ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్‌లో 350 కాలేజీల్లో ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. అయితే ఈ వర్సిటీల్లో చదివించేందుకు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం. సీటు తెచ్చుకోండి.. రూ.1.25 కోట్లు మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం.
జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బెస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగితే వారి బతుకులతో పాటు రాష్ట్ర రూపురేఖలు మార్చే లీడర్ షిప్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు మన పిల్లల్ని చేయిపట్టుకుని మరీ పైకి తీసుకుని పోయే అవకాశాలు ఇస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. దేశ భవిష్యత్‌ను, తల రాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య దాకా 55 నెలల పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేశాం. ఏకంగా రూ.73 వేల కోట్లు విద్యా రంగానికే ఖర్చు చేశానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యా రంగంలోనే కాకుండా వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ప్రతి రంగంలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను కంప్యూటర్‌లో బటన్ నొక్కి విడుదల చేశారు. 8,09,039 మంది పిల్లలకు మంచి చేసేలా రూ.7,47,920 మంది తల్లుల ఖాతాల్లో రూ.583 కోట్లు జమ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా 27.61 లక్షల మంది పిల్లల పూర్తి ఫీజులు రూ.11,900 కోట్లు చెల్లిస్తూ తల్లిదండ్రులపై భారం పడకుండా ఒక మేనమామలా ఆదుకున్నానని చెప్పారు. పిల్లలపై బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల భారం పడకూడదని వసతి దీవెన ద్వారా అండగా ఉంటూ రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలనే తాపత్రయంతో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మొత్తంగా రూ.16,175 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు.
‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు, డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలి. అలా ఆ కుటుంబాల తలరాతలు మారాలనే తపనతో అడుగులు వేస్తున్నాం. 2017–18కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజులు రూ.1,777 కోట్లను మనందరి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఉన్నత విద్యలో సంస్కరణలు
♦ నాడు–నేడుతో బడుల రూపురేఖలను మార్చుతూ ఉన్నత విద్యపై ధ్యాస పెట్టి సంస్కరణలు తీసుకువచ్చి కరిక్యులంలో మార్పులు చేశాం. పిల్లలు ఏం చదువుతున్నారు.. అని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి మీ జగన్ మామ పాలనలోనే జరిగింది. తొలిసారి డిగ్రీలో కూడా ఆన్‌లైన్ వర్టికల్స్‌ను తీసుకొచ్చాం. ఏకంగా 10 నెలల ఇంటర్న్‌షిప్‌తో జాబ్ ఓరియంటెడ్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేశాం.
♦ మన పిల్లలు ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో చదువులుండాలనే తపనతో అంతర్జాతీయంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, ఎంఐటీ, హార్వర్డ్, ఎల్బీఎస్, ఎల్‌ఎస్‌సీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వచ్చేందుకు హైడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యాం. తద్వారా ఆన్‌లైన్‌లో ఆ కోర్సులు తీసుకొస్తూ ఏఐని అనుసంధానం చేస్తూ డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నాం.
♦ పేద విద్యార్థులు మన పిల్లలు.. ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితేనే వేగంగా ఎదగగలుగుతారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలో భాగమైనప్పుడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ముందు వరుసలో ఉంటాం. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది.
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఒక పేజీ ఇంగ్లిష్, ఒక పేజీ తెలుగుతో బై లింగ్వల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా మెరుగైన చదువు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉండే.. రూ.15 వేలు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే తప్ప రాని బైజూస్ కంటెంట్‌ను మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వ తరగతి.. ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్ రూంలో ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చి డిజిటల్ బోధనను తీసుకువచ్చాం. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాం.
తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు సీబీఎస్‌ఈతో మొదలై ఐబీ వరకు వెళుతున్న ఈ ప్రయాణం పిల్లలందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దే వరకు సాగుతుంది. 3వ తరగతి నుంచి టోఫెల్ సబ్జెక్ట్‌ను తీసుకువచ్చి క్లాస్ టీచర్ లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేయడం వరకు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వాళ్ల జగన్ మామ ఎంతో తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అన్నా.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యా
నేను పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. నేను ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో చిన్నప్పటి నుంచి కలగనేదాన్ని. జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టకుండా చదువుకుంటున్నాను. మొత్తం ఫీజు మీరే (సీఎం) కట్టారు. వసతి దీవెన ఎంతో ఉపయోగపడింది. మీ వల్ల అందరం బాగా చదువుకోగలుగుతున్నాం. మీ వల్ల నేను మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఆ క్రెడిట్ అంతా మీదే సార్. – ప్రిన్స్ ఏంజిల్, బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని, నరసాపురం
మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారన్నా
నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బీటెక్ చదువుతున్నా. నెల్సన్ మండేలా చెప్పినట్టు విద్య అనే ఒక ఆయుధం మాత్రమే మన భవిష్యత్‌ను మారుస్తుంది అన్న మాటను మీరు నిజం చేశారు. మీరు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ వర్సిటీల్లో మాదిరి సిలబస్ తీసుకొచ్చారు. మహిళా సాధికారత, విద్య.. ఈ రెండు జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మీరు ఈ రెండింటినీ సాధించారు. మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్యూ సార్. – నవ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, భీమవరం
మార్పును గమనించండి
♦ దేశ భవిష్యత్‌ను మార్చగలిగేది చదువు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి. ఈ రోజు మనందరి ప్రభుత్వం రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. తేడాను మీరే గమనించాలి. చదువు అనేది తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను మార్చాలన్నా, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా, వెనుకబడిన కులాల తలరాతను మార్చాలన్నా, దేశ భవిష్యత్‌ను మార్చాలన్నా.. ఆ శక్తి కేవలం చదువుకే ఉంది. అందుకే 55 నెలల ప్రయాణంలో విద్యా రంగంలో విప్లవాత్మక అడుగులు వేశాం.
♦ నాడు–నేడుతో బడులు బాగుపడిన తీరుతెన్నులు గమనించాలి. ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరుముద్ద మీద ఫోకస్ పెట్టాం. పిల్లలు బాగా చదవాలని, వారిని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ప్రభుత్వ బడులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు తీసుకువచ్చి రూపురేఖలు మార్చుతున్నాం.
♦ ఒక్క విద్యా రంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. కేవలం 55 నెలల కాలంలోనే ఇన్ని మార్పులు జగన్ చేయగలిగినపుడు గత పాలకులు 14 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారో మీరే ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన గుర్తు తెచ్చుకోండి.
Comments
Please login to add a commentAdd a comment