రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలతో తోడేళ్లంతా ఏకమై మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబుకు కానీ, దత్తపుత్రుడికి కానీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి. అన్ని చోట్లా పోటీ చేసే సత్తా లేదు. అందుకే వీళ్లందరూ వంచనను, మోసాన్నే నమ్ముకుంటున్నారు. అమలు చేసిన మంచి స్కీంలేవీ లేవు కాబట్టి.. ఏకంగా రంగు రంగుల వలలతో ప్రజలను మోసం చేస్తున్నారు.
కొత్తగా మరిన్ని వాగ్దానాలతో వస్తున్నారు. ఆరు గ్యారెంటీలట. జగన్‌ను ఢీకొట్టలేమని డిసైడ్ చేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజలను మోసం చేయడానికి బయల్దేరారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి వారిని నమ్మవచ్చా? ఆలోచించండి. ఇలాంటి వారి బుద్ధి చూసినప్పుడు ‘ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా అది పలుకునా.. విశ్వదాభిరామ, వినుర వేమ’ అనే వేమన పద్యం గుర్తుకొస్తోంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పద్నాలుగేళ్లపాటు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని ప్రజలకు మంచి చేయడం కోసం కాకుండా అవినీతి కోసమే ఉపయోగించి, ఆ అవినీతి సొమ్మును తన వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లుగా వేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాం అంతా మనసు లేని పాలన సాగిందని, వాళ్లకు విలువలు లేవు.. విశ్వసనీయత అంతకన్నా లేదని మండిపడ్డారు.
మోసాలు, కుట్రలు, కుతంత్రాలే వారి మేనిఫెస్టో అన్నారు. జన్మభూమి కమిటీలు మొదలు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. చంద్రబాబుకు తోడవ్వగా, వీళ్లందరికీ ఒక దత్త పుత్రుడు తోడయ్యాడన్నారు. వీరందరూ కలిసి ప్రజలు గుర్తు పెట్టుకునేలా పాలన చేసిన చరిత్ర లేకపోగా.. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చేశారని నిప్పులు చెరిగారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో మనందరి ప్రభుత్వం మేలు చేసిన విధంగా.. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం విద్యా దీవెన నిధుల విడుదల సభలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు దృష్టిలో అధికారం అంటే వాళ్లు బాగు పడటమేనని, అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ వెన్నుపోట్లు చేసే వీరి రాజకీయం ఎలా ఉంటుందో చెబుతానన్నారు. ‘దుష్ట చతుష్టయానికి చెందిన ముఠా సభ్యుడిని ఇదే భీమవరంలో ప్రజలు తిరస్కరించారు. ఆ దత్త పుత్రుడితోనే మొదలు పెడతా. అతనేమో పక్క రాష్ట్రంలో ఉంటాడు. నాన్ లోకల్. పక్క రాష్ట్రంలోనే ఈయన శాశ్వత నివాసం. మన రాష్ట్రంలో అడ్రస్ ఉండదు.
పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్క పార్టీ వాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన వ్యక్తి దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవరూ ఉండరు. ఈ మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు.. అదే నాకు వందల కోట్లు అని, బాబు కోసమే నా జీవితమని, అందుకు అంగీకరించని వారు తన పార్టీలో కూడా ఉండకూడదని, వేరే అభిప్రాయం ఉన్న వాళ్లు తన పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సభల్లో ఉపన్యాసాల్లో చెప్పడం బహుశా ఈయన్ని తప్ప ఎవరినీ చూసి ఉండం’ అని ఎద్దేవా చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
.
ప్యాకేజీ కోసం త్యాగాల త్యాగరాజు
► దత్తపుత్రుడికి బాబు పొత్తుల్లో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే. ఏ సీటు ఇవ్వకపోయినా ఒకే. చిత్తం ప్రభూ అంటూ త్యాగాలు చేసే త్యాగరాజు మాత్రం ఈ దత్తపుత్రుడిలోనే చూస్తాం. ఎవరైనా త్యాగాలు ప్రజల కోసం చేస్తారు. కానీ దత్త పుత్రుడు ప్యాకేజీల కోసం త్యాగాలు చేస్తున్నాడు. ఈ మ్యారేజ్ స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తాడు.
► పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను, సంప్రదాయాన్ని మంటగలుపుతూ, నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చేయడం, ఇలా కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతున్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారంటే ఆయన ఎలాంటి వ్యక్తో ఆలోచించండి. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. చెల్లెళ్లు ఉన్నారు. మన ఇళ్లల్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వారు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కడూ అయనలా చేయడం మొదలు పెడితే మన ఆడబిడ్డలు, చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ఈ దత్తపుతురడు పొలిటికల్ లైఫ్‌లో మాత్రం 10, 15 ఏళ్లు అయినా చంద్రబాబుతో ఉండాల్సిందేనని తన క్యాడర్‌కు చెబుతున్నాడు.
► రెండు విషాలు కలిస్తే అమృతం అవుతుందా.. నలుగురు వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కాని ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా? ఒకరేమో పిల్లనిచ్చిన మామ సాక్షాత్తు ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్. మరొకరు ఈ దత్త పుత్రుడు. వీరిద్దరి కుటిల నీతి వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా?
బాబును సమర్థించేవారు ఆలోచించండి
నిజాయతీగా విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల్లో విప్లవాత్మక అడుగులు పడుతున్నాయి. ఇందులో ఏవీ చేయని చంద్రబాబును సమర్థించే వారు ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇవన్నీ చూస్తే వారికి కడుపు మండుతుంది.
ఎన్ని జలిసిల్ మాత్రలు వేస్తే మాత్రం ఈ కడుపుమంట తగ్గుతుంది! వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద గీతను చెరిపేసే ప్రయత్నంలో భాగంగా ఈ దిక్కుమాలిన రాతలు, దిక్కుమాలిన కథనాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఉద్యోగులను సైతం రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు.
ఏం చేశారని ఓట్లడుగుతారు?
► 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేశాడు. కేవలం నాలుగన్నరేళ్లు పనిచేసిన మీ బిడ్డతో ఢీ కొట్టబోతున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 ఏళ్లలో గుర్తు పెట్టుకోదగ్గ మంచి ఏదైనా, ఎవరికైనా, ఎప్పుడైనా చేశాడా?
► ఫలానా మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి.. ఓట్లు వేయాలని అడగగలరా? మీ బిడ్డ హయాంలో అమలవుతున్న అమ్మ ఒడి కంటే మెరుగైన పథకం అమలు చేశానని ఓట్లు అడగగలరా?
► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం మన ప్రభుత్వంలో అమలవుతున్న వైఎస్సార్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఇచ్చానని ఓటు అడగగలరా?
► మీ బిడ్డ హయాంలో వైఎస్సార్ చేయూత కంటే ఇంకా మెరుగైన పథకం అమలు చేసి ఉంటే, దానిని చూపి ఓట్లేయండని అడిగే ధైర్యం ఉందా? ఏకంగా 31 లక్షల ఇంటి స్థలాలు నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. ఇందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం నేను చేశానని ఈ బాబు ఓట్లు అడగగలరా?
► డీబీటీ ద్వారా 2.45 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఇలా తాను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉంటూ ఎన్ని బటన్లు నొక్కి.. ఇంత డబ్బు ప్రజలకు ఇచ్చానని ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి చెప్పగలడా?
► ప్రజల బ్యాంకు స్టేట్‌మెంట్లు చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ 2014–2019 మధ్య తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం చేసిన మేలుతో పోల్చి ఓటు అడగగలడా? కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే.. ఈ ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగగలడా? చంద్రబాబు అడగలేడు. ఎందుకంటే ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేనే లేదు.
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సచివాలయ వ్యవస్థ
► కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే.. పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో ఎవరు తీసుకొచ్చారంటే గుర్తుకొచ్చేది మీ జగనే. ఏ గ్రామంలోనైనా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థతో పింఛను మొత్తం పెంచింది, ఆర్బీకేలు తెచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగనే.
► గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, మహిళా పోలీసులు, అక్క చెల్లెమ్మల ఫోన్‌లలో దిశ యాప్, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగనే. 104, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్.. ఇలా అనేక పథకాలు తీసుకొచ్చింది దివంగత మహానేత వైఎస్సార్ అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేసి అమలు చేస్తున్నది ఎవరంటే గుర్తుకొచ్చేది మీ జగనే.
► రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా, అక్క చెల్లెమ్మలు, రైతన్నలకు సున్నా వడ్డీ, అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అసైన్డ్ భూముల మీద 22ఎ తొలగించి 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది మీ జగనే. పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పతురల్లో నాడు–నేడు, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీలు, పిల్లలకు ట్యాబులు, శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం, రూ.2.45 లక్షల కోట్లు డీబీటీ, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు.. ఈ పేర్లు విన్నప్పుడు గుర్తుకు వచ్చేది మీ జగనే. 11 కొత్త మెడికల్ కళాశాలలు, కొత్తగా 6 పోర్టులు, మరో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. నాటికి, నేటికి తేడా గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment