ఆ జ్ఞాపకాలు ఎంతో మధురం ∙సినీ నటుడు ప్రియదర్శి
‘నేను పెరిగింది హైదరాబాద్ పాతబస్తీలో. చిన్నప్పటి నుంచి లాల్ దర్వాజా బోనాలు చూస్తూ పెరిగాను. పోతరాజు వేషంలో డ్యాన్స్ చేసేవాళ్లని చూస్తుంటే సంతోషంగా ఉంటుంది. డ్రమ్స్, మ్యూజిక్, డ్యాన్స్ చూస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంటుంది. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక డైరెక్టుగా బోనాల్లో పాల్గొనలేకపోతున్నాను గాని.. లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ.. ఇలా అమ్మవార్ల బోనాల ఉత్సవాలను టీవీలో చూస్తుంటాను.. చాలా సంతోషంగా ఉంటుంది’ అని సినీ నటుడు ప్రియదర్శి అన్నారు. సహాయ, కామెడీ పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. నగరంలో బోనాల పండగ జోరుగా జరుగుతున్న సందర్భంగా ‘సాక్షి’తో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.
‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గమనిస్తున్నది ఏంటంటే.. బోనాల తర్వాత మనకు తప్పకుండా వర్షం వస్తుంది. ఈ విషయాన్ని నేను ఏళ్ల తరబడి చూస్తున్నాను. బోనాల సమయంలో తప్పనిసరిగా వర్షం రావడం మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్‌లో అన్ని కులాలు, మతాల వారు బోనాల ఉత్సవాలను ఎంతో సంబరంగా జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు బోనాల్లో డ్యాన్స్ చేసేవాణ్ని.
పోతరాజు వేషధారణల మధ్య డ్యాన్స్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అలాగే హైదరాబాద్‌లో యాదవ సోదరులు సదర్ ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అవి కూడా నాకెంతో ఇష్టం.. నేను పాల్గొనేవాణ్ని. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌లో నేను ఘంటా రవి పాత్ర చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ బాగా రిఫరెన్స్‌గా వాడుకున్నా. సెలబ్రిటీ అయ్యాక బోనాలు, సదర్ ఉత్సవాల్లో డైరెక్టుగా పాల్గొనలేకపోతున్నాను. తప్పదు.. కొన్నింటిని త్యాగం చేయాల్సిందే.
సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ఘనంగా జరుపుకుంటారో హైదరాబాద్‌లోనూ అంతే గ్రాండ్‌గా జరుపుకొంటారు. తెలంగాణలో సమ్మక్క– సారక్క, కొండగట్టు అంజన్న, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, మల్లన్న జాతర.. ఇలాంటివన్నీ సంస్కృతికి నిదర్శనం’. హిందువుల పండగలనే కాదు... నాకు అన్ని పండగలూ ఇష్టమే. ప్రత్యేకించి రంజాన్, బక్రీద్ సమయంలో ముస్లిం స్నేహితులని కలవడం.. వారు పెట్టే ఖీర్ (పాయసం) తినడం చాలా హ్యాపీగా ఉండేది’ అన్నారు ప్రియదర్శి.
Comments
Please login to add a commentAdd a comment