florid problem
-
వట్టెం టు డిండి!
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో చేపట్టిన డిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే అంశం ఖరారైంది. డిండికి నీటిని తీసుకునే ప్రాంతాలపై గడిచిన మూడేళ్లుగా సుదీర్ఘ అధ్యయనం చేసిన ప్రభుత్వం తుదకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న వట్టెం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకే మొగ్గు చూపింది. నార్లాపూర్, ఏదుల ద్వారా నీటిని తరలిస్తే అధిక వ్యయాలతో పాటు, టన్నెల్ మార్గాల నిర్మాణం ఆలస్యం అవుతుందన్న అంచనాతో వట్టెం నుంచి తరలింపుకే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కేవలం రూ.230 కోట్లతో ఈ ప్రణాళిక పట్టాలెక్కనుంది. సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం నుంచి రోజుకు అర టీఎంసీ నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోస్తూ.. 30 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ 30 టీఎంసీల నీటిని మొదట పాలమూరు–రంగారెడ్డిలో భాగంగా ఉండే నార్లాపూర్ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇక్కడి నుంచి నీటిని తీసుకుంటే ఇప్పటికే వృధ్ధిలోకి వచ్చిన కల్వకుర్తి ఆయకట్టు దెబ్బతింటుండటం, భూసేకరణ సమస్యలతో పాటు, అటవీ ప్రాంతాల నుంచి అలైన్మెంట్ ఉండటంతో దీన్ని పక్కనపెట్టారు. ఈ మార్గం ద్వారా నీటిని తీసుకునేందుకు రూ.3,908 కోట్ల వరకు వ్యయం అవుతోంది. దీంతో దీన్ని పక్కనపెట్టి పాలమూరులో రెండో రిజర్వాయర్ అయిన ఏదుల నుంచి తరలించే అంశంపై అధ్యయనం చేశారు. ఈ మార్గం ద్వారా తరలింపులో 18 కిలోమీటర్ల టన్నెల్ మార్గం అవసరం అవుతోంది. ఇది పూర్తి చేయాలంటే కనీసంగా రెండేళ్లకు పైగా సమయం పడుతోంది. అదీగాక దీనికి వ్యయం రూ.1,298 కోట్ల మేర ఉంటోంది. టన్నెల్ మార్గాలు వద్దనుకుంటే... అటవీ ప్రదేశం గుండా నీటి తరలింపు ఉండటంతో ఈ ప్రతిపాదనను సైతం పక్కనపెట్టారు. కొత్తగా పాలమూరులో మూడో రిజర్వాయర్‌గా ఉన్న వట్టెం నుంచి నీటిని తరలించే మార్గాలపై అధ్యయనం చేసి, ఓపెన్ కాల్వల ద్వారా నీటి తరలింపునకు అవకాశం ఉండటంతో దీనికి మొగ్గు చూపారు. వట్టెం నుంచి నీటిని తీసుకుంటూ పోతిరెడ్డిపల్లి మండలంలోని ఊరచెరువు మార్గం ద్వారా తాడూరు మండలం బలాన్‌పల్లి గ్రామంలోని చెన్నకేశవులు చెరువు, ఇదే మండల పరిధిలోని గోవిందయ్యపల్లి గ్రామ పెద్దచెరువు ద్వారా 16 కిలోమీటర్ల మేర నీటిని తరలించి డిండి వాగులో కలుపుతారు. ఈ వాగులో చేరిన నీరు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం కొత్తగా ప్రతిపాదించిన ఉల్పర బ్యారేజీకి తరలించేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దీనికి కేవలం రూ. 230 కోట్ల వ్యయం కానుంది. ఇక్కడి నుంచి నీటిని గ్రావిటీ మార్గాన శింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్విన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ వరకు తరలించనున్నారు. గొట్టిముక్కలలో మిగిలిన 355 ఎకరాల భూసేకరణ ఎగువన వట్టెం నుంచి నీటిని తరలించే ప్రక్రియ ఆల స్యమైనా డిండి ద్వారా దేవరకొండ నియోజకవర్గంలో తొలి సాగు ఫలాలు ఈ వానాకాలంలోనే అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గొట్టిముక్కల రిజర్వాయర్ పనులను 95 శాతం పూర్తి చేశారు. 1.83 టీఎంసీల సామర్ధ్యంతో 3.75 కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 30 మీటర్ల మేర మాత్రమే కట్ట నిర్మాణం మిగిలి ఉంది. 5 క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయింది. దీనికి సొంతంగానే 474 చదరపు కిలోమీటర్ల మేర పరీవాహకం ఉండటంతో ఈ పరీవాహకం నుంచి వచ్చే నీటితో ఇందులో ఒక టీఎంసీకి పైగా నీటిని నింపే అవకాశం ఉంది. దీనికింద నిర్ణయించిన 28 వేల ఎకరాల్లో సగం ఆయకట్టుకు అంటే 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. 355 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 87 ఎకరాలు అవార్డు కాగా, దీనికై రూ.16 కోట్లు అవసరం ఉంది. ఇందులో ఇటీవలే రూ.10.50 కోట్లు సీఎం సూచనల మేరకు విడుదల చేసినా, వీటి చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. ఇక ఆర్అండ్ఆర్ కింద 112 కుటుంబాలను తరలించేందుకు రూ.12 కోట్లు అవసరం ఉంటుంది. ఇందులో రూ.4.50 కోట్లు విడుదల కాగా, వీటి చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ జూన్ నాటికి పూర్తి చేస్తే ఖరీఫ్‌లో కనీసంగా 14 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. ఇక సింగరాజుపల్లి రిజర్వాయర్‌ను 0.81 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తుండగా, కట్టపొడవు 3 కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో ఇంకా 200 మీటర్ల మేర కట్ట నిర్మాణం పూర్తయితే దీనిలోనూ 0.50 టీఎంసీ నీటిని నింపే అవకాశం ఉంటుంది. దీనికింద ఇప్పటికే కుడి, ఎడమ తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, స్థానిక పరీవాహకం నుంచే వచ్చే నీటితో దీనికింద ఉన్న 13 వేల ఎకరాల్లో కనీసంగా 5 నుంచి 6 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. ఇక్కడ పెండింగ్ బిల్లులు, మరో 71 ఎకరాల భూసేకరణకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం ఆదేశాలతో ఈ ఖరీఫ్‌లోనే దీనికింద ఆయకట్టుకు నీరిచ్చేలా చర్యలు మొదలయ్యాయి. -
తెరపైకి మళ్లీ ఫ్లోరైడ్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య మరో మారు ఎన్నికల ఎజెండాగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేదికగా ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యను జాతీయ స్థాయిలో చర్చకు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈ సమస్యపై స్పందించి, హామీ ఇచ్చేలా ఫ్లోరైడ్ బాధితుల పక్షాన పోరాడుతున్న ఉద్యమ కారులు వ్యూహం రచించారు. దీనిలో భాగంగానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీకి దిగాలని, నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే కోదాడకు చెందిన ఎన్నారై జలగం సుదీర్, ప్రకాశం జిల్లాకు చెందిన వడ్డే శ్రీనివాస్ వారణాసిలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు ఫ్లోరోసిస్ బాధితులు కూడా ప్రధానిపై పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలో సాగు, తాగునీటి కోసం, ఫ్లోరోసిస్ విముక్తి కోసం గతంలో జల సాధన సమితి ‘మాస్ నామినేషన్స్’ వ్యూహాన్ని అమలు చేసింది. 1996 ఎన్నికల్లో ఏకంగా 480 మంది పోటీలో నిలిచి దేశం దృష్టిని ఆకర్షించింది. ఇదే తరహాలో మోదీపై, రాహుల్ గాంధీపై పోటీ చేయాలని నిర్ణయించడం సంచలనం సృష్టించింది. దీంతో ఒక్క సారిగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతల్లో కలవరం మెదలైనట్లు తెలుస్తుంది. హామీ మరిచిన కేంద్రం ‘రీజినల్ ఫ్లోరోసిస్ మిటిగేషన్, రీసెర్చ్ సెంటర్ ’ను జిల్లాలో ఏర్పాటు చేస్తామని 2007–08లోనే నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో రెండు చోట్ల రెండు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఒకటి గుజరాత్లో, రెండోది దక్షిణాది రాష్ట్రాల కోటాలో నల్లగొండలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా 2014లో తెలంగా>ణ స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ చౌటుప్పల్‌లో 8 ఎకరాల భూమిని ఈ పరిశోధన స్థానం కోసం కేటాయించింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగా ఈ రీసెర్చ్ సెంటర్ కార్యరూపం దాల్చలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి నిరసనగానే ప్రధానిపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఉద్యమకారులు చెబుతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కాంగ్రెస్ హామీ జిల్లాలో సుమారు 2లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులు ఇటు నల్లగొండ, అటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఈ సమస్యను పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓట్లు అడగడం సాధ్యం కాని పని. ఈ కారణంగానే ఆయా పార్టీలు ఫ్లోరైడ్ బాధితులకు హామీలు ఇస్తున్నాయి. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఈ సమస్యపై స్పందించారు. తాము అధికారంలోకి వస్తే ఫ్లోరైడ్ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రక్షిత నీటిని అందివ్వక పోవడం వల్లే సమస్య తీరలేదని పేర్కొని, టీఆర్ఎస్ నాయకులకు పని కల్పించారు. కాంగ్రెస్ నిర్వాకం : జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖమంత్రి సుదీర్ఘ కాలం దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఫ్లోరైడ్ పీడ విరగడ కాలేదని విద్యాశాఖామంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో 2007లో ఇచ్చిన హామీని 2014లో అధికారం కోల్పోయే వరకు ఏడేళ్ల పాటు ఎందుకు అమలు చేయలేకపోయారో, రీసెర్చ్ సెంటర్ ఎందుకు నెలకొల్పలేక పోయారో తెలపాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 8 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని, ఆ తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ అయిదేళ్ల పాటు ఏం చేసిందని నిలదీశారు. సమస్య పరిష్కారానికి టీఆర్ఎస్కు మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు. కాగా మునుగోడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కాంగ్రెస్ తీరును తప్పు పట్టారు. జిల్లా నుంచి పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా జానా రెడ్డి పనిచేసిన సమయంలోనూ సమస్య పరిష్కారానికి మార్గం కనుగొనలేక పోయారన్నది టీఆర్ఎస్ ఆరోపణ. కృష్ణా నీటితో సమస్యకు చరమగీతం పాడేందుకు.. మిషన్ భగీరథను అమలు చేస్తున్నామని, తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఫ్లోరైడ్ సమస్య మరో మారు ఎజెండాగా మారి చర్చకు తెరలేపింది. -
పచ్చని పల్లెలపై.. ఫ్లోరైడ్ రక్కసి..
గొంతు తడిపే జలం..గరళంగా మారి ప్రాణాలు తీస్తోంది. ఎముకలను గుల్ల చేసి మనుషులను బతికున్న శవాలుగా మారుస్తోంది. ఫ్లోరైడ్ రక్కసి మహమ్మారి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు హరిస్తోంది. ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా..తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీరు దొరక్క జనం విషం తాగి వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. దీంతో మూడు పదుల వయసుకే ఆరు పదుల వయసులా వృద్ధులా తయారవుతున్నారు. ఫలితంగా పాడి పంటలు, పిల్లా పాపలతో కళకళలాడాల్సిన గ్రామాలు ఫ్లోరైడ్ బాధితులతో కళావిహీనంగా తయారయ్యాయి. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న వారి సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): మండల పరిధిలోని ధర్మవరం, రావిళ్లవారిపాలెం, వేమరం గ్రామాల్లో ఫ్లోరైడ్ రక్కసి పట్టిపీడిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలోనే 38 మందిని కిడ్నీ వ్యాధి కబళించింది. ఒక్క రావిళ్లవారిపాలెం గ్రామంలోనే 20 మంది కిడ్నీ వ్యాధికి బలైపోయారు. ధర్మవరం, రావిళ్లవారిపాలెం గ్రామాల్లో పదుల సంఖ్య కిడ్నీ వ్యాధి బాధితులు ఆస్పత్రులు, డయాలసిస్ కేంద్రాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గ్రామాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకునే ప్రజాప్రతినిధులు కరువయ్యారు. ఫ్లోరైడ్ నీరే దిక్కు.. ధర్మవరం గ్రామంలో 400 కుటుంబాలకు చెందిన 1160 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలో 40 చేతిపంపులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి తాగునీరు సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు చేతిపంపు నీటిని ఆశ్రయించి కిడ్నీ రోగాల బారిన పడుతున్నారు. ఆ నీరు అత్యంత ఫ్లోరిన్తో కూడుకోవడంతో గ్రామస్తులు కాళ్లు, కీళ్లు, వళ్లు నొప్పులతో మంచాల పాలవుతున్నారు. జిల్లాలోని కనిగిరి, పీసీపల్లి, మర్రిపూడి, పామూరు, పొదిలి తదితర మండలాలలో అత్యధికంగా ఫ్లోరిన్‌శాతం 5.2 పీపీఎం ఉందని, ఈ మహమ్మారితో మరణాలు సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పెదచెర్లోపల్లి మండలంలో బహిరంగ సమావేశం ఏర్పాటుచేసి కిడ్నీవ్యాధిగ్రస్తులను ఆప్యాయంగా పలకరించారు. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తాననడంతో రోగుల మొములో ఆనందం వెల్లువిరిసింది. జగన్మోహన్రెడ్డి కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం పెదచెర్లోపల్లిలో బహిరంగ సమావేశం ఏర్పాటుచేస్తున్న విషయం ముందే పసికట్టిన తెలుగుదేశం ప్రభుత్వం జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కబళించిన కిడ్నీ వ్యాధి ధర్మవరం గ్రామ వ్యూ మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన నారపరెడ్డి గంగులు,(4), బత్తుల గోవిందు(25),బారెడ్డి తిమ్మారెడ్డి(65), గోపిరెడ్డిసుబ్బారెడ్డి (75), మార్తాల ఓబుల్‌రెడ్డి(78), యర్రబల్లి ఓబుల్‌రెడ్డి(78), గురవమ్మ(68), కసిరెడ్డి చినమాల కొండయ్య(55), బారెడ్డి గోవిందమ్మ(65)లను కిడ్నీ వ్యాధి కబళించింది. అలాగే గ్రామానికి చెందిన యర్రబల్లిపాపులు, కొమ్ము నారయ్య, రాజవరపు బాల వెంకయ్య, కొమ్ము గురవమ్మ, బత్తుల పెద వెంకట సుబ్బయ్య, బత్తుల కాంతమ్మ, యర్రబల్లి శ్రీను, కసిరెడ్డి పెద మాలకొండయ్య, కసిరెడ్డి నారాయణలతో పాటు మరి కొంతమంది కిడ్నీ వ్యాధి సోకి తల్లడిల్లితున్నారు. ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. గ్రామంలో ఉన్న డీబోరు సైతం మూలనపడటంతో కుళాయిలు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో జిల్లా నీటియాజమాని సంస్థ వాటర్ షెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బబుల్స్ నీటినే కొనుగోలు చేసి తాగుతున్నారు. స్థోమత లేని వారు గ్రామంలో ప్రధాన ఆధారమైన చేతిపంపు నీటిని సేవించి మూలనపడుతున్నారు. రామతీర్ధం జలాలు మండలంలో 33 గ్రామాలకు సరఫరా జరుగుతోంది. చిమట నుంచి కానీ లేదా విజయలక్ష్మీపేట గ్రామం నుంచి గానీ రామతీర్థం నీరు ఇచ్చి ప్రాణాలు కాపాడాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామంలో కిడ్నీవ్యాధి సోకి ఇప్పటి వరకు 20 మంది చనిపోగా 8 మంది వ్యాధితో బాధపడుతున్నారు. చనిపోయిన వారిలో ముంతా వెంకటేశ్వర్లు, ముంతా నర్సమ్మ, బత్తుల యానాదులు, బత్తుల బ్రంహ్మయ్య, సొలసా నర్సమ్మ, బత్తుల నర్శింహా, బత్తుల పెద నర్సయ్య, పులగం అక్కమ్మ, సొలసా బ్రహ్మయ్య, రత్తమ్మ, బొట్లగుంట రామయ్య, పాలెపు పద్మ తోపాటూ మరో 8 మంది ఉన్నారు. గ్రామానికి చెందిన పాదర్తి సుబ్బారావు ఒంగోలులో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. సీపీడబ్ల్యూస్కీమ్ నీరు సరఫరాకాక 3 నెలలు గడుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. దీంతో ఫ్లోరిన్ నీరు సేవించడం వల్లా బత్తుల నర్సింహా, ముంతా మాలకొండయ్య, ముంతా టేకులమ్మ, సాలసా నాగేశ్వరరావు, పాలెపు కోటయ్య, పాదర్తి సుబ్బారావు, పులగం బ్రహ్మయ్యలతో పాటు మరికొంత మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మందులు వాడుకుంటున్నారు. పనిచేయని జంగాలపల్లి సీపీడబ్ల్యూస్కీమ్ దర్మవరం, రావిళ్లవారిపాలెం గ్రామాల ప్రజలకు దాహార్తి తీర్చేందుకు పొన్నలూరు మండలం పాలేటివాగులో ఏర్పాటుచేసిన జంగాలపల్లి సీపీడబ్ల్యూ స్కీం వాగులో నీరు లేక ఆయా గ్రామాలకు సక్రమంగా సరఫరా కాడంలేదని లేదు. ఈ స్కీమ్ ద్వారా మండలంలో 12 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. పాలేటివాగునీరు సైతం ఫ్లోరిన్తో కూడుకున్నాయంటున్నారు. వర్షాలు లేక పాలేరువాగు సైతం వట్టిపోయి బావిలో నీరు అడుగంటాయని, ఆ నీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్ధితి ఏర్పడిదని గ్రామస్తులు అంటున్నారు. మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామానికి దాదాపు 3 నెలలుగా తాగునీరు సరఫరా చేయడంలేదని వారు విమర్శిస్తున్నారు. రామతీర్థం నీరు చిమట నుంచి లేదా విజయలక్ష్మీపేట నుంచి తాగునీటి పైపులు ఏర్పాటుచేసి నీరు విడుదల చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఎమ్మెల్యే హామీ..ఒట్టి మాటలే.. మండలంలోని ధర్మవరం గ్రామస్తులకు రామతీర్ధం నీరు అందించి ఫ్లోరైడ్‌రహిత గ్రామంగా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే స్వామి 2017 జన్మభూమి సభలో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులకు ఫ్లోరైడ్ కష్టాలు.. మండలంలోని ధర్మవరం గ్రామంలో ఒక పక్క పెద్దలను ఫ్లోరైడ్ కబళించి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మరో పక్క పాఠశాల విద్యార్థులపై ఫ్లోరైడ్ పంజా విసరనుంది. గ్రామానికి చెందిన విద్యార్థులు బత్తుల మల్లేశ్వరి, గంగిరెడ్డి శిరీషా, నేలపాటి అభిషేక్, గోపిరెడ్డి చక్రవర్తులకు పళ్లు గారపట్టింది. తమ బతుకులు ఎలాగూ నాశనమయ్యాయి, పిల్లల భవిష్యత్ అయినా కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కర్రల సాయం లేకుంటే నడవలేను గ్రామంలో చేతిపంపు నీరు సేవించడంతో నొప్పులు మొదలైయ్యాయి. క్రమేపి నాకాళ్లు వంకర తిరిగాయి. 6 ఏళ్ల నుంచి కర్ర లేకుండా నడవలేకపోతున్నాను. మందులు కొనుక్కునే స్థోమత లేదు. రామతీర్థం నీరు అందించి మా పిల్లల భవిష్యత్ కాపాడండి. - యర్రబల్లి పాపులు జగన్మోహన్రెడ్డి భరోసాతో ఆశలు చిగురించాయి కిడ్నీవ్యాధులతో మా గ్రామంలో 20 మంది చనిపోయారు. కొంత మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని పెదచెర్లోపల్లి జగన్మోహన్రెడ్డి òచేపట్టిన బహిరంగ సభకు కిడ్నీ బాధితులను తీసుకెళ్లాం. చలించిన జగన్ సార్ కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10వేలు పింఛన్ రూపంలో ఇస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ బాధితులకు ఆయన భరోసా కల్పించారు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం కిడ్నీవ్యాధిగ్రస్తులను పట్టించుకున్న దాఖలాలు లేవు. - బొల్లినేని నాగేశ్వరరావు, రావిళ్లవారిపాలెం -
ఫ్లోరైడ్ పీడ వదిలించండి
► సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి ► ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయాలి ► జిల్లాలో శాశ్వత పరిశోధన కేంద్రం ఏర్పాటు అవసరం ► ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌ను కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు అర్బన్ : జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు తాను ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్‌ని కలిసి విన్నవించినట్టు ఎంపీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీని కలిసి జిల్లాలోని ఫోరైడ్, కిడ్నీ బాధితుల సమస్యలను వివరించి, వీటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రధాని సూచన మేరకు తాను బుధవారం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్‌ను కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఫోరైడ్ బాధితుల ఫొటోలను చూపడంతో పాటు, ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో ఎక్కడ ఎంతమేర ఫోరైడ్ తీవ్రత ఉందనే విషయాన్ని ఆమెకి వివరించినట్లు వైవీ తెలిపారు. గడిచిన రెండేళ్లలో కిడ్నీ సమస్యలతో జిల్లాలో 424 మంది చనిపోయిన విషయాన్ని తెలియపరిచానన్నారు. సమస్యకు మూల కారణాలను తెలుసుకునేందుకు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేయించాలని కోరినట్టు వివరించారు. సమస్య తీవ్రతని బట్టి జిల్లాలో శాశ్వత పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే కొంత ఊరట ఉంటుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కంటే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని వివరించానని పేర్కొన్నారు. వివరాలు తెలుసుకున్న సౌమ్య స్వామినాథన్ ఈ నెల 28 నుంచి కేంద్ర బృందం జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తప్పక పర్యటిస్తుందని, సమస్యకు కారణాలను తెలుసుకొని శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు తెలియచేస్తామని చెప్పినట్లు ఎంపీ వైవీ పేర్కొన్నారు.