reservoier
-
ఎడతెరపిలేని వర్షాలకు భారీగా వచ్చిచేరుతున్న వరద నీరు
-
ఉమ్మడి జలాశయాలను ఏకపక్షంగా వాడుకోవడం తెలంగాణ కు తగదు
-
నీటి లెక్కలు తేలాకే ‘నవలి’పై చర్చిద్దాం
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన కర్ణాటకలో కొప్పళ జిల్లా నవలి వద్ద 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించాలన్న ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. కర్ణాటక సర్కారు ఇప్పటికే ఎగువన తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా కేటాయించిన నీటి కంటే అధికంగా మళ్లిస్తుండటం వల్ల తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గుతోందని స్పష్టం చేసింది. కర్ణాటక అధికంగా తరలిస్తున్న నీటిని లెక్కించాకే నవలి రిజర్వాయర్‌పై చర్చిద్దామని స్పష్టం చేసింది. తుంగభద్ర బోర్డు సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ డి.రంగారెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. పూడికతో నీటి లభ్యత తగ్గింది: కర్ణాటక తుంగభద్ర జలాశయం(టీబీ డ్యామ్)లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి లభ్యత తగ్గిందని బోర్డు సమావేశంలో కర్ణాటక జలవనరుల కార్యదర్శి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. నవలి వద్ద రిజర్వాయర్‌తోపాటు శివపుర చెరువు సామర్థ్యాన్ని 4.25 టీఎంసీలకు, విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. దీనివల్ల తుంగభద్ర జలాశయంపై ఒత్తిడి తగ్గి 3 రాష్ట్రాలు కేటాయింపుల మేరకు నీటిని వాడుకోవచ్చని ప్రతిపాదించారు. అధికంగానే తరలిస్తోంది: ఏపీ ఈఎన్సీ కర్ణాటక ప్రతిపాదనను ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తోసిపుచ్చారు. నవలి రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. 2008లో టోపోగ్రాఫిక్ సర్వేలో టీబీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలుగా తేల్చారని, 2016 సర్వేలో మాత్రం 104.869 టీఎంసీలుగా లెక్క కట్టారని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే టీబీ డ్యామ్ నుంచి కర్ణాటక సర్కార్ భారీ ఎత్తున నీటిని తరలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. నీటి లెక్కలను తేల్చాకే నవలి రిజర్వాయర్ అంశాన్ని చర్చించాలని స్పష్టం చేశారు. తుంగభద్ర వరద జలాలను ఒడిసి పట్టేందుకు హెచ్చెల్సీకి సమాంతరంగా రోజుకు ఒక టీఎంసీ తరలించే సామర్థ్యంతో వరద కాలువ తవ్వకానికి అనుమతి ఇవ్వాలని కోరారు. డీపీఆర్‌లు అందచేస్తే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ రంగారెడ్డి తెలిపారు. బోర్డు పరిధిలో చేపట్టే పనులకు రివర్స్ టెండరింగ్ వర్తింపచేస్తామన్నారు. కాగా, ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు సహకరించాలన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ప్రతిపాదనపై ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ నిధులు డిపాజిట్ చేస్తే తమ భూభాగంలో ఉన్న ఆర్డీఎస్ను ఆధునికీకరించే పనులు చేపడతామన్నారు. ఆర్డీఎస్ను తుంగభద్ర బోర్డు పరిధిలోకి తేవాలన్న వాదనను తిప్పికొట్టారు. పుష్కరాలు నిర్వహిస్తున్నందున తుంగభద్ర డ్యామ్ నుంచి 15 రోజుల్లో 8 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. చదవండి: ఏపీ: స్కూళ్లు, కళాశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలు -
16 ఏళ్లలో తొలిసారి: నెరవేరిన మహానేత కల
సాక్షి, వరంగల్: ఇటీవల కురిసిన వర్షాలతో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లోకి వరద పోటెత్తింది. నిండుకుండలా మారిన రిజర్వాయర్ నుంచి శనివారం మత్తడి దుంకింది. ఎడారి ప్రాంతంగా మారిన ఇక్కడి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2004లో రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. 0.74 టీఎంసీల సామర్ధ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌కు మూడు గేట్లు బిగించారు. ఈ రిజర్వాయర్ ద్వారా మొత్తం 45,600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలనేది లక్ష్యం. ఇందులో పంగిడి చెరువు పాత తూము ద్వారా 1,500 ఎకరాలు, గ్రావిటీ కెనాల్ ద్వారా చీటకోడూరు రిజర్వాయర్ కింద 4,100 ఎకరాలు, రైట్‌మెన్ కెనాల్ ద్వారా ఆలేరు కెనాల్ కాల్వ కింద 41వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2010లోనే రిజర్వాయర్ పనులు పూర్తికావడంతో గోదావరి జలాలను విడుదల చేశారు. ఏటా 8.6 కిలోమీటర్ల దూరంలోని చాగల్ పంపుహౌజ్ నుంచి అశ్వరావుపల్లి ఔట్‌పాల్ వరకు పంపింగ్ కొనసాగిస్తూ రఘునాథపల్లి, జనగామ మండలాల్లోని పలు గ్రామాల చెరువులు నింపుతున్నారు. మొదటి సారి.. అశ్వరావుపల్లి రిజర్వాయర్ ప్రారంభమయ్యాక 16 ఏళ్లలో మత్తడి దుంకడం ఇదే మొదటి సారి. 877 ఎకరాల భారీ విస్తీర్ణంలో రిజర్వాయర్ ఉంది. వరద అంతకంతకు పెరగడంతో ఎగువన ఉన్న యాపలగడ్డతండా, చర్లతండా రహదారులు నీట మునిగాయి. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో గుర్తించిన ఎస్టీఎల్, ఎఫ్టీఎల్ను దాటి రెండు తండాల్లో నీరు చేరింది. గతంలో భూసేకరణ అవరసం లేదని భావించిన పంట భూములు నీట మునగడంతో తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ మత్తడి పడుతుండడంతో దిగువననున్న కంచనపల్లి, గబ్బెట గ్రామాల్లో వాగుకు ఇరువైపులా ఉన్న ప్రజలను అధికార యంత్రాంగం ముందస్తుగానే అప్రమత్తం చేసింది. ఇప్పటికే గబ్బెట గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ బన్సీలాల్, ఎస్సై కందుల అశోక్‌కుమార్, ఎంపీడీఓ హసీం, దేవాదుల డీఈ రాజు, ఏఈ శ్రీనివాస్‌లు రిజర్వాయర్‌ను సందర్శించి ప్రజలకు సూచనలు చేశారు. కాగా, వర్షాలు తగ్గడంతో వాగుకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రిజర్వాయర్ మత్తడి దుంకుతుండటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఎత్తయిన ప్రాంతం నుంచి అలుగు పారుతుండడాన్ని చూసి పులకించిపోతున్నారు. మహానేత వైఎస్సార్ చలవేనని గుర్తు చేసుకున్నారు. -
డిండి మళ్లీ మొదటికి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు అలైన్మెంట్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే అలైన్మెంట్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. దీంతో నీటిని పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఏదుల రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని తాజాగా నిర్ణయించారు. ప్రాజెక్టుల్లో అటవీ సమస్యల కారణంగా కేంద్ర సంస్థల అనుమతులు రావడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఏదుల నుంచి శ్రీశైలానికి వరద ఉండే 60 రోజుల్లో రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని తీసుకునేందుకు తుది ప్రతిపాదన సిద్ధం చేశారు. ఏదుల నుంచే ముందుకు.. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 4.5 లక్షల ఎకరాలకు పాలమూరులో భాగంగా ఉన్న రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పాలమూరులో భాగంగా ఉన్న ఏదుల నుంచే తీసు కోవాలని తొలుత భావించినా, దాన్ని నార్లాపూర్‌కు మార్చారు. అయితే నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే అలైన్మెంట్తో కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టు దెబ్బతినే అవకాశం ఉండటం, దీనికి పాలమూరు జిల్లా నేతలు అభ్యంతరాలు చెప్పడం తో మళ్లీ సర్వే చేయించారు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించే ప్రణాళికకు ఓకే చెబుతూనే రంగాయపల్లి పంప్‌హౌస్‌లో పంపింగ్ మెయిన్ తగ్గించాలని, గ్రావిటీ టన్నెల్ ఏర్పాటు చేయాలని తేల్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం నార్లాపూర్ నుంచి డిండికి సుమారు 50 కిలోమీటర్ల దూరంతో పాటు కాల్వలను, సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను అధికారులు పరిశీలించగా 5వ కిలోమీటర్ నుంచి 20వ కిలోమీటర్ వరకు ఉన్న అలైన్మెంట్, రంగాయపల్లి వద్ద నిర్మించే పంపింగ్ మెయిన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని వెల్లడైంది. దీం తో మళ్లీ రీసర్వే చేయించారు. ఇందులో ఏదుల నుంచే నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏదు ల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ చానల్, 2.5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 16 కిలోమీటర్ల మేర టన్నెల్ ద్వారా నీటిని డిండిలో భాగంగా ఉన్న ప్రతిపాదిత ఉల్పర రిజర్వాయర్‌కు చేరేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు రూ. 1,200 కోట్ల అంచనా వేశారు. ఏదుల నుంచి డిండి అలైన్మెంట్ ఖరారు కానందున, ఆలోపు దిగువన ఉన్న సింగరాజు పల్లి (0.8 టీఎంసీలు), గొట్టిముక్కల (1.8), చింతపల్లి (0.99), కిష్టరాంపల్లి (5.68), శివన్నగూడం (11.96 టీఎంసీల) రిజర్వాయర్లు.. వాటికి అనుబంధంగా మెయిన్ కెనాల్ పనులకు ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు పిలిచి పనులు ఆరంభించిన విషయం తెలిసిందే. -
దాహంతో వచ్చి.. కాలువలో పడి..
