
ప్రసంగిస్తున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
సాక్షి, అమలాపురం: మండపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారతను శుక్రవారం నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రతిబింబించింది. మండపేటతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఈ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
దీంతో మండపేట వీధులన్నీ జనసంద్రాలే అయ్యాయి. రెండు వేల ద్విచక్ర వాహనాలతో యువత ర్యాలీ చేశారు. తాపేశ్వరంలో ప్రారంభమైన యాత్ర మండపేటలోని కలువపువ్వు సెంటర్‌లోని సభా ప్రాంగణం వరకు దిగ్విజయంగా సాగింది. యాత్ర పొడవునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారికి సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ సాగారు. ప్రజలు వారికి పూలు, హారతులతో స్వాగతం పలికారు.
వేలాదిగా ప్రజలు పాల్గొన్న సభలో నేతలు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, ప్రజలకు చేస్తున్న మేలును వివరించారు. సీఎం జగన్ పేరు వచ్చిన ప్రతిసారీ సభలోని ప్రజలు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యమైంది: మంత్రి జోగి రమేష్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమైందని మంత్రి జోగి రమేష్ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ చేసినంత మేలు చేయలేదని తెలిపారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొని తిరగగలుగుతున్నారంటే, అది సీఎం జగన్ అందించిన చేయూత ఫలితమేనని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు నిజమైన రాజ్యాధికారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అందించారు. 25 మంది మంత్రులు ఉంటే వారిలో 15 మంది బీసీలేనని, 9 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలకే ఇచ్చారని వివరించారు.
చరిత్ర సృష్టించిన జగన్: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీలో పేదలకు, బడుగు, బలహీన, దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ ప్రారంభించారని, ఇప్పటివరకు ఇచ్చింది 20 లక్షల మందికి మాత్రమేనని తెలిపారు.
అణగారిన వర్గాలకు గౌరవం అనేది విద్యతో వస్తుందని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. పేదలకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనందరం మరోసారి సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
పేదల ఆత్మబంధువు సీఎం జగన్: జూపూడి ప్రభాకరరావు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఆత్మబంధువు అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. పేదలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ, బడుగుల కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకొనేలా పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అంటే భూస్వామి కాదు.. పెట్టుబడిదారు కాదు.. ప్రభుత్వం అంటే ప్రజలదే అని నిరూపించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. రాష్ట్రంలో 72 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 52 శాతం మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవులు ఇచ్చారని తెలిపారు. ఓటు వేయనివారికి సైతం పథకాలు అందించిన ఘనత జగన్‌కు దక్కుతోందన్నారు.
మహిళా సాధికారిత జగన్‌తోనే: ఎంపీ చింతా అనూరాధ
సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో మహిళా సాధికారత సాధ్యమైందని ఎంపీ చింతా అనూరాధ చెప్పారు. చట్ట సభలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం తెచ్చిందని, సీఎం జగన్ స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి మించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా లబ్ధిపొందారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment