మూడు కుటుంబాల్లో తీరని శోకం
దేవరకొండ/: వారంతా యువత...అందరూ బంధువులే. భవి ష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకరు ఉద్యోగం చేస్తుండగా మరొకరు ఉద్యోగ వేటలో ఉన్నారు. ఇంకొకరు ఇంజినీరింగ్ చదువుతుండగా మరొకరు.. ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్నారు..మరో విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన వీరిని చూసి..విధి వక్రించింది. తాత చినకర్మకు హాజరైన వీరు డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో సరదాగా స్నానానికి వెళ్లారు. లోతు తెలియక లోనికి వెళ్లారు. గుం తలో కూరుకుపోయి మృత్యువాతపడ్డారు. చేతికి ఎదిగిన పిల్లలు ఒక్కసారిగా శవాలై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల రోదన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది.
డిండికి చెందిన దోవతి మల్లారెడ్డి (85) పది రోజుల క్రితం మరణించగా ఆదివారం ఆయన దశదిన కర్మ జరిగింది. సోమవారం మల్లారెడ్డి పెద్దకుమారుడు దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి(30),ప్రణీత్‌రెడ్డి(20), రెండవ కుమారుడు కర్ణాకర్‌రెడ్డి కుమార్తెలు జ్యోత్స్న (20), దేవమణి(17), మల్లారెడ్డి బావమరిది వరంగల్ జిల్లా వనపర్తికి చెందిన నర్సిరెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి(20), మూడవ కుమారుడు సుధాకర్‌రెడ్డి కుమారుడు అరవింద్‌రెడ్డి, మరో బంధువుల అమ్మాయి కలిసి డిండి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో స్నానం కోసం వెళ్లారు. హర్షవర్దన్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, జ్యోత్స్న, దేవమణి నీటిలో మునిగి చనిపోగా, వారిని కాపాడబోయిన అవినాష్‌రెడ్డి కూడా మునిగి మృత్యువాత పడ్డాడు.
గోతుల వల్లే..ప్రమాదం
డిండి ప్రాజెక్టు శిఖం భూమిలో గతంలో కొంతమంది కాంట్రాక్టర్‌లు రోడ్డు పనుల నిమిత్తం జేసీబీ సాయంతో మట్టి తోడి రోడ్డు పనులకు ఉపయోగించారు. ఒడ్డు వెంబడే కదా అని సరదాగా గడుపుదామని వెళ్తే మృత్యుగుంతలుగా మారి ఐదుగురి ప్రాణాలను బలిగొన్నాయని గ్రామస్తులు తెలిపారు.
వంశాంకురం లేకుండా..
దత్తారెడ్డికి ఇద్దరు కుమారులు.. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్చిల్ మండలంలోని ఏపీజీవీబీలో క్యాషియర్. పెద్దకుమారుడు హర్షవర్దన్‌రెడ్డి ప్రైవేటు జాబ్ చేస్తుండగా, తమ్ముడు ప్రణీత్‌రెడ్డి ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరు కుమారులతో ఆ..కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. తాత చినకర్మలో పాల్గొన్న ఇద్దరూ తలనీలాలు తీయించుకున్నారు. ఈత.. సరదా వారి ప్రాణాలు తీసింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో దత్తారెడ్డికి వంశాంకురం లేకుండాపోయింది. కరుణాకర్‌రెడ్డి.. డిండిలోనే టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరిని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన కోరిక. అందుకే పెద్దకుమార్తె జ్యోత్స్నను హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నాడు. జ్యోత్స్న ప్రస్తుతం ఫైనలియర్ చదువుతోంది. చిన్నకూతురు దేవమణి డిండిలోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది.
కొడుకులైనా..కూతుళ్లయినా ఒక్కటేనని.. కరుణాకర్‌రెడ్డి పిల్లలకు ఏదీ తక్కువ చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ఆ.. ఇద్దరు కూతుళ్లు తండ్రిని విడిచి కానరాని లోకాలకు వెళ్లడంతో అతని రోదన వర్ణనాతీతం. మల్లారెడ్డి బావ వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలంలోని వనపర్తికి చెందిన నర్సిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు అవినాష్‌రెడ్డిది బీటెక్ పూర్తయ్యింది. ఉద్యోగ వేటలో ఉన్నాడు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కూడా వచ్చింది. రేపోమాపో విదేశాలకు వెళ్తావనుకుంటే.. ఎవరికీ కానరాని లోకాలకు వెళ్లావా అంటూ అతని తల్లిదండ్రులు, బంధువుల రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.