సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య మరో మారు ఎన్నికల ఎజెండాగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేదికగా ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యను జాతీయ స్థాయిలో చర్చకు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఈ సమస్యపై స్పందించి, హామీ ఇచ్చేలా ఫ్లోరైడ్ బాధితుల పక్షాన పోరాడుతున్న ఉద్యమ కారులు వ్యూహం రచించారు. దీనిలో భాగంగానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీకి దిగాలని, నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే కోదాడకు చెందిన ఎన్నారై జలగం సుదీర్, ప్రకాశం జిల్లాకు చెందిన వడ్డే శ్రీనివాస్ వారణాసిలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
వీరిద్దరితో పాటు మరో ఇద్దరు ఫ్లోరోసిస్ బాధితులు కూడా ప్రధానిపై పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలో సాగు, తాగునీటి కోసం, ఫ్లోరోసిస్ విముక్తి కోసం గతంలో జల సాధన సమితి ‘మాస్ నామినేషన్స్’ వ్యూహాన్ని అమలు చేసింది. 1996 ఎన్నికల్లో ఏకంగా 480 మంది పోటీలో నిలిచి దేశం దృష్టిని ఆకర్షించింది. ఇదే తరహాలో మోదీపై, రాహుల్ గాంధీపై పోటీ చేయాలని నిర్ణయించడం సంచలనం సృష్టించింది. దీంతో ఒక్క సారిగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నేతల్లో కలవరం మెదలైనట్లు తెలుస్తుంది.
హామీ మరిచిన కేంద్రం
‘రీజినల్ ఫ్లోరోసిస్ మిటిగేషన్, రీసెర్చ్ సెంటర్ ’ను జిల్లాలో ఏర్పాటు చేస్తామని 2007–08లోనే నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో రెండు చోట్ల రెండు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఒకటి గుజరాత్‌లో, రెండోది దక్షిణాది రాష్ట్రాల కోటాలో నల్లగొండలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా 2014లో తెలంగా>ణ స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ చౌటుప్పల్‌లో 8 ఎకరాల భూమిని ఈ పరిశోధన స్థానం కోసం కేటాయించింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగా ఈ రీసెర్చ్ సెంటర్ కార్యరూపం దాల్చలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి నిరసనగానే ప్రధానిపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఉద్యమకారులు చెబుతున్నారు.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కాంగ్రెస్ హామీ
జిల్లాలో సుమారు 2లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులు ఇటు నల్లగొండ, అటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఈ సమస్యను పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓట్లు అడగడం సాధ్యం కాని పని. ఈ కారణంగానే ఆయా పార్టీలు ఫ్లోరైడ్ బాధితులకు హామీలు ఇస్తున్నాయి. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఈ సమస్యపై స్పందించారు. తాము అధికారంలోకి వస్తే ఫ్లోరైడ్ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రక్షిత నీటిని అందివ్వక పోవడం వల్లే సమస్య తీరలేదని పేర్కొని, టీఆర్‌ఎస్ నాయకులకు పని కల్పించారు.
కాంగ్రెస్ నిర్వాకం : జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖమంత్రి
సుదీర్ఘ కాలం దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఫ్లోరైడ్ పీడ విరగడ కాలేదని విద్యాశాఖామంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో 2007లో ఇచ్చిన హామీని 2014లో అధికారం కోల్పోయే వరకు ఏడేళ్ల పాటు ఎందుకు అమలు చేయలేకపోయారో, రీసెర్చ్ సెంటర్ ఎందుకు నెలకొల్పలేక పోయారో తెలపాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 8 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని, ఆ తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ అయిదేళ్ల పాటు ఏం చేసిందని నిలదీశారు. సమస్య పరిష్కారానికి టీఆర్‌ఎస్‌కు మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు.
కాగా మునుగోడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన కాంగ్రెస్ తీరును తప్పు పట్టారు. జిల్లా నుంచి పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా జానా రెడ్డి పనిచేసిన సమయంలోనూ సమస్య పరిష్కారానికి మార్గం కనుగొనలేక పోయారన్నది టీఆర్‌ఎస్ ఆరోపణ. కృష్ణా నీటితో సమస్యకు చరమగీతం పాడేందుకు.. మిషన్ భగీరథను అమలు చేస్తున్నామని, తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఫ్లోరైడ్ సమస్య మరో మారు ఎజెండాగా మారి చర్చకు తెరలేపింది.
Comments
Please login to add a commentAdd a comment