
సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు: వరంగల్–ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. నెల్లికుదురు మండలం వావిలాలకి చెందిన నల్ల శ్రీనివాస్‌రెడ్డి (40), చిన్నాన్న కుమారుడైన అజిత్‌రెడ్డి వివాహం ఖమ్మంకు చెందిన అమ్మాయితో శుక్రవారం తొర్రూరు మండలం ఫత్తేపురంలో జరిగింది.
ఈ పెళ్లికి శ్రీనివాస్‌రెడ్డి తన తల్లి లక్ష్మి (58), భార్య మాధవి (32), పెద్ద కూతురు కృష్ణవేణి(8), చిన్నకూతురు లిఖ్తిత (5)తో కలిసి కారులో వెళ్లారు. పెళ్లి అనంతరం కారులోనే ఇంటికి తిరిగి బయల్దేరారు. అయితే ఖమ్మం వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంతో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జనుజ్జయ్యింది. కారు నడుపుతున్న శ్రీనివాస్‌రెడ్డి, పక్కనే కూర్చున్న భార్య మాధవి, వెనుక కూర్చున్న తల్లి లక్ష్మి, కూతురు కృష్ణవేణి కారులోనే ఇరుక్కొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.
మేనత్త ఆపడంతో ప్రాణాలతో..
శ్రీనివాస్‌రెడ్డికి తోబుట్టువు కళ్యాణి కూడా భర్త తో పెళ్లికి వచ్చింది. కళ్యాణి కూడా వావిలాలకి రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె శ్రీనివాస్‌రెడ్డి చిన్న కుమార్తె లిఖ్తితను తన వద్ద వదిలి వెళ్లమని.. తమతో పాటు తీసుకొస్తామని చెప్పింది. దీంతో చిన్నారిని వదిలి శ్రీనివాస్‌రెడ్డి కారులో బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. మేనత్త ఆపడంతో లిఖ్తిత ప్రమాదం బారిన పడకుండా బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment