
సాక్షి, భీమవరం: ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటనలోనూ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. శుక్రవారం నాటి భీమవరం పర్యటనలో అనారోగ్యంతో, ఇతరత్రా ఇబ్బందులతో బాధ పడుతున్న వారి గోడు విని అప్పటికప్పుడే సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన గుడాల అపర్ణ జ్యోతి, దెందులూరు మండలం శ్రీరామవరంనకు చెందిన కంతేటి దుర్గాభవాని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భీమడోలు మండలం పూళ్లకు చెందిన అరుగుల లాజర్ తనయుడు, అదే గ్రామానికి చెందిన నూతుల మార్తమ్మ, యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన చిల్లి సుమతి తనయునికి వైద్య సాయం నిమిత్తం ఆర్థిక సాయం, భర్త మృతి చెందిన నరసాపురం 29వ వార్డుకు చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణ, ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చెందిన తేతలి గీతలకు పరిహారంగా ఆర్థిక సాయం అందజేశారు.
నరసాపురం మండలం ఎల్‌బీ చర్లకు చెందిన కడలి నాగలక్ష్మికి భూపరిష్కారం నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతి, జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డిలు తొమ్మిది మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు.