పచ్చని పల్లెలపై.. ఫ్లోరైడ్‌ రక్కసి.. | Florid Problem Not Solved In Marripudi | Sakshi
Sakshi News home page

పచ్చని పల్లెలపై.. ఫ్లోరైడ్‌ రక్కసి..

Published Sun, Mar 24 2019 12:58 PM | Last Updated on Sun, Mar 24 2019 12:58 PM

Florid Problem Not Solved In Marripudi - Sakshi

కిడ్నీవ్యాధితో బాధపడుతున్న గ్రామస్తులు

గొంతు తడిపే జలం..గరళంగా మారి ప్రాణాలు తీస్తోంది. ఎముకలను గుల్ల చేసి మనుషులను బతికున్న శవాలుగా మారుస్తోంది. ఫ్లోరైడ్‌ రక్కసి మహమ్మారి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు హరిస్తోంది. ఫ్లోరైడ్‌ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా..తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీరు దొరక్క జనం విషం తాగి వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. దీంతో మూడు పదుల వయసుకే ఆరు పదుల వయసులా వృద్ధులా తయారవుతున్నారు. ఫలితంగా పాడి పంటలు, పిల్లా పాపలతో కళకళలాడాల్సిన గ్రామాలు ఫ్లోరైడ్‌ బాధితులతో కళావిహీనంగా తయారయ్యాయి. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఫ్లోరైడ్‌ సమస్యతో బాధపడుతున్న వారి సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి.

సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): మండల పరిధిలోని ధర్మవరం, రావిళ్లవారిపాలెం, వేమరం గ్రామాల్లో ఫ్లోరైడ్‌ రక్కసి పట్టిపీడిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలోనే 38 మందిని కిడ్నీ వ్యాధి కబళించింది. ఒక్క రావిళ్లవారిపాలెం గ్రామంలోనే 20 మంది కిడ్నీ వ్యాధికి బలైపోయారు. ధర్మవరం, రావిళ్లవారిపాలెం గ్రామాల్లో పదుల సంఖ్య కిడ్నీ వ్యాధి బాధితులు ఆస్పత్రులు, డయాలసిస్‌ కేంద్రాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గ్రామాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకునే ప్రజాప్రతినిధులు కరువయ్యారు.

ఫ్లోరైడ్‌ నీరే దిక్కు..
ధర్మవరం గ్రామంలో 400 కుటుంబాలకు చెందిన 1160 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలో 40 చేతిపంపులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి తాగునీరు సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు చేతిపంపు నీటిని ఆశ్రయించి కిడ్నీ రోగాల బారిన పడుతున్నారు. ఆ నీరు అత్యంత ఫ్లోరిన్‌తో కూడుకోవడంతో గ్రామస్తులు కాళ్లు, కీళ్లు, వళ్లు నొప్పులతో మంచాల పాలవుతున్నారు. జిల్లాలోని కనిగిరి, పీసీపల్లి, మర్రిపూడి, పామూరు, పొదిలి తదితర మండలాలలో అత్యధికంగా ఫ్లోరిన్‌శాతం 5.2 పీపీఎం ఉందని, ఈ మహమ్మారితో మరణాలు సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెదచెర్లోపల్లి మండలంలో బహిరంగ సమావేశం ఏర్పాటుచేసి కిడ్నీవ్యాధిగ్రస్తులను ఆప్యాయంగా పలకరించారు. డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాననడంతో రోగుల మొములో ఆనందం వెల్లువిరిసింది. జగన్‌మోహన్‌రెడ్డి కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం పెదచెర్లోపల్లిలో బహిరంగ సమావేశం ఏర్పాటుచేస్తున్న విషయం ముందే పసికట్టిన తెలుగుదేశం ప్రభుత్వం జిల్లాలో మూడు డయాలసిస్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కబళించిన కిడ్నీ వ్యాధి

ధర్మవరం గ్రామ వ్యూ

మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన నారపరెడ్డి గంగులు,(4), బత్తుల గోవిందు(25),బారెడ్డి తిమ్మారెడ్డి(65), గోపిరెడ్డిసుబ్బారెడ్డి (75), మార్తాల ఓబుల్‌రెడ్డి(78), యర్రబల్లి ఓబుల్‌రెడ్డి(78), గురవమ్మ(68), కసిరెడ్డి చినమాల కొండయ్య(55), బారెడ్డి గోవిందమ్మ(65)లను కిడ్నీ వ్యాధి కబళించింది. అలాగే గ్రామానికి చెందిన యర్రబల్లిపాపులు, కొమ్ము నారయ్య, రాజవరపు బాల వెంకయ్య, కొమ్ము గురవమ్మ, బత్తుల పెద వెంకట సుబ్బయ్య, బత్తుల కాంతమ్మ, యర్రబల్లి శ్రీను, కసిరెడ్డి పెద మాలకొండయ్య, కసిరెడ్డి నారాయణలతో పాటు మరి కొంతమంది కిడ్నీ వ్యాధి సోకి తల్లడిల్లితున్నారు. ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

గ్రామంలో ఉన్న డీబోరు సైతం మూలనపడటంతో కుళాయిలు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో జిల్లా నీటియాజమాని సంస్థ వాటర్‌ షెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బబుల్స్‌ నీటినే కొనుగోలు చేసి తాగుతున్నారు. స్థోమత లేని వారు గ్రామంలో ప్రధాన ఆధారమైన చేతిపంపు నీటిని సేవించి మూలనపడుతున్నారు. రామతీర్ధం జలాలు మండలంలో 33 గ్రామాలకు సరఫరా జరుగుతోంది. చిమట నుంచి కానీ లేదా విజయలక్ష్మీపేట గ్రామం నుంచి గానీ రామతీర్థం నీరు ఇచ్చి ప్రాణాలు కాపాడాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామంలో కిడ్నీవ్యాధి సోకి ఇప్పటి వరకు 20 మంది చనిపోగా 8 మంది వ్యాధితో బాధపడుతున్నారు.

