Andhra Pragathi Grameena Bank
-
మరో 10 నకిలీ పాసుపుస్తకాలు
కలిగిరి : కలిగిరిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో 10 నకిలీ పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీలతో రుణాలు పొందినట్లు తహశీల్దార్ లావణ్య గుర్తించారు. కలిగిరిలో ఏపీజీబీలో తీసుకున్న పంట రుణాలపై శనివారం తహశీల్దార్ విచారణ జరిపారు. ఇటీవల ఏపీజీబీలో నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు పొందడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకుమేనేజర్‌కు అనుమానంవచ్చి పట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై తహశీల్దార్ విచారణ చేపట్టారు. అందులో భాగంగా 2014 నవంబర్ నుంచి మంజూరు చేసిన 150 పంట రుణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వాటిలో 10 మంది నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీలతో రుణాలు పొందినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ లావణ్య మాట్లాడుతూ 10 మందికి సంబంధించిన పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీలు పూర్తిస్థాయిలో రెవెన్యూ రికార్డుల్లో పరిశీలిం చి, నిర్ధారించుకున్న అనంతరం సంబంధిత వ్యక్తులపై కేసులు పెడతామన్నారు. బ్యాంక్‌ను మోసం చేసి రుణాలు పొందినందుకు బ్యాంకు తరుఫున కూడా కేసు పెట్టాలని మేనేజర్ వీరరాఘవులుకు సూచించారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన అడంగళ్, 1బీలను ఫోర్జరీ చేయడాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. నకిలీ పాసుపుస్తకాల సూత్రధారులను పట్టుకుంటే పూర్తివిషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 10 మంది నకిలీ పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీల వివరాలను నమోదు చేసుకున్నారు. -
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ దుర్మరణం
అనంతపురం : అనంతపురం జిల్లా తలుపుల మండలం నామాలగుండు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కదిరి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయి ప్రసాద్ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కారు-లారీ ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. -
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలోని దేవుని కడపలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో గురువారం తెల్లవారుజామున దుండగులు చోరీకి యత్నించారు. అక్కడే ఉన్న బ్యాంక్ భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దాంతో దుండగులు పరారయ్యారు. దుండగులను పట్టుకునేందుకు భద్రత సిబ్బంది యత్నించారు. కానీ దుండగులు భద్రత సిబ్బందికి చిక్కలేదు. బ్యాంకులో చోరీ యత్నంపై భద్రత సిబ్బంది అటు పోలీసులకు ఇటు బ్యాంకు అధికారులను సమాచారం అందించారు. పోలీసులు, బ్యాంకు అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని దోపిడికి యత్నానికి సంబంధించిన వివరాలను భద్రత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. -
వేలం నోటీసులతో వేదన
పీసీపల్లి, పెద్దారవీడు : పీసీపల్లి మండలంలోని మురుగమ్మి, పీసీపల్లి, కమ్మవారిపల్లి, గోపవరపు వారిపల్లి, చింతగుంపల్లి, వెలుతుర్లవారిపల్లి, పిల్లివారిపల్లి, లక్ష్మక్కపల్లి, లింగన్న పాలెం వేపగుంపల్లి, తలకొండపాడు, మారెళ్ల, ముద్దపాడు, బట్టుపల్లి తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ) నుంచి సోమవారం నోటీసులు వచ్చాయి. బ్యాంక్ పరిధిలో మొత్తం 1,350 మంది బంగారు, క్రాప్ రుణాలు తీసుకున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. 18 నెలలు దాటిన ఓవర్ డ్యూ కింద రైతులందరికీ ఇవి అందనున్నాయి. వడ్డీతో సహా రుణం చెల్లించాలంటే ఒక్క రైతు నోటీసుల మీద ఈ నెల 30, 28, 1, 5 తదితర తేదీల్లో బంగారం వేలం వేస్తామని అధికారులు నోటీసులో హెచ్చరించారు. నోటీసులు అందుకున్న కొందరు రైతులు బ్యాంక్‌కు వచ్చి ప్రభుత్వం రుణమాఫీ చేయనుందని, ఆ విషయం తేలే వరకు సమయం కావాలని కోరారు. నిర్ణీత సమయంలో కట్టకపోతే వేలం వేస్తామని అధికారులు హెచ్చరించారు. ఒకేసారి నోటీసు పంపి అందులో వేలం వేస్తామని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. అసలు తమ గ్రామం వైపు ఫీల్డ్ ఆఫీసర్లు కాని, బ్యాంకు అధికారులు రుణాలు ఇచ్చాక తిరిగి చూడకుండా ఒక్కసారి నోటీసులు జారీ చేయడం ఏమిటని పిల్లి దత్తాత్రేయ, ద్వారశిల వెంకటేశ్వర్లు, దేశిరెడ్డి మాల్యాద్రి, మేకల బాలయ్య, చిలకల బ్రహ్మయ్య, చిలకల నరసింహం ప్రశ్నించారు. పెద్దారవీడులో... పెద్దారవీడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణాలు తెచ్చుకున్న రైతులందరికీ నోటీసులు రావడం కలకలం రేపింది. నోటీసు అందిన పది రోజుల్లోపు అసలు, వడ్డీ కట్టని పక్షంలో బంగారాన్ని వేలం వేస్తామని అందులో పేర్కొన్నారు. చంద్రబాబు హామీని నమ్మి మోసపోయామని, ఇప్పటికైనా తమ గోడు ఆలకించి రుణమాఫీ అమలు చేయాలని నోటీసులు అందుకున్న సాదుల లక్ష్మీనర్సారెడ్డి, గుమ్మా గురవయ్య కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు పంపాం : టి.సుధాకర్‌బాబు, ఎస్బీఐ మేనేజర్, పెద్దారవీడు బ్యాంక్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేశాం. లక్ష రూపాయలకు పైబడి మూడేళ్ల నుంచి బకాయిలు చెల్లించని 24 మందికి నోటీసులు అందించాం. మొత్తం 1.35 కోట్ల రుణాలిచ్చాం. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి ఇంత వరకు మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. -
రూ.4 కోట్లు హాంఫట్..!
మర్రిపూడి, న్యూస్‌లైన్ : కొందరు ఆక్రమార్కులు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టి రూ. కోట్ల రుణం దిగమింగారు. విశాఖపట్నం నుంచి సీబీఐ అధికారులు వచ్చి విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పీసీపల్లి మండలానికి చెందిన 12 మంది మర్రిపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో భూములున్నట్లు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించారు. అనంతరం తమ సొంత మండలం పీసీపల్లి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పాస్‌పుస్తకాలు తనఖా పెట్టి రూ.4 కోట్లకుపైగా రుణం తీసుకున్నారు. అవి బోగస్ పాస్‌పుస్తకాలని తేలడంతో విశాఖపట్నం నుంచి వచ్చిన సీబీఐ అధికారులు శుక్రవారం మర్రిపూడి తహశీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అధికారులు 1 బీ అడంగల్‌ను తనిఖీ చేసినట్లు తహశీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు తెలిపారు. యానం బాలరాజు అనే వ్యక్తితో పాటు మరో 11 మంది ఈ అక్రమంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. రూ.49.6 లక్షలు, రూ.40.6 లక్షలు, రూ.45.5 లక్ష లు, రూ.10.2 లక్షలు.. ఇలా ఒక్కొక్కరు రుణం తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ బ్యాంకు ఉద్యోగి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.గతంలో మర్రి పూడి తహశీల్దార్‌గా పనిచేసిన ఈ. చంద్రావతి, అప్పటి వీఆర్ఓ పీవీ రాజు సంతకాలు పాస్‌పుస్తకాల్లో ఉన్నట్లు గుర్తించారు. వారి సంతకాలతో పాటు తహశీల్దార్ కార్యాలయ రౌండ్ సీలు కూడా ఉంది. ఆ 12 మందికి మర్రిపూడి మండలంలో నిజంగానే భూములున్నా యా? పాస్‌పుస్తకాలపై సంతకాలు ఎవరు పెట్టారు? అవి అప్పటి తహశీల్దార్ చంద్రావతి, వీఆర్ఓ రాజు సంతకాలేనా? తదితర అంశాలపై సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. -
పొదుపు.. అభివృద్ధికి మలుపు
ఓర్వకల్లు రూరల్, న్యూస్‌లైన్: పొదుపు చేయడం ఆర్థిక అభివృద్ధికి మలుపు అని ప్రపంచ బ్యాంకు బృందం తెలిపింది. జిల్లాలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల పనితీరు భేష్ అని కొనియాడింది. గురువారం ఓర్వకల్లు మండలం హుసేనాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును 12 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందం సందర్శించింది. బృందంలో ఓరోసులిస్టాని, రాపిగ్రాతు, జార్జ్స్పరయా, సిద్దిక్ ప్రేమనా, డినేసిసింద్రా, రాపికేహబి, ఆరిఫ్, పూర్ణిమా, సూర్యపత్రిమా, జాకీ బాయరాయి ఉన్నారు. వారి వెంట పీఎన్ఆర్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ శ్రీధర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా వారు పొదుపు మహిళలు బ్యాంకుల ద్వారా లబ్ధి పొందిన విధానాన్ని, అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ రంగన్న మాట్లాడుతూ కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో సుమారు 5,300 మంది పొదుపు గ్రూపు సంఘాలకు రుణాలు ఇచ్చామన్నారు. ఏటా జూన్‌లో రుణాలు వసూలు చేస్తామన్నారు. ఒక్కో గ్రూపునకు రూ. 5 లక్షలు నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామన్నారు. ఆ డబ్బుతో సభ్యులు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లిస్తురని చెప్పారు. పొదుపునకు సంబంధించిన అనేక అంశాలను మీరా గ్రూపునకు చెందిన లీడర్ పద్మావతితో బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. పొదుపు సంఘాలు లేనప్పుడు, ఏర్పడ్డాక ఎలా ఉందని బృందం సభ్యులు ప్రశ్నించారు. సంఘాలు లేనప్పుడు అప్పులు దొరికేవి కావని, సంఘాలు ఏర్పడిన తర్వాత తాము ఎంతో అభివృద్ధి చెందామని వారికి వివరించారు. పొదుపుతో ఆర్థిక అభివృద్ధి: డీఆర్డీఏ పీడీ నజీర్అహ్మద్ మాట్లాడుతూ పొదుపు సంఘాల సభ్యులు వ్యాపారాలు, భూమి కొనుగోళ్లు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందారని బృందానికి వివరించారు. హుసేనాపురం ఆంధ్రప్రగతి బ్యాంకు మేనేజర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 250 పొదుపు సంఘాలకు రూ. 4.50 కోట్ల రుణాలు, 1500 మంది రైతులకు రూ. 9 కోట్ల వరకు పంట రుణాలు ఇచ్చామన్నారు. అనంతరం పొదుపు మహిళలతో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు మాట్లాడారు. పొదుపు ద్వారా పేదరికాన్ని జయించి ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని అభినందించారు. సంఘాల పనితీరును తాముఆదర్శంగా తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రగతి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పూర్ణ పుష్కల, ఫీల్డ్ ఆఫీసర్ చంద్రశేఖర్ఆచారి, అకౌంటెంట్ జ్యోతిర్మయి, ఆర్ఓ క్రెడిట్ మేనేజర్ రమణారెడ్డి, నాబార్డు ఏజీఎం కల్యాణ సుందరం పాల్గొన్నారు. -
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడీ
కడప: వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడీ జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 62 మంది ఖాతాదారులకు చెందిన 3100 గ్రాముల బంగారు నగలు చోరీకి గురైనట్లు బ్యాంక్ రీజనల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి తెలిపారు. -
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో చోరి
-
రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడీ
కడప: వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగులు సుమారు రూ. 50 లక్షలు చోరీ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్యాంక్‌కు ఆదివారంతో పాటు.... వినాయకచవితి సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు రావటంతో చోరీ జరిగిన విషయాన్ని బ్యాంక్ సిబ్బంది ఈరోజు ఉదయం గమనించారు. అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.