రేపటి నుంచి 24 వరకు పెద్దింట్లమ్మ జాతర
21న జలదుర్గ, గోకర్ణేశ్వర స్వామి కల్యాణోత్సవం
అదే రోజున ప్రభల ఊరేగింపు.. అమ్మవారికి బోనాలు
కైకలూరు: చుట్టూనీరు.. మధ్యన ద్వీపకల్పం.. పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన క్షేత్రంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొల్లేటి గ్రామాల ఆరాధ్య దేవత పెద్దింట్లమ్మ క్షేత్రంలో అనేక విశేషాలున్నాయి. ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గ, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
చరిత్రలో కొల్లేటికోట
‘దండకారణ్య మధ్యమున మహా సరస్సొకటి కలదు. అది జల విహంగములతో అత్యంత రమణీయమైనది’ అని అగస్త్యుడు శ్రీరామచంద్రునితో చెప్పినట్టు రామాయణంలోని అరణ్య కాండంలో పేర్కొనబడింది. చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ కొల్లేరు సరస్సును ఒక మహత్తర మంచినీటి సరస్సుగా అభివర్ణించారు. దండి మహాకవి ‘దశకుమార చరిత్ర’లో కొల్లేరు సరస్సుతోపాటు బహు సాహసిగా పేరు గడించిన తెలుగు భీముడు (భుజబలపట్నం ఆ«దీశుడు) గురించి రాశారు.
విజయాదిత్య చక్రవర్తి పార్వతీదేవి రూపంలో కొలువైన అమ్మవారిని మొదటిసారిగా పెద్దమ్మగా సంబోధించారు. కమలాకరపుర వల్లభుల శాసనాల ప్రకారం వేంగి–చాళుక్య రాజులకు వైవాహిక బాంధవ్యాలు ఉండేవి. వీరికి ప్రధాన పురాలుగా కమలాకరపురం (ఏలూరు), పద్మినీపురం (గణపవరం), కొలనువీడు (కొల్లేటికోట)ను వ్యవహరించారు.
కోస్తా జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద అనివేటి మండపాన్ని దాతల విరాళం రూ.4.50 కోట్లతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) నిర్మించారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ క్షేత్రానికి చేరుకోవడానికి సర్కారు కాలువపై ఇనుప వంతెన మాత్రమే ఆధారంగా ఉండేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.14.70 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం అందుబాటులోకి వచ్చింది.
ఏర్పాట్లు పూర్తి
పెద్దింట్లమ్మ జాతర మార్చి 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. 21న జలదుర్గ, గోకర్ణేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తాం. కల్యాణం రోజునే ప్రభ బండి, బోనాలు, కలువమ్మల గ్రామోత్సవం జరుగుతుంది. చివరి రోజున కోనేరులో తెప్పోత్సవం ఉంటుంది. కొల్లేరు వారధి పూర్తికావడంతో ఈ ఏడాది భక్తుల తాకిడి మరింతగా పెరుగుతుందని భావిస్తున్నాం. – కందుల వేణుగోపాలరావు, ఈవో
Comments
Please login to add a commentAdd a comment