చనిపోయిన వారిలో ముంతా వెంకటేశ్వర్లు, ముంతా నర్సమ్మ, బత్తుల యానాదులు, బత్తుల బ్రంహ్మయ్య, సొలసా నర్సమ్మ, బత్తుల నర్శింహా, బత్తుల పెద నర్సయ్య, పులగం అక్కమ్మ,  సొలసా బ్రహ్మయ్య, రత్తమ్మ, బొట్లగుంట రామయ్య, పాలెపు పద్మ తోపాటూ మరో 8 మంది ఉన్నారు. గ్రామానికి చెందిన పాదర్తి సుబ్బారావు ఒంగోలులో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. సీపీడబ్ల్యూస్కీమ్‌ నీరు సరఫరాకాక 3 నెలలు గడుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. దీంతో ఫ్లోరిన్‌ నీరు సేవించడం వల్లా బత్తుల నర్సింహా, ముంతా మాలకొండయ్య, ముంతా టేకులమ్మ, సాలసా నాగేశ్వరరావు, పాలెపు కోటయ్య, పాదర్తి సుబ్బారావు, పులగం బ్రహ్మయ్యలతో పాటు మరికొంత మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మందులు వాడుకుంటున్నారు.

పనిచేయని జంగాలపల్లి సీపీడబ్ల్యూస్కీమ్‌
దర్మవరం, రావిళ్లవారిపాలెం గ్రామాల ప్రజలకు దాహార్తి తీర్చేందుకు పొన్నలూరు మండలం పాలేటివాగులో ఏర్పాటుచేసిన జంగాలపల్లి సీపీడబ్ల్యూ స్కీం వాగులో నీరు లేక ఆయా గ్రామాలకు సక్రమంగా సరఫరా కాడంలేదని లేదు. ఈ స్కీమ్‌ ద్వారా మండలంలో 12 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. పాలేటివాగునీరు సైతం ఫ్లోరిన్‌తో కూడుకున్నాయంటున్నారు. వర్షాలు లేక పాలేరువాగు సైతం వట్టిపోయి బావిలో నీరు అడుగంటాయని, ఆ నీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్ధితి ఏర్పడిదని గ్రామస్తులు అంటున్నారు.  మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామానికి దాదాపు 3 నెలలుగా తాగునీరు సరఫరా చేయడంలేదని వారు విమర్శిస్తున్నారు. రామతీర్థం నీరు చిమట నుంచి లేదా విజయలక్ష్మీపేట నుంచి  తాగునీటి పైపులు ఏర్పాటుచేసి నీరు విడుదల చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.

ఎమ్మెల్యే హామీ..ఒట్టి మాటలే..
మండలంలోని ధర్మవరం గ్రామస్తులకు రామతీర్ధం నీరు అందించి ఫ్లోరైడ్‌రహిత గ్రామంగా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే స్వామి 2017 జన్మభూమి సభలో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదు.

విద్యార్థులకు ఫ్లోరైడ్‌ కష్టాలు..
మండలంలోని ధర్మవరం గ్రామంలో ఒక పక్క పెద్దలను ఫ్లోరైడ్‌ కబళించి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మరో పక్క పాఠశాల విద్యార్థులపై ఫ్లోరైడ్‌ పంజా విసరనుంది. గ్రామానికి చెందిన విద్యార్థులు బత్తుల మల్లేశ్వరి, గంగిరెడ్డి శిరీషా, నేలపాటి అభిషేక్, గోపిరెడ్డి చక్రవర్తులకు పళ్లు గారపట్టింది. తమ బతుకులు ఎలాగూ నాశనమయ్యాయి, పిల్లల భవిష్యత్‌ అయినా కాపాడాలని  తల్లిదండ్రులు కోరుతున్నారు.

కర్రల సాయం లేకుంటే నడవలేను 
గ్రామంలో చేతిపంపు నీరు సేవించడంతో నొప్పులు మొదలైయ్యాయి. క్రమేపి నాకాళ్లు వంకర తిరిగాయి. 6 ఏళ్ల నుంచి కర్ర లేకుండా నడవలేకపోతున్నాను. మందులు కొనుక్కునే స్థోమత లేదు. రామతీర్థం నీరు అందించి మా పిల్లల భవిష్యత్‌ కాపాడండి.
- యర్రబల్లి పాపులు

జగన్‌మోహన్‌రెడ్డి భరోసాతో ఆశలు చిగురించాయి 
కిడ్నీవ్యాధులతో మా గ్రామంలో 20 మంది చనిపోయారు. కొంత మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని పెదచెర్లోపల్లి జగన్‌మోహన్‌రెడ్డి òచేపట్టిన బహిరంగ సభకు కిడ్నీ బాధితులను తీసుకెళ్లాం. చలించిన జగన్‌ సార్‌ కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10వేలు పింఛన్‌ రూపంలో ఇస్తామని  హామీ ఇచ్చారు. కిడ్నీ బాధితులకు ఆయన భరోసా కల్పించారు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం కిడ్నీవ్యాధిగ్రస్తులను పట్టించుకున్న దాఖలాలు లేవు.
- బొల్లినేని నాగేశ్వరరావు, రావిళ్లవారిపాలెం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

చేతిపంపు నీరు కొట్టుకుంటున్న మహిళ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement