approach road
-
మనోడి కోసం గోడ కూల్చేద్దాం
►ఓ ఇంటికి అప్రోచ్ రోడ్డుకోసం ఒత్తిళ్లు ►గ్రూప్ హౌసింగ్ రోడ్డును కబళించే యత్నాలు ►పెద్దల ఒత్తిడితో జీహెచ్ఎంసీ హడావుడి ►బంజారాహిల్స్ రోడ్ నెం–3లో విచిత్రం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో గ్రూప్ హౌజింగ్ కింద అనుమతి తీసుకుని, ఇళ్లు కట్టుకున్న యజమానులకు ఇలాంటి వ్యవహారాలు ఒకరకంగా హెచ్చరికలాంటివే. అలా కట్టుకున్న వారు ఆ ఇళ్లలో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని, కనీసం ఒక దగ్గరున్న గోడ తీసి వేరే దగ్గర కట్టుకోకూడదని... ఇంటిపైన ఇంకో అంతస్తు కట్టుకున్నా సరే గ్రూప్ హౌజింగ్ రద్దవుతుందని చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. అందరి విషయంలో ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ... తమకు కావాల్సిన వారు అడిగితే మాత్రం ఏదైనా చేసేస్తారని తాజా వ్యవహారం చూస్తే స్పష్టమవుతోంది. కాలనీ రోడ్డు కూడా మున్సిపల్ పరిధిలోకి వెళ్లిపోయేలా జరుగుతున్న వ్యవహారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్–3లో స్పష్టమవుతోంది. తాజాగా వారికి కాలనీ గోడను కూల్చేసి రోడ్డును పబ్లిక్ రోడ్డుగా మారుస్తామని నోటీసులివ్వటం... వాటి మేరకు చకచకా అడుగులు వేస్తుండటంతో... వారు ‘సాక్షి’ వద్ద తమ గోడు వెలిబుచ్చారు. ఆ వివరాలివీ... డెక్సో ఫార్మా ప్రైవేల్ లిమిటెడ్‌కు చెందిన సి.గిరిజా రెడ్డి, మరో నలుగురు కలిసి గ్రూప్‌గా ఏర్పడి 1985–86లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో సుమారు 6,500–7,000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. గ్రూప్ హౌసింగ్‌గా ఇళ్లు కట్టుకున్నారు. తమ కాలనీ ప్రశాంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సొంత స్థలంలో 30 ఫీట్ల రోడ్డును వదిలేసి 5 ఇండిపెండెంట్ గృహాలు కట్టుకున్నారు. కాలనీకి ముందు గేటు, సెక్యూరిటీ అన్నీ పెట్టుకున్నారు. పాతికేళ్ల తరవాత చిక్కులు మొదలు... 2012 వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకున్నా... అప్పుడు మాత్రం కాలనీ రోడ్డును కొలిచేందుకు కొంతమంది వ్యక్తులొచ్చారు. దీంతో కాలనీ వాసులు భయపడి స్పందించి.. ఈ రోడ్డు ప్రభుత్వ రోడ్డు కాదని, తమ సొంత స్థలాన్ని రోడ్డుగా మార్చుకున్నామని వివరిస్తూ జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి జవాబూ రాకపోవటంతో తమ వాదన విన్నారేమో అని ఊరుకున్నారు. ‘‘మా కాలనీ రోడ్డుకు సరిగ్గా ఎదురుగా ఉన్న ప్లాట్ యజమాని 2012లో కాలనీలోని రోడ్డును ప్రభుత్వ రోడ్డుగా పేర్కొని చూపించి అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ సహాయంతో ఇంటి అనుమతులు పొందారు. వాస్తవానికి ఈ ఇంటికి ప్రభుత్వ రోడ్డు రోడ్ నంబర్ 14 నుంచి ఉంది. అప్పుడు అనుమతులిచ్చేందుకే మా రోడ్డుకు కొలతలు వేశారని ఆ తరవాత తెలిసింది’’ అని కాలనీ వాసులు వాపోయారు. ప్రభుత్వ రోడ్డును కబ్జా చేశామని నోటీసు.. 2012లో ఇచ్చిన రిప్లయికి స్పందించని జీహెచ్ఎంసీ.. తాజాగా గత నెలలో (మేలో) ప్రభుత్వ రోడ్డును కబ్జా చేశారంటూ కాలనీ గేటుకు నోటీసులు అతికించింది. తెల్లారక ముందే గోడలు కూల్చేందుకూ సిబ్బంది కూడా వచ్చేశారు. కాలనీ వాసులంతా కలిసి అది తమ సొంత స్థలమని వాదించటంతో వెనక్కెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా... కొద్దిరోజుల కిందట ఏకంగా ఆ ఇళ్లు గ్రూప్ హౌజింగ్ కింద లేవంటూ మరో నోటీసు పంపించారు. 24 గంటల్లోగా గేటు, గోడ కూల్చి రోడ్డును స్వాధీనం చేసుకుంటామని దాన్లో పేర్కొన్నారు. నిజానికి గ్రూప్ హౌజింగ్ ప్రకారం ఇంటర్నల్ వాల్స్ ఉండకూడదనుకున్నా... నోటీసు ఇవ్వాల్సింది ఇంటర్నల్ వాల్స్ తీయాలని. అంతేతప్ప ఏకంగా కాలనీ రోడ్డునే స్వాధీనం చేసుకుంటామనడం ఎంతవరకు న్యాయమన్నది వారి ప్రశ్న. కాలనీ రోడ్డు పబ్లిక్ రోడ్డు చేసేస్తారా? గ్రూప్ హౌజింగ్ కింద ఇళ్లు కట్టుకుంటే ఇంటర్నల్ వాల్స్ తీసేయాల్సిందే!! అయితే.. సిటీలో విల్లా ప్రాజెక్టులు దాదాపు ప్రతిదానికీ ఇంటర్నల్ వాల్స్ ఉంటూనే ఉన్నాయి. మరి వాటిలోని రోడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ‘‘ఒక వ్యక్తి ఇంటి కోసం అధికారంలో ఉన్న మున్సిపల్ పెద్దలు కుమ్మక్కయి కాలనీ రోడ్డును పబ్లిక్ రోడ్డు చేసేస్తారా? అసలు ఆ ఇంటికి అనుమతులెలా ఇచ్చారు?’’ అన్నది కాలనీ వాసుల ప్రశ్న. -
ఇల్లందు-గుండాల దారిలో ఆగిన రాకపోకలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు-గుండాల మార్గంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బాటన్ననగర్ వద్ద ఉన్న వాగులో వరద ఉధృతికి అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. దీంతో రెండు వైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. అధికారులు జేసీబీని తెప్పించి అప్రోచ్ రోడ్డును సరిచేసేందుకు యత్నిస్తున్నారు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
కేకే ఓసీపీకి భూసేకరణ ప్రారంభం
జీవో 123కు కొంత మంది రైతుల అంగీకారం కాసిపేట : మండలంలో ఏర్పాటు కానున్న కేకే ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం భూసేకరణ ప్రారంభించారు. అధికారుల సూచన మేరకు కొంత మంది రైతులు 123 జీవోకు అంగీకరించి రెవెన్యూ అధికారుల వద్ద సంతకాలు చేశారు. గతం నుంచి అధికారులు, రైతుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అవుతుండటం.. ఎకరాకు లక్ష అంటు అధికారులు, రూ.12లక్షలు ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇటీవల సమావేశమైన జాయింట్ కలెక్టర్ రైతులకు డ్రై లాండ్ ఎకరాకు రూ.5.50లక్షలు, తరికి రూ.6లక్షలు చెల్లిస్తామని తేల్చి చెప్పారు. రైతులు అంగీకరిస్తే 123 జీవో ప్రకారం సెటిల్మెంటు చేస్తామని, లేదంటే సాధరణ భూసేకరణ చట్టం ద్వారా నోటీసులు అందించి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్వేలు పూర్తికావడంతో పూర్తి వివరాలు అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అప్రోచ్ రోడ్డుకు సంబంధించి 45ఎకరాలకు నోటిఫికేషన్ సైతం వెలువడడంతో అధికారులు రైతులకు ఎటో తేల్చుకోవాలని సూచించారు. ఆమోదం తెలిపిన రైతులకు 123 జీవో ప్రకారం అందించి మిగత వారి పేర్లు సాధారణ భూసేకరణ చట్టం కింద పంపుతామని నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో శుక్రవారం సుమారు 35మంది రైతులు 180ఎకరాల వరకు ఆమోదం తెలుపుతూ రెవెన్యూ అధికారుల వద్ద సంతకాలు చేశారు. ఇష్టం ఉన్న రైతుల పేర్లు పంపిస్తామని, ఇతర రైతులకు మరోమారు అవకాశం ఇచ్చి భూసేకరణ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు. ఇప్పటికే సర్వే నంబరు 62, 67, 71, 107, 108, 112, 113, 114, 116,117, 130, 146,147, 198లో భూసేకరణ పూర్తి చేశారు. కార్యాలయం వద్ద అంగీకరించిన రైతులు సంతకాలు చేసేందుకు రావడంతో సందడి నెలకొంది. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
కొవ్వూరు టౌన్, న్యూస్‌లైన్: జిల్లా రోడ్లు శనివారం రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యవాత పడ్డారు. ఒకరు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాలకు వాహనాల అతివేగంతో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా తెలుస్తోంది. కారు, మోటార్ సైకిల్ ఢీ.. కొవ్వూరు ఏటిగట్టుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన కూటికుప్పల సూర్యనారాయణ (60), పట్టణానికి చెందిన బంగారు మధు మోటార్ సైకిల్‌పై దశదిన కార్యక్రమానికి కొవ్వూరు హిందూ శ్మశాన వాటికకు వెళ్తున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని అప్రోచ్ రోడ్డు దాటుతుండగా రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపు వస్తున్న కారు వీరి మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న హైవే పోలీస్ వాహనంలోని పోలీసులు క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన సూర్యనారాయణరావును మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బంగారు మధు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చింతలపూడి : చింతలపూడి మండలం తీగలవంచ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడు కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన డొంకిన అర్జునరావు (24)గా గుర్తించారు. టి నరసాపురంలో ఒక రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టి నరసాపురం నుంచి ద్విచక్ర వాహనంపై కోటపాడు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై వీరభద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్ ఢీకొని.. వాలమర్రు (పాలకొల్లు అర్బన్), న్యూస్‌లైన్: లంకలకోడేరు-ఆలమూరు ఆర్ అండ్ బీ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వాలమర్రుకి చెందిన దాసరి రమేష్ (28) మోటార్‌సైకిల్‌పై ఆలమూరు వైపు వెళుతుండగా తణుకు డిపోకి చెందిన ఏపీ11జడ్ 611 ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న రమేష్‌ను ఢీకొట్టింది. దీంతో రమేష్ తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే 108లో భీమవరం హాస్పటల్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటోంది. వీరికి నాలుగు సంవత్సరాల పాప ఉంది. మృతుడు రమేష్ వ్యవసాయ కూలీ. మృతదేహానికి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. పట్టణ సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యలో ఎస్సై వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పాలకొల్లు రూరల్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. డ్రైవర్ ఎ.ముత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు. ఏలూరు టూటౌన్ : సెల్‌ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్ 11వ రోడ్డుకు చెందిన పిల్లి శ్రీనివాస్ కల్యాణ్ (25) స్థానిక పత్తేబాదలో పెయింటింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం తన మిత్రుడి ఇంటికి వెళ్లి తిరిగి ఓవర్‌బ్రిడ్జి కింద రైల్వేట్రాక్ మీద నుంచి సెల్‌ఫోన్ మాట్లాడుతూ వస్తున్న సమయంలో విశాఖపట్నం వైపు నుంచి విజయవాడవైపునకు వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వట్లూరు వద్ద విద్యార్థి ఆత్మహత్య ఏలూరు కండ్రికగూడెం సమీపంలోని రాజరాజేశ్వరి కాలనీకి చెందిన కొలుసు చైతన్య (18) స్థానిక ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపం చెందిన చైతన్య స్థానిక వట్లూరు గేటు సమీపంలో శనివారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.