four peoples died
-
పెళ్లికి వెళ్లి వస్తూ..
సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు: వరంగల్–ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. నెల్లికుదురు మండలం వావిలాలకి చెందిన నల్ల శ్రీనివాస్‌రెడ్డి (40), చిన్నాన్న కుమారుడైన అజిత్‌రెడ్డి వివాహం ఖమ్మంకు చెందిన అమ్మాయితో శుక్రవారం తొర్రూరు మండలం ఫత్తేపురంలో జరిగింది. ఈ పెళ్లికి శ్రీనివాస్‌రెడ్డి తన తల్లి లక్ష్మి (58), భార్య మాధవి (32), పెద్ద కూతురు కృష్ణవేణి(8), చిన్నకూతురు లిఖ్తిత (5)తో కలిసి కారులో వెళ్లారు. పెళ్లి అనంతరం కారులోనే ఇంటికి తిరిగి బయల్దేరారు. అయితే ఖమ్మం వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంతో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జనుజ్జయ్యింది. కారు నడుపుతున్న శ్రీనివాస్‌రెడ్డి, పక్కనే కూర్చున్న భార్య మాధవి, వెనుక కూర్చున్న తల్లి లక్ష్మి, కూతురు కృష్ణవేణి కారులోనే ఇరుక్కొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మేనత్త ఆపడంతో ప్రాణాలతో.. శ్రీనివాస్‌రెడ్డికి తోబుట్టువు కళ్యాణి కూడా భర్త తో పెళ్లికి వచ్చింది. కళ్యాణి కూడా వావిలాలకి రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె శ్రీనివాస్‌రెడ్డి చిన్న కుమార్తె లిఖ్తితను తన వద్ద వదిలి వెళ్లమని.. తమతో పాటు తీసుకొస్తామని చెప్పింది. దీంతో చిన్నారిని వదిలి శ్రీనివాస్‌రెడ్డి కారులో బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. మేనత్త ఆపడంతో లిఖ్తిత ప్రమాదం బారిన పడకుండా బయటపడింది. -
మూడు కుటుంబాల్లో తీరని శోకం
దేవరకొండ/: వారంతా యువత...అందరూ బంధువులే. భవి ష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకరు ఉద్యోగం చేస్తుండగా మరొకరు ఉద్యోగ వేటలో ఉన్నారు. ఇంకొకరు ఇంజినీరింగ్ చదువుతుండగా మరొకరు.. ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్నారు..మరో విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన వీరిని చూసి..విధి వక్రించింది. తాత చినకర్మకు హాజరైన వీరు డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో సరదాగా స్నానానికి వెళ్లారు. లోతు తెలియక లోనికి వెళ్లారు. గుం తలో కూరుకుపోయి మృత్యువాతపడ్డారు. చేతికి ఎదిగిన పిల్లలు ఒక్కసారిగా శవాలై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల రోదన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిండికి చెందిన దోవతి మల్లారెడ్డి (85) పది రోజుల క్రితం మరణించగా ఆదివారం ఆయన దశదిన కర్మ జరిగింది. సోమవారం మల్లారెడ్డి పెద్దకుమారుడు దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి(30),ప్రణీత్‌రెడ్డి(20), రెండవ కుమారుడు కర్ణాకర్‌రెడ్డి కుమార్తెలు జ్యోత్స్న (20), దేవమణి(17), మల్లారెడ్డి బావమరిది వరంగల్ జిల్లా వనపర్తికి చెందిన నర్సిరెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి(20), మూడవ కుమారుడు సుధాకర్‌రెడ్డి కుమారుడు అరవింద్‌రెడ్డి, మరో బంధువుల అమ్మాయి కలిసి డిండి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో స్నానం కోసం వెళ్లారు. హర్షవర్దన్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, జ్యోత్స్న, దేవమణి నీటిలో మునిగి చనిపోగా, వారిని కాపాడబోయిన అవినాష్‌రెడ్డి కూడా మునిగి మృత్యువాత పడ్డాడు. గోతుల వల్లే..ప్రమాదం డిండి ప్రాజెక్టు శిఖం భూమిలో గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు పనుల నిమిత్తం జేసీబీ సాయంతో మట్టి తోడి రోడ్డు పనులకు ఉపయోగించారు. ఒడ్డు వెంబడే కదా అని సరదాగా గడుపుదామని వెళ్తే మృత్యుగుంతలుగా మారి ఐదుగురి ప్రాణాలను బలిగొన్నాయని గ్రామస్తులు తెలిపారు. వంశాంకురం లేకుండా.. దత్తారెడ్డికి ఇద్దరు కుమారులు.. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్చిల్ మండలంలోని ఏపీజీవీబీలో క్యాషియర్. పెద్దకుమారుడు హర్షవర్దన్‌రెడ్డి ప్రైవేటు జాబ్ చేస్తుండగా, తమ్ముడు ప్రణీత్‌రెడ్డి ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరు కుమారులతో ఆ..కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. తాత చినకర్మలో పాల్గొన్న ఇద్దరూ తలనీలాలు తీయించుకున్నారు. ఈత.. సరదా వారి ప్రాణాలు తీసింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో దత్తారెడ్డికి వంశాంకురం లేకుండాపోయింది. కరుణాకర్‌రెడ్డి.. డిండిలోనే టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరిని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన కోరిక. అందుకే పెద్దకుమార్తె జ్యోత్స్నను హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నాడు. జ్యోత్స్న ప్రస్తుతం ఫైనలియర్ చదువుతోంది. చిన్నకూతురు దేవమణి డిండిలోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. కొడుకులైనా..కూతుళ్లయినా ఒక్కటేనని.. కరుణాకర్‌రెడ్డి పిల్లలకు ఏదీ తక్కువ చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ఆ.. ఇద్దరు కూతుళ్లు తండ్రిని విడిచి కానరాని లోకాలకు వెళ్లడంతో అతని రోదన వర్ణనాతీతం. మల్లారెడ్డి బావ వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలంలోని వనపర్తికి చెందిన నర్సిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు అవినాష్‌రెడ్డిది బీటెక్ పూర్తయ్యింది. ఉద్యోగ వేటలో ఉన్నాడు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కూడా వచ్చింది. రేపోమాపో విదేశాలకు వెళ్తావనుకుంటే.. ఎవరికీ కానరాని లోకాలకు వెళ్లావా అంటూ అతని తల్లిదండ్రులు, బంధువుల రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
కొవ్వూరు టౌన్, న్యూస్‌లైన్: జిల్లా రోడ్లు శనివారం రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యవాత పడ్డారు. ఒకరు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాలకు వాహనాల అతివేగంతో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా తెలుస్తోంది. కారు, మోటార్ సైకిల్ ఢీ.. కొవ్వూరు ఏటిగట్టుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన కూటికుప్పల సూర్యనారాయణ (60), పట్టణానికి చెందిన బంగారు మధు మోటార్ సైకిల్‌పై దశదిన కార్యక్రమానికి కొవ్వూరు హిందూ శ్మశాన వాటికకు వెళ్తున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని అప్రోచ్ రోడ్డు దాటుతుండగా రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వస్తున్న కారు వీరి మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న హైవే పోలీస్ వాహనంలోని పోలీసులు క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన సూర్యనారాయణరావును మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బంగారు మధు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చింతలపూడి : చింతలపూడి మండలం తీగలవంచ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడు కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన డొంకిన అర్జునరావు (24)గా గుర్తించారు. టి నరసాపురంలో ఒక రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టి నరసాపురం నుంచి ద్విచక్ర వాహనంపై కోటపాడు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై వీరభద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్ ఢీకొని.. వాలమర్రు (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్: లంకలకోడేరు-ఆలమూరు ఆర్ అండ్ బీ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వాలమర్రుకి చెందిన దాసరి రమేష్ (28) మోటార్‌సైకిల్‌పై ఆలమూరు వైపు వెళుతుండగా తణుకు డిపోకి చెందిన ఏపీ11జడ్ 611 ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న రమేష్‌ను ఢీకొట్టింది. దీంతో రమేష్ తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే 108లో భీమవరం హాస్పటల్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటోంది. వీరికి నాలుగు సంవత్సరాల పాప ఉంది. మృతుడు రమేష్ వ్యవసాయ కూలీ. మృతదేహానికి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. పట్టణ సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యలో ఎస్సై వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పాలకొల్లు రూరల్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. డ్రైవర్ ఎ.ముత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు. ఏలూరు టూటౌన్ : సెల్‌ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్ 11వ రోడ్డుకు చెందిన పిల్లి శ్రీనివాస్ కల్యాణ్ (25) స్థానిక పత్తేబాదలో పెయింటింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం తన మిత్రుడి ఇంటికి వెళ్లి తిరిగి ఓవర్‌బ్రిడ్జి కింద రైల్వేట్రాక్ మీద నుంచి సెల్‌ఫోన్ మాట్లాడుతూ వస్తున్న సమయంలో విశాఖపట్నం వైపు నుంచి విజయవాడవైపునకు వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వట్లూరు వద్ద విద్యార్థి ఆత్మహత్య ఏలూరు కండ్రికగూడెం సమీపంలోని రాజరాజేశ్వరి కాలనీకి చెందిన కొలుసు చైతన్య (18) స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపం చెందిన చైతన్య స్థానిక వట్లూరు గేటు సమీపంలో శనివారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టౌ పేలి నలుగురు మృతి
కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరులో ఈ నెల 12న స్టౌ పేలిన ఘటనలో గాయపడిన పదిమందిలో నలుగురు విజయవాడలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. కానూరులోని టైమ్ ఆస్పత్రిలో ఒకేరోజు కొద్ది నిమిషాల వ్యవధిలో వీరంతా మృతిచెందడంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదం అలుముకుంది. వారి బంధువుల రోదనలతో ఆస్పత్రి హోరెత్తింది. మృతుల వివరాలివీ... మృతుల్లో కైకలూరుకు చెందిన తోట పోతురాజు (65), అడపా సుబ్బలక్ష్మి (33), మండవల్లి మండలం దయంపాడుకు చెందిన కంభంపాటి మేరీ సరోజిని (60), పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన బురగ తేరేజమ్మ (45) ఉన్నారు. పునుగుల బండి యజమాని పోతురాజు గత 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. అతనికి నలుగురు పిల్లలు. ఎన్నడూలేని విధంగా ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అడపా సుబ్బలక్ష్మి కైకలూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వచ్చింది. కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైంది. ఆమెకు నలుగురు పిల్లలు. మేరీసరోజిని కైకలూరుకు పనిపై వచ్చి ఆటో కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదం బారిన పడి ప్రాణాలు వదిలింది. గూడూరుకు చెందిన నక్కల బసంతి అలియాస్ వాణిశ్రీ (50) ప్రమాదం జరిగిన రోజునే గూడూరు నుంచి కైకలూరుకు వచ్చింది. ఆమె రోడ్డు పక్కన కూర్చుని పూసలు, క్యాట్బాల్స్, ఇతర సామగ్రి అమ్ముకుంటుంది. ఈ ఘటనలో గాయపడ్డ ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. గాయపడినవారిలో మిగిలినవారు చికిత్స పొందుతుండగా ప్రాణాపాయం నుంచి ఆగళ్ల శిరీషాకుమారి, పెనుగొండ సలోమి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. అనాథలుగా మిగిలిన బిడ్డలు... సుబ్బలక్ష్మి స్వస్థలం పేటకలిదిండి. భర్త సుబ్బారావు 2004లో మృతిచెందాడు. వీరికి నాగలక్ష్మి (16), మణికంఠ స్వామి (20), భవాని (14) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ దూరమై వారు రోదిస్తున్న తీరు అందరినీ కలసివేసింది. బాధితులకు ప్రభుత్వం సాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. సుబ్బలక్ష్మి మృతదేహానికి పేట కలిదిండిలో దహనసంస్కారాలు చేపట్టారు. మరో మృతురాలు మేరీసరోజిని భర్త యాకోబుకు రెండో భార్య. ఇద్దరూ కూలికెళితే గానీ పొయ్యి వెలగని పరిస్థితి వారిది. మలి వయసులో భార్యను కోల్పోయిన యాకోబు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. భర్త చనిపోయిన ఆరు నెలలకే... మరో మృతురాలు బురగ తేరేజమ్మ భర్త వెంకటేశ్వరరావు ఆరు నెలల క్రితమే మరణించాడు. ఇద్దరు కుమారులకూ వివాహమైంది. ప్రస్తుతం ఆమె కూడా మరణించడం కుటుంబంలో విషాదం నింపింది. బంధువులు మృతదేహన్ని మాదేపల్లి తీసుకువెళ్లారు. న్యాయం చేస్తాం : సబ్‌కలెక్టర్ మృతిచెందినవారి బంధువులు, కుటుంబసభ్యులను సబ్‌కలెక్టర్ దాసరి హరిచందన ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఆపద్బంధు పథకం ద్వారా కుటుంబసభ్యులకు సాయం అందిస్తామని చెప్పారు. చికిత్స పొందుతున్నవారు పూర్తిగా కోలుకునేవరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని తెలిపారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కైకలూరులో బళ్ల వద్ద కిరోసిన్ స్టౌలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బళ్ల యజమానులు గ్యాస్ పొయ్యిలపై వంటకాలు చేయాలని సూచించారు. మృతదేహాలకు పంచనామా మృతదేహాలకు కైకలూరు తహశీల్దారు వి.వి.శేఖర్, సీఐ అశోక్‌కుమార్‌గౌడ్ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కైకలూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు చేశారు.