వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
Published Sun, Feb 2 2014 2:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
కొవ్వూరు టౌన్, న్యూస్‌లైన్: జిల్లా రోడ్లు శనివారం రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యవాత పడ్డారు. ఒకరు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాలకు వాహనాల అతివేగంతో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా తెలుస్తోంది.
కారు, మోటార్ సైకిల్ ఢీ..
కొవ్వూరు ఏటిగట్టుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన కూటికుప్పల సూర్యనారాయణ (60), పట్టణానికి చెందిన బంగారు మధు మోటార్ సైకిల్‌పై దశదిన కార్యక్రమానికి కొవ్వూరు హిందూ శ్మశాన వాటికకు వెళ్తున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని అప్రోచ్ రోడ్డు దాటుతుండగా రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వస్తున్న కారు వీరి మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న హైవే పోలీస్ వాహనంలోని పోలీసులు క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన సూర్యనారాయణరావును మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బంగారు మధు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చింతలపూడి : చింతలపూడి మండలం తీగలవంచ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడు కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన డొంకిన అర్జునరావు (24)గా గుర్తించారు. టి నరసాపురంలో ఒక రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టి నరసాపురం నుంచి ద్విచక్ర వాహనంపై కోటపాడు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై వీరభద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్ ఢీకొని..
వాలమర్రు (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్: లంకలకోడేరు-ఆలమూరు ఆర్ అండ్ బీ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వాలమర్రుకి చెందిన దాసరి రమేష్ (28) మోటార్‌సైకిల్‌పై ఆలమూరు వైపు వెళుతుండగా తణుకు డిపోకి చెందిన ఏపీ11జడ్ 611 ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న రమేష్‌ను ఢీకొట్టింది. దీంతో రమేష్ తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే 108లో భీమవరం హాస్పటల్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటోంది. వీరికి నాలుగు సంవత్సరాల పాప ఉంది. మృతుడు రమేష్ వ్యవసాయ కూలీ. మృతదేహానికి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. పట్టణ సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యలో ఎస్సై వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పాలకొల్లు రూరల్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. డ్రైవర్ ఎ.ముత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు.
ఏలూరు టూటౌన్ : సెల్‌ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్ 11వ రోడ్డుకు చెందిన పిల్లి శ్రీనివాస్ కల్యాణ్ (25) స్థానిక పత్తేబాదలో పెయింటింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం తన మిత్రుడి ఇంటికి వెళ్లి తిరిగి ఓవర్‌బ్రిడ్జి కింద రైల్వేట్రాక్ మీద నుంచి సెల్‌ఫోన్ మాట్లాడుతూ వస్తున్న సమయంలో విశాఖపట్నం వైపు నుంచి విజయవాడవైపునకు వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వట్లూరు వద్ద విద్యార్థి ఆత్మహత్య
ఏలూరు కండ్రికగూడెం సమీపంలోని రాజరాజేశ్వరి కాలనీకి చెందిన కొలుసు చైతన్య (18) స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపం చెందిన చైతన్య స్థానిక వట్లూరు గేటు సమీపంలో శనివారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement