కదంతొక్కిన కైకలూరు  | ysrcp samajika sadhikara bus yatra in Kaikaluru | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన కైకలూరు 

Published Wed, Nov 29 2023 6:03 AM | Last Updated on Wed, Nov 29 2023 5:13 PM

ysrcp samajika sadhikara bus yatra in Kaikaluru - Sakshi

సభలో ప్రసంగిస్తున్న మంత్రి విడదల రజిని  

సాక్షి, భీమవరం/కైకలూరు: కొల్లేరులో సామాజిక సాధికార నినాదం ఉప్పొంగింది. కోల్లేరే పొంగిందా అన్నట్టుగా కైకలూరును జన సునామీ ముంచెత్తింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ‘జై జగన్‌’ నినాదాలతో కైకలూరు నియోజకవర్గం హోరెత్తింది. నియోజకవర్గంలో మంగళవారం జరిగిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర వేలాది ప్రజలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బస్సు యాత్ర కైకలూరు సీతారామ›› ఫంక్షన్‌ హాల్‌ నుంచి రైతుబజారు సెంటర్‌లోని బహిరంగ సభ వేదిక వరకు సాగింది. అడుగడుగునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ యాత్రకు బ్రహ్మరథం పట్టారు. వివిధ ప్రాంతాల మహిళలు, గ్రామ పెద్దలు వాహనాలతో యాత్రకు వచ్చారు.  సమావేశం ఆద్యంతం ‘జగనే కావాలి–జగనే రావాలి’ నినాదాన్ని హోరెత్తించారు. 

నాడు వివక్ష.. నేడు సామాజిక సాధికారత: మంత్రి రజిని 
ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల క్రితం వరకు వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం వైఎస్‌ జగన్‌ అండతో ఇప్పుడు సామాజిక సాధికారత సాధించి, తలెత్తుకు తిరుగుతున్నారని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నాలుగేళ్లలో పేదల సంక్షేమం కోసం డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.4.8 లక్షల కోట్లు ఇస్తే.. అందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అందించారని తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తున్న ఏకైక సీఎం జగన్‌ అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా జగనన్నకు అండగా నిలవాలని కోరారు.  

17 ఎమ్మెల్సీల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే: మంత్రి కారుమూరి 
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయానికి పెట్టింది పేరని అన్నారు. 17 ఎమ్మెల్సీల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్‌.కృష్ణయ్య, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, బీద మస్తా¯Œ యాదవ్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపారని తెలిపారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించలేదని విమర్శించారు. బీసీ అయిన జయ­మంగళ వెంకటరమణకు చంద్రబాబు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు రెండింటిలోనూ హామీ ఇచ్చి మోసం చేశారని, సీఎం జగన్‌ మాత్రం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారని గుర్తుచేశారు.  

న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌: ఎంపీ మోపిదేవి 
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పేదల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే వారు అభివృద్ధి చెందుతారో సీఎం జగ¯న్‌ ఆలోచన చేశారన్నారు. దీనికి అనుగుణంగానే ప్రతి కుటుంబానికీ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ లబ్ధి చేకూరిందన్నారు. రాజకీయంగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేశారన్నారు.  

అన్నింటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట :  మంత్రి జోగి రమేష్‌ 
కైకలూరు సభలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సామాజిక ధ­ర్మాన్ని పాటిస్తూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, మహాత్మా జ్యోతిరావ్‌ పూలే వంటి మహనీయుల అడుగు జాడల్లో బడుగు, బల­హీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నార­ని చెప్పా­రు. కేబినెట్‌ సహా అన్ని పదవుల్లో, పథకాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనా­ర్టీల­కే పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది ఈ వ­ర్గాల వారినే సీఎం నియమించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా­ర్టీల ఆరి్థకాభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. 

ఈ ఘనత జగన్‌దే: ఎమ్మెల్యే నాగేశ్వరరావు 
సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్క కైకలూరులోనే 15 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథ­కాల కోసం రూ.746 కోట్లు అందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక  పాల్గొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement