కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరులో ఈ నెల 12న స్టౌ పేలిన ఘటనలో గాయపడిన పదిమందిలో నలుగురు విజయవాడలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. కానూరులోని టైమ్ ఆస్పత్రిలో ఒకేరోజు కొద్ది నిమిషాల వ్యవధిలో వీరంతా మృతిచెందడంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాదం అలుముకుంది. వారి బంధువుల రోదనలతో ఆస్పత్రి హోరెత్తింది.
మృతుల వివరాలివీ...
మృతుల్లో కైకలూరుకు చెందిన తోట పోతురాజు (65), అడపా సుబ్బలక్ష్మి (33), మండవల్లి మండలం దయంపాడుకు చెందిన కంభంపాటి మేరీ సరోజిని (60), పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన బురగ తేరేజమ్మ (45) ఉన్నారు. పునుగుల బండి యజమాని పోతురాజు గత 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాడు. అతనికి నలుగురు పిల్లలు. ఎన్నడూలేని విధంగా ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అడపా సుబ్బలక్ష్మి కైకలూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వచ్చింది. కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైంది. ఆమెకు నలుగురు పిల్లలు.
మేరీసరోజిని కైకలూరుకు పనిపై వచ్చి ఆటో కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదం బారిన పడి ప్రాణాలు వదిలింది. గూడూరుకు చెందిన నక్కల బసంతి అలియాస్ వాణిశ్రీ (50) ప్రమాదం జరిగిన రోజునే గూడూరు నుంచి కైకలూరుకు వచ్చింది. ఆమె రోడ్డు పక్కన కూర్చుని పూసలు, క్యాట్‌బాల్స్, ఇతర సామగ్రి అమ్ముకుంటుంది. ఈ ఘటనలో గాయపడ్డ ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. గాయపడినవారిలో మిగిలినవారు చికిత్స పొందుతుండగా ప్రాణాపాయం నుంచి ఆగళ్ల శిరీషాకుమారి, పెనుగొండ సలోమి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
అనాథలుగా మిగిలిన బిడ్డలు...
సుబ్బలక్ష్మి స్వస్థలం పేటకలిదిండి. భర్త సుబ్బారావు 2004లో మృతిచెందాడు. వీరికి నాగలక్ష్మి (16), మణికంఠ స్వామి (20), భవాని (14) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ దూరమై వారు రోదిస్తున్న తీరు అందరినీ కలసివేసింది. బాధితులకు ప్రభుత్వం సాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. సుబ్బలక్ష్మి మృతదేహానికి పేట కలిదిండిలో దహనసంస్కారాలు చేపట్టారు. మరో మృతురాలు మేరీసరోజిని భర్త యాకోబుకు రెండో భార్య. ఇద్దరూ కూలికెళితే గానీ పొయ్యి వెలగని పరిస్థితి వారిది. మలి వయసులో భార్యను కోల్పోయిన యాకోబు రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది.
భర్త చనిపోయిన ఆరు నెలలకే...
మరో మృతురాలు బురగ తేరేజమ్మ భర్త వెంకటేశ్వరరావు ఆరు నెలల క్రితమే మరణించాడు. ఇద్దరు కుమారులకూ వివాహమైంది. ప్రస్తుతం ఆమె కూడా మరణించడం కుటుంబంలో విషాదం నింపింది. బంధువులు మృతదేహన్ని మాదేపల్లి తీసుకువెళ్లారు.
న్యాయం చేస్తాం : సబ్‌కలెక్టర్
మృతిచెందినవారి బంధువులు, కుటుంబసభ్యులను సబ్‌కలెక్టర్ దాసరి హరిచందన ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఆపద్బంధు పథకం ద్వారా కుటుంబసభ్యులకు సాయం అందిస్తామని చెప్పారు. చికిత్స పొందుతున్నవారు పూర్తిగా కోలుకునేవరకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తామని తెలిపారు. కైకలూరు సీఐ అశోక్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కైకలూరులో బళ్ల వద్ద కిరోసిన్ స్టౌలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బళ్ల యజమానులు గ్యాస్ పొయ్యిలపై వంటకాలు చేయాలని సూచించారు.
మృతదేహాలకు పంచనామా
మృతదేహాలకు కైకలూరు తహశీల్దారు వి.వి.శేఖర్, సీఐ అశోక్‌కుమార్‌గౌడ్ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కైకలూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు చేశారు.
స్టౌ పేలి నలుగురు మృతి
Published Wed, Nov 20 2013 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement