సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.
‘‘రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయాన్ని చాటి చెప్పారు. కుల మతాలకు అతీతంగా ఐక్యత తో బోనాల ఉత్సవాలు చేసుకోవాలి. ప్రశాంతంగా బోనాలు ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
చదవండి: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
మాజీ క్రికెటర్ మిథాలిరాజ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్.. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు.
పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటున్నాయి. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment