marripudi
-
అక్క కళ్లలో ఆనందం కోసం బావను హత్య చేసిన బావమరిది
సాక్షి, ప్రకాశం(మర్రిపూడి): అక్కను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని బావను అతికిరాతకంగా బండరాయితో మోది బావమరిది హత్యచేసిన సంఘటన మండలంలోని గంగపాలెంచెరువు అలుగు సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఈర్ల పెదకోటేష్, మంగమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా, కుమార్తె అనూషాను ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టకు చెందిన మర్రిబోయిన వెంకటరమణ కుమారుడు అంకమ్మరావు (26)కు ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి మూడేళ్ల సంతోష్, ఒకటిన్నరేళ్ల రాజ్‌కుమార్ ఉన్నారు. అంకమరావు మద్యానికి బానిస కావడంతో పెళ్లయిన మూడేళ్లకే భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. పోలీస్ స్టేషన్లో పంచాయతీలు జరిగినట్లు అతని తండ్రి వెంకటరమణ తెలిపారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భార్యాభర్తలిద్దరూ అంకమరావు అత్తగారి ఇళ్లయిన కూచిపూడిలో కాపురం పెట్టారు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ పూటుగా నిత్యం మద్యం సేవించి చేతులు కోసుకోవడం, తలుపులు పగలకొట్టడం లాంటి పనులతో గొడవలు పెట్టుకుంటున్నాడని మృతుని అత్త మంగమ్మ తెలిపింది. చదవండి: (పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు.. ఏకంగా 21 మందికి పైగా..) ఈ నేపథ్యంలో 10 రోజులుగా అనూషా అతనితో కాకుండా మరో మేస్త్రీ వద్దకు బేల్దారి పనులకు పోతుండటంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న వృద్ధుడు ఈర్ల మూగయ్య హైదరాబాద్‌లో బేల్దారి పనిచేసుకుంటున్న మనుమడు ఈర్ల వినోద్‌కు సమాచారం ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం వినోద్ కూచిపూడి వచ్చాడు. ఈ నెల 23న రాత్రి తన బావ అంకమరావును బావమరిది అయిన వినోద్ ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లాడు. గంగపాలెం చెరువు అలుగుసమీపంలో ఇద్దరూ పూటుగా మద్యం సేవించారు. ఆ మత్తులో అంకమరావును బండరాయితో తలపై మోది అతి కిరాతకంగా వినోద్ హత్య చేశాడు. సమాచారం అందుకున్న కొండపి సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంకమ్మరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రభుత్వ భూములపై పచ్చ నేతల పంజా..!
సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): మండలంలోని ప్రభుత్వ భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారు. తాడితోపు, డొంక, కుంట పొరంబోకు భూములను సైతం వదలకుండా యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. మండలంలో దాదాపు రెండు వేల ఎకరాలు పశువులమేత పోరంబోకు భూములు ఉన్నాయి. టీడీపీకి చెందిన కొందరు స్వార్థపరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించుకుంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయం అధికారులకు తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. అడిగేదెవరు..ఆక్రమించేద్దాం.. మండలంలోని కూచిపూడి గ్రామానికి పడమర వైపున సర్వే నంబర్ 637–1లో 381.33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత కొన్నేళ్లుగా మండలంలోని చెంచిరెడ్డిపల్లి, తిప్పలదేవిపల్లి, అంకేపల్లి, మర్రిపూడి, వైకుంఠాపురం, గంగపాలెం తదితర గ్రామాలకు చెందిన పశుపోషకులు గేదెలు, మేకలు, గొర్రెలు, ఆవులను మేపుకుంటున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్ల కన్ను కొండప్రాంతంలో ఉన్న ప్రభుత్వభూమిపై పడింది. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా రాత్రికి రాత్రి ప్రాక్లైన్ సహాయంతో చెట్లు తొలగించి దాదాపు 180 ఎకరాల భూమిని దున్నేసి ఆక్రమించుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. ర్అలాగే మండలంలో 2500 ఎకరాలకు పైగా తాడితోపు, వాగు, కుంట, దోవ పోరంబోకు భూములు ఉన్నాయి. కొందరు స్వార్ధపరులు ఎక్కడ పడితే అక్కడకు ఆక్రమించుకుంటూ పోతున్నారు. దీంతో పంట పొలాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు, పశుపోషకులు ఆందోళనకు గురౌతున్నారు. టీడీపీ నేతల కబంధ హస్తాల్లో.. మర్రిపూడి మండలంలో గుండ్లసముద్రం పంచాయతీ ఎస్టీ రాజుపాలెం, మర్రిపూడి పంచాయతీ గంగపాలెం, వేమవరం రెవెన్యూ పరిధి గ్రామాల్లో, గార్లపేట రెవెన్యూ పరిధిలోని నర్సాపురం, కూచిపూడి పంచాయతీ తిప్పలదేవిపల్లి గ్రామాల్లో అత్యధికంగా పోరంబోకు భూములు ఉండటంతో ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఎక్కడపడితే అక్కడికి భూములు దున్నుకుని యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. మండలంలోని తిప్పలదేవిపల్లి రెవెన్యూ పరిధిలో దాదాపు 600 ఎకరాలు, గంగపాలెం గ్రామానికి పడమర కొండవైపున దాదాపు 105 ఎకరాలు పోరంబోకు భూమి, ఎస్టీ రాజుపాలెంలో 300 ఎకరాలు పశువుమేత పోరంబోకు భూములు ఉన్నాయి. ఈ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకొని దున్నుకొని సాగు చేయడంతో ఆయా గ్రామాల్లో ఉన్న గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మేపుకునేందుకు గడ్డి లేక ఇబ్బందులు పడుతున్నాయి. కనీసం ఈ పొలాల్లోకి వెళ్లేందుకు మార్గంలేక పోషకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఎస్టీ రాజుపాలెం గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మండలంలోని గంగపాలెం పశుపోషకులు తమ పశువులు మేపు కోసం కొండ ప్రాంతానికి వెళ్లే మార్గంలేక ఇబ్బంది పడుతున్నామని, న్యాయం చేయాలని రహదారికి అడ్డుగా కంచె వేసి ఆర్అండ్బీ రహదారిపై పశువులతో ధర్నాకు సైతం దిగారు. ఇష్టానుసారంగా ఆక్రమించుకున్నారు టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా పోరంబోకు భూములను దోచుకుంటున్నారు. ఎక్కడపడితే అక్కడ కట్టలుపోసుకోవడం, రాత్రికి రాత్రి చెట్లు తొలగించడం, చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. - డి.మాధవరెడ్డి పశువులు తిరగడానికి కూడా స్థలంలేదు పశువులమేత, కుంటు, దారి, తాడితోపు తదితర పోరంబోకు భూములు ఆక్రమణలు జరుగుతున్న నేపథ్యంలో మూగజీవాలను పొలాల్లో తిప్పే స్థలంలేక పశుపోషకులు అల్లాడిపోతున్నారు. ఆక్రమణ లోఉన్న పోరంబోకు భూములకు విముక్తి కల్పించాలి. - పి.శ్రీనివాసరెడ్డి సెంటుభూమి కూడా పంపిణీ చేయలేదు టీడీపీ ప్రభుత్వంలో దళితులకు సెంటుభూమి కూడా పంపిణీ చేయలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 7 విడతల్లో దాదాపు 500 ఎకరాల భూమిని దళితులకు పంపిణీ చేశారు. భూ పంపిణీ చేయకపోగా ఉన్న భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. - కొండ్రు శ్యాంబాబు, ఎమ్మార్పీస్ మండల అధ్యక్షుడు -
పచ్చని పల్లెలపై.. ఫ్లోరైడ్ రక్కసి..
గొంతు తడిపే జలం..గరళంగా మారి ప్రాణాలు తీస్తోంది. ఎముకలను గుల్ల చేసి మనుషులను బతికున్న శవాలుగా మారుస్తోంది. ఫ్లోరైడ్ రక్కసి మహమ్మారి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు హరిస్తోంది. ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా..తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీరు దొరక్క జనం విషం తాగి వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. దీంతో మూడు పదుల వయసుకే ఆరు పదుల వయసులా వృద్ధులా తయారవుతున్నారు. ఫలితంగా పాడి పంటలు, పిల్లా పాపలతో కళకళలాడాల్సిన గ్రామాలు ఫ్లోరైడ్ బాధితులతో కళావిహీనంగా తయారయ్యాయి. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న వారి సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): మండల పరిధిలోని ధర్మవరం, రావిళ్లవారిపాలెం, వేమరం గ్రామాల్లో ఫ్లోరైడ్ రక్కసి పట్టిపీడిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలోనే 38 మందిని కిడ్నీ వ్యాధి కబళించింది. ఒక్క రావిళ్లవారిపాలెం గ్రామంలోనే 20 మంది కిడ్నీ వ్యాధికి బలైపోయారు. ధర్మవరం, రావిళ్లవారిపాలెం గ్రామాల్లో పదుల సంఖ్య కిడ్నీ వ్యాధి బాధితులు ఆస్పత్రులు, డయాలసిస్ కేంద్రాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గ్రామాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకునే ప్రజాప్రతినిధులు కరువయ్యారు. ఫ్లోరైడ్ నీరే దిక్కు.. ధర్మవరం గ్రామంలో 400 కుటుంబాలకు చెందిన 1160 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలో 40 చేతిపంపులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి తాగునీరు సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు చేతిపంపు నీటిని ఆశ్రయించి కిడ్నీ రోగాల బారిన పడుతున్నారు. ఆ నీరు అత్యంత ఫ్లోరిన్తో కూడుకోవడంతో గ్రామస్తులు కాళ్లు, కీళ్లు, వళ్లు నొప్పులతో మంచాల పాలవుతున్నారు. జిల్లాలోని కనిగిరి, పీసీపల్లి, మర్రిపూడి, పామూరు, పొదిలి తదితర మండలాలలో అత్యధికంగా ఫ్లోరిన్‌శాతం 5.2 పీపీఎం ఉందని, ఈ మహమ్మారితో మరణాలు సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పెదచెర్లోపల్లి మండలంలో బహిరంగ సమావేశం ఏర్పాటుచేసి కిడ్నీవ్యాధిగ్రస్తులను ఆప్యాయంగా పలకరించారు. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తాననడంతో రోగుల మొములో ఆనందం వెల్లువిరిసింది. జగన్మోహన్రెడ్డి కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం పెదచెర్లోపల్లిలో బహిరంగ సమావేశం ఏర్పాటుచేస్తున్న విషయం ముందే పసికట్టిన తెలుగుదేశం ప్రభుత్వం జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కబళించిన కిడ్నీ వ్యాధి ధర్మవరం గ్రామ వ్యూ మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన నారపరెడ్డి గంగులు,(4), బత్తుల గోవిందు(25),బారెడ్డి తిమ్మారెడ్డి(65), గోపిరెడ్డిసుబ్బారెడ్డి (75), మార్తాల ఓబుల్‌రెడ్డి(78), యర్రబల్లి ఓబుల్‌రెడ్డి(78), గురవమ్మ(68), కసిరెడ్డి చినమాల కొండయ్య(55), బారెడ్డి గోవిందమ్మ(65)లను కిడ్నీ వ్యాధి కబళించింది. అలాగే గ్రామానికి చెందిన యర్రబల్లిపాపులు, కొమ్ము నారయ్య, రాజవరపు బాల వెంకయ్య, కొమ్ము గురవమ్మ, బత్తుల పెద వెంకట సుబ్బయ్య, బత్తుల కాంతమ్మ, యర్రబల్లి శ్రీను, కసిరెడ్డి పెద మాలకొండయ్య, కసిరెడ్డి నారాయణలతో పాటు మరి కొంతమంది కిడ్నీ వ్యాధి సోకి తల్లడిల్లితున్నారు. ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. గ్రామంలో ఉన్న డీబోరు సైతం మూలనపడటంతో కుళాయిలు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో జిల్లా నీటియాజమాని సంస్థ వాటర్ షెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బబుల్స్ నీటినే కొనుగోలు చేసి తాగుతున్నారు. స్థోమత లేని వారు గ్రామంలో ప్రధాన ఆధారమైన చేతిపంపు నీటిని సేవించి మూలనపడుతున్నారు. రామతీర్ధం జలాలు మండలంలో 33 గ్రామాలకు సరఫరా జరుగుతోంది. చిమట నుంచి కానీ లేదా విజయలక్ష్మీపేట గ్రామం నుంచి గానీ రామతీర్థం నీరు ఇచ్చి ప్రాణాలు కాపాడాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామంలో కిడ్నీవ్యాధి సోకి ఇప్పటి వరకు 20 మంది చనిపోగా 8 మంది వ్యాధితో బాధపడుతున్నారు. చనిపోయిన వారిలో ముంతా వెంకటేశ్వర్లు, ముంతా నర్సమ్మ, బత్తుల యానాదులు, బత్తుల బ్రంహ్మయ్య, సొలసా నర్సమ్మ, బత్తుల నర్శింహా, బత్తుల పెద నర్సయ్య, పులగం అక్కమ్మ, సొలసా బ్రహ్మయ్య, రత్తమ్మ, బొట్లగుంట రామయ్య, పాలెపు పద్మ తోపాటూ మరో 8 మంది ఉన్నారు. గ్రామానికి చెందిన పాదర్తి సుబ్బారావు ఒంగోలులో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. సీపీడబ్ల్యూస్కీమ్ నీరు సరఫరాకాక 3 నెలలు గడుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. దీంతో ఫ్లోరిన్ నీరు సేవించడం వల్లా బత్తుల నర్సింహా, ముంతా మాలకొండయ్య, ముంతా టేకులమ్మ, సాలసా నాగేశ్వరరావు, పాలెపు కోటయ్య, పాదర్తి సుబ్బారావు, పులగం బ్రహ్మయ్యలతో పాటు మరికొంత మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మందులు వాడుకుంటున్నారు. పనిచేయని జంగాలపల్లి సీపీడబ్ల్యూస్కీమ్ దర్మవరం, రావిళ్లవారిపాలెం గ్రామాల ప్రజలకు దాహార్తి తీర్చేందుకు పొన్నలూరు మండలం పాలేటివాగులో ఏర్పాటుచేసిన జంగాలపల్లి సీపీడబ్ల్యూ స్కీం వాగులో నీరు లేక ఆయా గ్రామాలకు సక్రమంగా సరఫరా కాడంలేదని లేదు. ఈ స్కీమ్ ద్వారా మండలంలో 12 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. పాలేటివాగునీరు సైతం ఫ్లోరిన్తో కూడుకున్నాయంటున్నారు. వర్షాలు లేక పాలేరువాగు సైతం వట్టిపోయి బావిలో నీరు అడుగంటాయని, ఆ నీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్ధితి ఏర్పడిదని గ్రామస్తులు అంటున్నారు. మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామానికి దాదాపు 3 నెలలుగా తాగునీరు సరఫరా చేయడంలేదని వారు విమర్శిస్తున్నారు. రామతీర్థం నీరు చిమట నుంచి లేదా విజయలక్ష్మీపేట నుంచి తాగునీటి పైపులు ఏర్పాటుచేసి నీరు విడుదల చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఎమ్మెల్యే హామీ..ఒట్టి మాటలే.. మండలంలోని ధర్మవరం గ్రామస్తులకు రామతీర్ధం నీరు అందించి ఫ్లోరైడ్‌రహిత గ్రామంగా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే స్వామి 2017 జన్మభూమి సభలో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులకు ఫ్లోరైడ్ కష్టాలు.. మండలంలోని ధర్మవరం గ్రామంలో ఒక పక్క పెద్దలను ఫ్లోరైడ్ కబళించి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మరో పక్క పాఠశాల విద్యార్థులపై ఫ్లోరైడ్ పంజా విసరనుంది. గ్రామానికి చెందిన విద్యార్థులు బత్తుల మల్లేశ్వరి, గంగిరెడ్డి శిరీషా, నేలపాటి అభిషేక్, గోపిరెడ్డి చక్రవర్తులకు పళ్లు గారపట్టింది. తమ బతుకులు ఎలాగూ నాశనమయ్యాయి, పిల్లల భవిష్యత్ అయినా కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కర్రల సాయం లేకుంటే నడవలేను గ్రామంలో చేతిపంపు నీరు సేవించడంతో నొప్పులు మొదలైయ్యాయి. క్రమేపి నాకాళ్లు వంకర తిరిగాయి. 6 ఏళ్ల నుంచి కర్ర లేకుండా నడవలేకపోతున్నాను. మందులు కొనుక్కునే స్థోమత లేదు. రామతీర్థం నీరు అందించి మా పిల్లల భవిష్యత్ కాపాడండి. - యర్రబల్లి పాపులు జగన్మోహన్రెడ్డి భరోసాతో ఆశలు చిగురించాయి కిడ్నీవ్యాధులతో మా గ్రామంలో 20 మంది చనిపోయారు. కొంత మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని పెదచెర్లోపల్లి జగన్మోహన్రెడ్డి òచేపట్టిన బహిరంగ సభకు కిడ్నీ బాధితులను తీసుకెళ్లాం. చలించిన జగన్ సార్ కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10వేలు పింఛన్ రూపంలో ఇస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ బాధితులకు ఆయన భరోసా కల్పించారు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం కిడ్నీవ్యాధిగ్రస్తులను పట్టించుకున్న దాఖలాలు లేవు. - బొల్లినేని నాగేశ్వరరావు, రావిళ్లవారిపాలెం -
రాజ్యాంగమా.. నీవే దిక్కు!
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలో చాలామంది ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వాలు అంటే తెలియదు. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి కొన్ని రాజ్యాంగ హక్కులు కల్పించినప్పటికీ ఇప్పటి వరకు వాటిని స్వేచ్ఛగా వాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా దళిత హక్కులకు పూర్తిగా భగం వాటిల్లితోంది. అందుకు ఉదాహరణ మండలంలోని రామాయపాలెం. సాక్షి, మర్రిపూడి(ప్రకాశం): ఈ గ్రామంలో 591 ఓట్లు ఉన్నాయి. దళితవాడలో 250 మంది దళితులు నివసిస్తున్నారు. కాలనీలో 198 మంది దళితుల (మాదిగలు) ఓట్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ నంబరు 14 లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే దాదాపు 35 ఏళ్లుగా ఈ దళితవాడలోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న దాఖలాలు లేవు. అధికారపార్టీకి చెందిన నేతల బెదిరింపులే ఇందుకుకారణ మని దళితులు వాపోతున్నారు. బెదిరింపుల పర్వం మండలంలోని సింహభాగం చౌదరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 393 ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో అక్కడ అధికార తెలుగుదేశం పార్టీదే హవా. ఎన్నికల సమయంలో దళితులకు చెందిన ఓట్లను వినియోగిచుకోనివ్వరు. ఎస్సీ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురౌతున్నారు. వారి ఓట్లు లాక్కుని వేసుకోవడం రామాయపాలెం గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. ఆ గ్రామంలో ప్రతి ఎన్నికల్లో ఓటర్లును బెదిరించడం, ప్రలోభాలకు లోను చేయడం, ఎదురుతిరిగితే దౌర్జన్యానికి దిగడం జరుగుతోంది. అందుకే ఆ గ్రామ దళితులు భయపడి తమ ఓటును వినియోగించుకోకుండా బూత్‌ల వద్ద ఉన్న ఏజెంట్లకు ఇచ్చి వెళ్లిపోతుంటారు. నా ఓటు నేను వేసుకుంటా అన్న మాట దళితుల నుంచి వినిపిస్తే గ్రామంలోకి రానివ్వరు. పనులకు పిలవరు, డబ్బులు ఇచ్చినా తాగునీరు (బబుల్స్ నీరు), పాలు కట్ అంటారు. అందుకే భయపడి అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లకు ఓటరు స్లిప్ ఇస్తామంటున్నారు. నాడు 10 ఓట్లే వేశారు మండలంలోని రామాయపాలెం గ్రామంలోని పోలింగ్ బూత్ నంబరు 14 వద్దకు ఓటు వినియోగించుకోనివ్వకపోవడంతో దళితవాడలో నూతన పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలంటూ గతంలో జిల్లా కలెక్టర్‌కు రెండుసార్లు వినతిపత్రం సమర్పించారు. 2014 ఎన్నికల్లో ఓటు వినియోగించుకోనివ్వకపోవడంతో అప్పటి కలెక్టర్ విజయకుమార్‌ను సంప్రదిస్తే మాకు పోలీస్ సెక్యూరిటీతో 10 ఓట్లు మాత్రమే వేసుకోనిచ్చి మిగిలిన ఓట్లు అన్నీ సీసీ కెమేరాలు తొలగించి అధికార పార్టీకి చెందినవారు వేసుకుని గెలుచుకున్నారని గ్రామ దళితులు వాపోతున్నారు. దళితవాడలో నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అధికారులను వేడుకున్నా ఉపయోగంలేదు. దీంతో మండల స్థాయి అధికారులు, బూత్‌లెవల్ అధికారుల అండతో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. ఓటరు లిస్టులో ఓట్లు ఉన్నాయని ఈ సారైనా తమ ఓటు హక్కు తమకు కల్పించాలని వేడుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రలోభాలా? ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాస్వామ్యదేశంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు అంబేడ్కర్ దళితులను కల్పించారు. నేటి సమాజంలో అసమానతలు తొలగాలని సమానత్వం పెంపొందించాలని రాజ్యాగంలో దళితులకు ఓటు హక్కు అనే ఆయుధం మాకు ఇచ్చారు. కానీ అ పరిస్థితి లేదు. ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. - కోండ్రు మోజేష్ (నేషనల్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మండల అధ్యక్షుడు) బూత్ వద్దకు ఎలా వస్తారో చూస్తామంటున్నారు మాగ్రామంలో పోలింగ్ బూత్ నంబరు 14 వద్ద కు వెళ్లాలంటే భయంగా ఉంది. పోలింగ్‌బూత్ వద్దకు దళితులు ఎలా వస్తారో చూస్తామంటున్నారు. - మక్కెన బ్రహ్మయ్య ఓటు లాక్కుని వేసుకుంటారు ఓట్లు వేయడానికి ఎన్నిసార్లు పోలింగ్‌బూత్ వద్దకు వెళ్లినా నా ఓటు లాక్కుని పచ్చనేతలు వేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మా ఓట మమ్ములనువేసుకోనివ్వండి సారూ. - మక్కెన శ్యాంసన్ దళితవాడలో పోలింగ్ బూత్ పోలింగ్ బూత్‌నంబరు 14 వద్ద ఎలాగూ ఓటు వేసుకోనివ్వరు. అందు వల్లా మా ఓట్లు మేమువేసుకోవడానికి వీలుగా దళితవాడలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. - ఎం. హరి ఇప్పటి వరకు వినియోగించుకోలేదు మండలంలోని రామాయపాలెం గ్రామంలోని దళితవాడలో నివసిస్తున్నా దాదాపు 35 ఏళ్లుగా ఓటు వినియోగించుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికల సమయంలో మమ్ములను బెదిరించి లాక్కుని ఓటు వేసుకుంటున్నారు. - మక్కెన శ్రీను -
రూ.4 కోట్లు హాంఫట్..!
మర్రిపూడి, న్యూస్‌లైన్ : కొందరు ఆక్రమార్కులు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టి రూ. కోట్ల రుణం దిగమింగారు. విశాఖపట్నం నుంచి సీబీఐ అధికారులు వచ్చి విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పీసీపల్లి మండలానికి చెందిన 12 మంది మర్రిపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో భూములున్నట్లు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించారు. అనంతరం తమ సొంత మండలం పీసీపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పాస్‌పుస్తకాలు తనఖా పెట్టి రూ.4 కోట్లకుపైగా రుణం తీసుకున్నారు. అవి బోగస్ పాస్‌పుస్తకాలని తేలడంతో విశాఖపట్నం నుంచి వచ్చిన సీబీఐ అధికారులు శుక్రవారం మర్రిపూడి తహశీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అధికారులు 1 బీ అడంగల్‌ను తనిఖీ చేసినట్లు తహశీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు తెలిపారు. యానం బాలరాజు అనే వ్యక్తితో పాటు మరో 11 మంది ఈ అక్రమంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. రూ.49.6 లక్షలు, రూ.40.6 లక్షలు, రూ.45.5 లక్ష లు, రూ.10.2 లక్షలు.. ఇలా ఒక్కొక్కరు రుణం తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ బ్యాంకు ఉద్యోగి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.గతంలో మర్రి పూడి తహశీల్దార్‌గా పనిచేసిన ఈ. చంద్రావతి, అప్పటి వీఆర్ఓ పీవీ రాజు సంతకాలు పాస్‌పుస్తకాల్లో ఉన్నట్లు గుర్తించారు. వారి సంతకాలతో పాటు తహశీల్దార్ కార్యాలయ రౌండ్ సీలు కూడా ఉంది. ఆ 12 మందికి మర్రిపూడి మండలంలో నిజంగానే భూములున్నా యా? పాస్‌పుస్తకాలపై సంతకాలు ఎవరు పెట్టారు? అవి అప్పటి తహశీల్దార్ చంద్రావతి, వీఆర్ఓ రాజు సంతకాలేనా? తదితర అంశాలపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. -
ప్రాదేశిక ఎన్నికల్లో బరితెగించిన టీడీపీ
మర్రిపూడి, న్యూస్‌లైన్ : మలి దశ ప్రాదేశిక ఎన్నికల్లో కూడా టీడీపీ నాయకులు బరితెగించారు. ఓటమి తప్పదని భావించి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. మర్రిపూడి మండలం జువ్విగుంటలో శుక్రవారం జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగి ఓ ఏజెంట్‌తో సహా ఏడుగురిని గాయపరిచారు. వివరాలు.. జువ్విగుంట గ్రామంలోని కేజీకండ్రిక ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు గ్రహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించారు. అనంతరం ఏజెంట్ల మధ్య స్వల్ప వివాదం జరిగింది. తొలుత ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి చివరకు ఘర్షణకు దారితీసింది. పథకం ప్రకారం టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కముజుల రమణారెడ్డి, రావులపల్లి నరసింహారావు, కార్యకర్తలు రావులపల్లి నాగరాజు, గింజి వీరమ్మ, రావులపల్లి రమణమ్మ, పగడాల బాబుతో పాటు పదేళ్ల చిన్నారి గోళ్ల అనూష గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తమ వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొద్దిసేపటి తర్వాత పోలింగ్ సజావుగా సాగింది. ఏజేసీ ప్రకాష్‌కుమార్, కందుకూరు ఆర్డీఓ బాపిరెడ్డి, మండల ఎన్నికల అధికారి టి.రమేష్, తహశీల్దార్ ఎం.పూర్ణచంద్రరావులు పోలింగ్ కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అగ్ర హారంలో కూడా.. మర్రిపూడి మండలం అగ్రహారంలో కూడా పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తానికొండ శ్రీనివాసులు, రావులపల్లి ఏడుకొండలు, తానికొండ వెంకయ్యలకు గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన కె.వెంకటేశ్వర్లు, తానికొండ సుభాషిణిలు కూడా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైఎస్సార్ సీపీకి ఆదరణ చూసే దాడులు : జూపూడి పొదిలి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆదరణ చూసి ఓర్వలేకనే కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మర్రిపూడి మండలం జువ్విగుంటకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను శుక్రవారం సాయంత్రం ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. క్షతగాత్రుల నుంచి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా అక్కడ పలుమార్లు టీడీపీ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని జూపూడి దృష్టికి పార్టీ మండల కన్వీనర్ బోదా రమణారెడ్డి తీసుకొచ్చారు. క్షతగాత్రులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని జూపూడి హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఎంపీపీ అభ్యర్థి బీవీ భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఇంకొల్లు పిచ్చిరెడ్డి, తూము బాలిరెడ్డి, మర్రిపూడి సర్పంచ్ పొదిలి శ్రీనివాసరావు, ఇంకొల్లు కోటిరెడ్డి, కోండ్రు ఇజ్రాయేల్, న్యాయవాది ధర్నాసి రామారావు ఉన్నారు.