కైకలూరు: ఓ ఆక్వా రైతును నెల రోజులుగా కామ్రేడ్స్ పేరుతో సెల్ ఫోన్ల ద్వారా బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న డ్రైవర్ల గ్యాంగ్‌ను ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. టౌన్ స్టేషన్‌లో సీఐ ఆకుల రఘు, ఎస్‌ఐ జ్యోతిబసు వివరాలు వెల్లడించారు. కైకలూరుకు చెందిన ఐబీకేవీ ప్రసాదరాజు (వజ్రం రాజు) ప్రముఖ ఆక్వా రైతు. నెల రోజులుగా రెండు నంబర్ల నుంచి ‘కామ్రేడ్స్ మాట్లాడుతున్నాం.. మాకు రూ.2 కోట్లు ఇవ్వకపోతే నీతో పాటు నీ కొడుకును చంపేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు.
పదే పదే ఫోన్లు రావడంతో ప్రసాదరాజు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు. మండవల్లి మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తోకల ఏసేబు (36), చిన్నం బారంబాసు (51), హైదరాబాదు, ఏజీ కాలనీ, ఎర్రగడ్డకు చెందిన శీలం హేమంత్‌కుమార్ (33), హైదరాబాదు, హిమాయత్‌నగర్‌కు చెందిన దారా మాణిక్యరావు (44)గా వారిని గుర్తించారు.
వీరిలో ఏసేబు, మాణిక్యరావు కైకలూరులో ప్రసాదరాజు దగ్గర గతంలో కారు డ్రైవర్లుగా పనిచేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మాణిక్యరావు హైదరాబాదులోని తన స్నేహితుడు, కారు డ్రైవర్ హేమంత్‌కుమార్‌తో రెండు సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. హైదరాబాదు శివారు రింగురోడ్డు నుంచి ఫోన్లు చేసి ప్రసాదరాజును డబ్బు కోసం బెదిరించారు. నిందితుల్లో ఏసేబు, బారంబాసు, హేమంత్‌కుమార్ అరెస్టు చేశారు. మాణిక్యరావును పట్టుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment