మర్రిపూడి, న్యూస్‌లైన్ : కొందరు ఆక్రమార్కులు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టి రూ. కోట్ల రుణం దిగమింగారు. విశాఖపట్నం నుంచి సీబీఐ అధికారులు వచ్చి విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పీసీపల్లి మండలానికి చెందిన 12 మంది మర్రిపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో భూములున్నట్లు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించారు.
అనంతరం తమ సొంత మండలం పీసీపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పాస్‌పుస్తకాలు తనఖా పెట్టి రూ.4 కోట్లకుపైగా రుణం తీసుకున్నారు. అవి బోగస్ పాస్‌పుస్తకాలని తేలడంతో విశాఖపట్నం నుంచి వచ్చిన సీబీఐ అధికారులు శుక్రవారం మర్రిపూడి తహశీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అధికారులు 1 బీ అడంగల్‌ను తనిఖీ చేసినట్లు తహశీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు తెలిపారు. యానం బాలరాజు అనే వ్యక్తితో పాటు మరో 11 మంది ఈ అక్రమంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. రూ.49.6 లక్షలు, రూ.40.6 లక్షలు, రూ.45.5 లక్ష లు, రూ.10.2 లక్షలు.. ఇలా ఒక్కొక్కరు రుణం తీసుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఓ బ్యాంకు ఉద్యోగి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.గతంలో మర్రి పూడి తహశీల్దార్‌గా పనిచేసిన ఈ. చంద్రావతి, అప్పటి వీఆర్‌ఓ పీవీ రాజు సంతకాలు పాస్‌పుస్తకాల్లో ఉన్నట్లు గుర్తించారు. వారి సంతకాలతో పాటు తహశీల్దార్ కార్యాలయ రౌండ్ సీలు కూడా ఉంది. ఆ 12 మందికి మర్రిపూడి మండలంలో నిజంగానే భూములున్నా యా? పాస్‌పుస్తకాలపై సంతకాలు ఎవరు పెట్టారు? అవి అప్పటి తహశీల్దార్ చంద్రావతి, వీఆర్‌ఓ రాజు సంతకాలేనా? తదితర అంశాలపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.
రూ.4 కోట్లు హాంఫట్..!
Published Sat, May 10 2014 4:03 AM | Last Updated on Sat, Jun 2 2018 5:44 PM
Advertisement
Advertisement