నిజాంసాగర్(జుక్కల్): వేసవి కాలం ఆరంబానికి ముందే వన్యప్రాణులకు తాగునీటి తిప్పలు ప్రారంభమయ్యాయి. నీటికోసం వచ్చిన మూడు నీల్గాయ్లు గురువారం నిజాంసాగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ కాలువలో పడిపోయాయి. రిజర్వాయర్ కాలువలో నుంచి బయటకు రాలేక ఇబ్బందిపడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు బాన్సువాడ అటవీశాఖ సెక్షన్ అధికారి సిద్ధార్థకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాన్సువాడ డివిజనల్ అటవీశాఖ అధికారి గోపాల్రావ్, సెక్షన్ ఆఫీసర్ సిద్ధార్థ సంఘటన స్థలానికి చేరుకుని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి వాటిని బయటికి తీశారు. ఒక నీల్గాయ్ రహదారి వెంట పరుగులు పెట్టడంతో ఊర కుక్కలు వెంబడించాయి. దీంతో అది నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి దూకింది. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం 1,600 క్యూసెక్కులు ఉండడంతో నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు సిరాజుద్దీన్, హన్మాండ్లు కాలువలోకి దూకి, తాళ్లతో బంధించి సురక్షితంగా బయటకు తీశారు. ఆ నీల్గాయ్కి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలారు. -
పాలేరుకు వరద పోటు
22 అడుగులకు చేరిన నీటిమట్టం అప్రమత్తమైన ఎన్నెస్పీ సిబ్బంది కూసుమంచి: భారీ వర్షాల కారణంగా పాలేరు రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో.. వరదనీరు కొంత మేర పాలేరు రిజర్వాయర్‌లో కలుస్తోంది. పాలేరుకు 1000క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని దేవులపల్లి రిజర్వాయర్ అలుగు పోస్తుండగా మరో 3,500 క్యూసెక్కుల వరదనీరు కాలువ ద్వారా రిజర్వాయర్‌కు చేరుతోంది. దీంతో రిజర్వాయర్‌కు సుమారు 5వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో రిజర్వాయర్ నీటి మట్టం శుక్రవారం 18.6 అడుగులు ఉండగా శనివారం సాయంత్రానికి 22 అడుగులకు చేరింది. ఇన్‌టేక్‌వెల్‌కు పొంచి ఉన్న ప్రమాదం.. పాలేరుకు వరద పోటెత్తుతుండటంతో రిజర్వాయర్ ఒడ్డున మిషన్ భగీరథ పథకం కోసం నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్‌కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్‌కు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఇన్‌టేక్‌వెల్‌లోకి నీరు వెళ్లకుండా మట్టితో నిర్మించిన కట్ట కోతకు గురవుతోంది. అది తెగితే రిజర్వాయర్‌లోని నీరు ఇన్టెక్వెల్లోకి చేరి నిర్మాణాలు మునిగే ప్రమాదం ఉంది. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఇసుక బస్తాలను వేసి కట్టను పటిష్ట పరుస్తున్నారు. దిగువకు నీటి విడుదల.. పాలేరు రిజర్వాయర్ నిండుతుండటంతోపాటు రిజర్వాయర్‌లోని ఇన్‌టేక్‌వెల్‌కు ప్రమాదం కలుగకుండా ఉండేందుకు ఎడమ కాలువకు 3,500 క్యూసెక్కుల నీటిని శనివారం మధ్యాహ్నం నుంచి విడుదల చేస్తున్నారు. ఈ నీరు రెండో జోన్‌కు సరఫరా అవుతోంది. కాగా రిజర్వాయర్ నీటిమట్టం 22 అడుగుల దాటితే ఇన్‌టెక్‌వెల్‌కు ప్రమాదం ఉన్నందున ఎన్నెస్పీ సిబ్బంది అప్రమత్తమై ఇన్‌ఫ్లోకు అనుగుణంగా అవుట్ప్లోను పెంచే చర్యలు చేపట్టారు.