ద్వారకాతిరుమల: గత టీడీపీ జన్మభూమి కమిటీ నిర్వాకం కారణంగా వ్యవసాయ భూమిని కోల్పోయిన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పావులూరివారిగూడెంకు చెందిన బంటుమిల్లి రామలక్ష్మి అలుపెరుగని న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. భూవివాద సమయంలో సంభవించిన తన భర్త మృతి ముమ్మాటికీ జన్మభూమి కమిటీ చేసిన హత్యేనని ఆమె జాతీయ ఎస్సీ కమిషన్ (న్యూఢిల్లీ)ను ఆశ్రయించారు. దాంతో సదరు కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ ఈనెల 18న ఆదేశాలు జారీ చేసింది.
బాధితురాలి కథనం ప్రకారం.. 1981లో పావులూరివారిగూడెంలో భూస్వామి దేవరపల్లి హనుమంతరావు వద్ద లాండ్ సీలింగ్‌లో అధికంగా ఉన్న 16.44 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఆ భూమిని నిరుపేదలైన 16 మందికి ఒక్కో ఎకరం చొప్పున, మరో వ్యక్తికి 44 సెంట్లు ఇచ్చారు. అందులో బంటుమిల్లి సుబ్బారావు ఎకరం భూమిని పొందారు. అయితే హనుమంతరావు తన వద్ద ప్రభుత్వం అధిక భూమిని సేకరించిందని హైకోర్టును ఆశ్రయించారు.
దాంతో హైకోర్టు 2012లో 7.80 ఎకరాల భూమిని తిరిగి హనుమంతరావుకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా భూమిని కోల్పోయే లబ్ధిదారులకు మరోచోట భూమిని కేటాయించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో హనుమంతరావుకు రెవెన్యూ అధికారులు భూమిని తిరిగి వెనక్కిచ్చారు గానీ, బాధితులకు ఏవిధమైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించలేదు.
అడ్డగోలుగా జన్మభూమి కమిటీ నిర్ణయం
ఇదిలా ఉంటే 2015 నవంబర్ 27న టీడీపీ జన్మభూమి కమిటీ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పటికే సాగులో ఉన్న సుబ్బారావు ఎకరం భూమిలో అరెకరం నంబూరి సోమరాజు కుటుంబ సభ్యులకు కేటాయించారు. దాంతో అప్పటి నుంచి గ్రామంలో భూ వివాదాలు, కొట్లాటలు మొదలయ్యాయి.
సుబ్బారావుకు హైకోర్టులో సైతం అనుకూలంగా తీర్పు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. 2021 ఫిబ్రవరి 17న వివాదాస్పద భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కొందరు సుబ్బారావుపై దాడి చేశారు. అదేరోజు అతడు మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య రామలక్ష్మి ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
సుబ్బారావు మృతికి సంబంధించి పోలీసుల విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రామలక్ష్మి 2021 మార్చిలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది. 2021 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో విచారణ చేపట్టింది. పోలీస్, రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2022 డిసెంబర్ 22న భూమిని కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను కమిషన్ ఆదేశించింది.
సుబ్బారావు మృతిపై పునఃవిచారణ చేపట్టాలని కూడా డీఎస్పీ పైడేశ్వరరావు, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బాధితులకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయించారు. కాగా పోలీసులు సమర్పించిన నివేదికపై సంతృప్తి చెందని కమిషన్ సుబ్బారావు మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ సంచలన తీర్పు
ఈనెల 18న కమిషన్ చేపట్టిన విచారణకు డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఏలూరు ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, భీమడోలు సీఐ భీమేశ్వర రవికుమార్, ద్వారకాతిరుమల తహసీలా్దర్ పి.సతీష్, ఎస్సై టి.సుధీర్‌లు హాజరై, తమ నివేదికను సమర్పించారు. దీనిపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేసిన కమిషన్ కేసు దర్యాప్తును సీబీ సీఐడీకి అప్పగిస్తూ సంచలన ఆదేశాలను జారీ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుని, నివేదికను సమర్పించాలని కమిషన్ మెంబర్ సుభాష్ రాంనాథ్ పార్ధీ ఆదేశించారు.
న్యాయం జరుగుతుంది: జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రామలక్ష్మి తెలిపారు. నా భర్త సుబ్బారావు మృతికి కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అప్పటి గ్రామ రెవెన్యూ అధికారి వీర్రాజుకు తగిన శిక్ష పడేవరకు పోరాటం చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment