మనోడి కోసం గోడ కూల్చేద్దాం | The pressures for the road to approach the road | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం–3లో విచిత్రం

Published Mon, Jul 3 2017 8:17 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

మనోడి కోసం గోడ కూల్చేద్దాం - Sakshi

మనోడి కోసం గోడ కూల్చేద్దాం

ఓ ఇంటికి అప్రోచ్‌ రోడ్డుకోసం ఒత్తిళ్లు
గ్రూప్‌ హౌసింగ్‌ రోడ్డును కబళించే యత్నాలు
పెద్దల ఒత్తిడితో జీహెచ్‌ఎంసీ హడావుడి
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం–3లో విచిత్రం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో గ్రూప్‌ హౌజింగ్‌ కింద అనుమతి తీసుకుని, ఇళ్లు కట్టుకున్న యజమానులకు ఇలాంటి వ్యవహారాలు ఒకరకంగా హెచ్చరికలాంటివే. అలా కట్టుకున్న వారు ఆ ఇళ్లలో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని, కనీసం ఒక దగ్గరున్న గోడ తీసి వేరే దగ్గర కట్టుకోకూడదని... ఇంటిపైన ఇంకో అంతస్తు కట్టుకున్నా సరే గ్రూప్‌ హౌజింగ్‌ రద్దవుతుందని చెబుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. అందరి విషయంలో ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ... తమకు కావాల్సిన వారు అడిగితే మాత్రం ఏదైనా చేసేస్తారని తాజా వ్యవహారం చూస్తే స్పష్టమవుతోంది. కాలనీ రోడ్డు కూడా మున్సిపల్‌ పరిధిలోకి వెళ్లిపోయేలా జరుగుతున్న వ్యవహారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–3లో స్పష్టమవుతోంది.

తాజాగా వారికి కాలనీ గోడను కూల్చేసి రోడ్డును పబ్లిక్‌ రోడ్డుగా మారుస్తామని నోటీసులివ్వటం... వాటి మేరకు చకచకా అడుగులు వేస్తుండటంతో... వారు ‘సాక్షి’ వద్ద తమ గోడు వెలిబుచ్చారు. ఆ వివరాలివీ... డెక్సో ఫార్మా ప్రైవేల్‌ లిమిటెడ్‌కు చెందిన సి.గిరిజా రెడ్డి, మరో నలుగురు కలిసి గ్రూప్‌గా ఏర్పడి 1985–86లో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లో సుమారు 6,500–7,000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. గ్రూప్‌ హౌసింగ్‌గా ఇళ్లు కట్టుకున్నారు. తమ కాలనీ ప్రశాంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సొంత స్థలంలో 30 ఫీట్ల రోడ్డును వదిలేసి 5 ఇండిపెండెంట్‌ గృహాలు కట్టుకున్నారు. కాలనీకి ముందు గేటు, సెక్యూరిటీ అన్నీ పెట్టుకున్నారు.

పాతికేళ్ల తరవాత చిక్కులు మొదలు...
2012 వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకున్నా... అప్పుడు మాత్రం కాలనీ రోడ్డును కొలిచేందుకు కొంతమంది వ్యక్తులొచ్చారు. దీంతో కాలనీ వాసులు భయపడి స్పందించి.. ఈ రోడ్డు ప్రభుత్వ రోడ్డు కాదని, తమ సొంత స్థలాన్ని రోడ్డుగా మార్చుకున్నామని వివరిస్తూ జీహెచ్‌ఎంసీకి లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి జవాబూ రాకపోవటంతో తమ వాదన విన్నారేమో అని ఊరుకున్నారు.

‘‘మా కాలనీ రోడ్డుకు సరిగ్గా ఎదురుగా ఉన్న ప్లాట్‌ యజమాని 2012లో కాలనీలోని రోడ్డును ప్రభుత్వ రోడ్డుగా పేర్కొని చూపించి అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సహాయంతో ఇంటి అనుమతులు పొందారు. వాస్తవానికి ఈ ఇంటికి ప్రభుత్వ రోడ్డు రోడ్‌ నంబర్‌ 14 నుంచి ఉంది. అప్పుడు అనుమతులిచ్చేందుకే మా రోడ్డుకు కొలతలు వేశారని ఆ తరవాత తెలిసింది’’ అని కాలనీ వాసులు వాపోయారు.

ప్రభుత్వ రోడ్డును కబ్జా చేశామని నోటీసు..
2012లో ఇచ్చిన రిప్లయికి స్పందించని జీహెచ్‌ఎంసీ.. తాజాగా గత నెలలో (మేలో) ప్రభుత్వ రోడ్డును కబ్జా చేశారంటూ కాలనీ గేటుకు నోటీసులు అతికించింది. తెల్లారక ముందే గోడలు కూల్చేందుకూ సిబ్బంది కూడా వచ్చేశారు. కాలనీ వాసులంతా కలిసి అది తమ సొంత స్థలమని వాదించటంతో వెనక్కెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా... కొద్దిరోజుల కిందట ఏకంగా ఆ ఇళ్లు గ్రూప్‌ హౌజింగ్‌ కింద లేవంటూ మరో నోటీసు పంపించారు. 24 గంటల్లోగా గేటు, గోడ కూల్చి రోడ్డును స్వాధీనం చేసుకుంటామని దాన్లో పేర్కొన్నారు. నిజానికి గ్రూప్‌ హౌజింగ్‌ ప్రకారం ఇంటర్నల్‌ వాల్స్‌ ఉండకూడదనుకున్నా... నోటీసు ఇవ్వాల్సింది ఇంటర్నల్‌ వాల్స్‌ తీయాలని. అంతేతప్ప ఏకంగా కాలనీ రోడ్డునే స్వాధీనం చేసుకుంటామనడం ఎంతవరకు న్యాయమన్నది వారి ప్రశ్న.

కాలనీ రోడ్డు పబ్లిక్‌ రోడ్డు చేసేస్తారా?
గ్రూప్‌ హౌజింగ్‌ కింద ఇళ్లు కట్టుకుంటే ఇంటర్నల్‌ వాల్స్‌ తీసేయాల్సిందే!! అయితే.. సిటీలో విల్లా ప్రాజెక్టులు దాదాపు ప్రతిదానికీ ఇంటర్నల్‌ వాల్స్‌ ఉంటూనే  ఉన్నాయి. మరి వాటిలోని రోడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ‘‘ఒక వ్యక్తి ఇంటి కోసం అధికారంలో ఉన్న మున్సిపల్‌ పెద్దలు కుమ్మక్కయి కాలనీ రోడ్డును పబ్లిక్‌ రోడ్డు చేసేస్తారా? అసలు ఆ ఇంటికి అనుమతులెలా ఇచ్చారు?’’ అన్నది కాలనీ వాసుల ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement