కేకే ఓసీపీకి భూసేకరణ ప్రారంభం
జీవో 123కు కొంత మంది రైతుల అంగీకారం
కాసిపేట : మండలంలో ఏర్పాటు కానున్న కేకే ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం భూసేకరణ ప్రారంభించారు. అధికారుల సూచన మేరకు కొంత మంది రైతులు 123 జీవోకు అంగీకరించి రెవెన్యూ అధికారుల వద్ద సంతకాలు చేశారు. గతం నుంచి అధికారులు, రైతుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అవుతుండటం.. ఎకరాకు లక్ష అంటు అధికారులు, రూ.12లక్షలు ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇటీవల సమావేశమైన జాయింట్ కలెక్టర్ రైతులకు డ్రై లాండ్ ఎకరాకు రూ.5.50లక్షలు, తరికి రూ.6లక్షలు చెల్లిస్తామని తేల్చి చెప్పారు. రైతులు అంగీకరిస్తే 123 జీవో ప్రకారం సెటిల్‌మెంటు చేస్తామని, లేదంటే సాధరణ భూసేకరణ చట్టం ద్వారా నోటీసులు అందించి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్వేలు పూర్తికావడంతో పూర్తి వివరాలు అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అప్రోచ్ రోడ్డుకు సంబంధించి 45ఎకరాలకు నోటిఫికేషన్ సైతం వెలువడడంతో అధికారులు రైతులకు ఎటో తేల్చుకోవాలని సూచించారు. ఆమోదం తెలిపిన రైతులకు 123 జీవో ప్రకారం అందించి మిగత వారి పేర్లు సాధారణ భూసేకరణ చట్టం కింద పంపుతామని నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో శుక్రవారం సుమారు 35మంది రైతులు 180ఎకరాల వరకు ఆమోదం తెలుపుతూ రెవెన్యూ అధికారుల వద్ద సంతకాలు చేశారు.
ఇష్టం ఉన్న రైతుల పేర్లు పంపిస్తామని, ఇతర రైతులకు మరోమారు అవకాశం ఇచ్చి భూసేకరణ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు. ఇప్పటికే సర్వే నంబరు 62, 67, 71, 107, 108, 112, 113, 114, 116,117, 130, 146,147, 198లో భూసేకరణ పూర్తి చేశారు. కార్యాలయం వద్ద అంగీకరించిన రైతులు సంతకాలు చేసేందుకు రావడంతో సందడి నెలకొంది.