై ఇప్పటికైనా ఈ ప్రాంత వాసులకు నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీనే ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, ఫెన్షన్లు, వంద రోజులు పనిని, ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇచ్చిందని, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే.. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఏడేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసింది శూన్యమేమే తప్పా మరేమీ లేదని విమర్శించారు.
ఈ విషయాలపై లెక్కలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని భట్టి ప్రజలకు చెప్పారు. కేసీఆర్ పాలనతో ఏడేళ్లుగా పేదలు, దళిత, గిరిజనులు మోసానికి గురవుతున్నారన్నారని, పేదలకు రావాల్సిన ఇళ్లు రావడం లేదని, ఉద్యోగాలు, పెన్షన్లు రావడం లేదని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తానన్న ఈ ముఖ్యమంత్రిని డిండి ప్రాజెక్టులోనో, లేక బంగాళా ఖాతంలోకో ఎత్తేయాలని భట్టి ధ్వజమెత్తారు. కాగా ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎస్టీ సెల్ ఛైర్మన్ జగన్ లాల్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment