మరో 10 నకిలీ పాసుపుస్తకాలు
కలిగిరి : కలిగిరిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో 10 నకిలీ పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీలతో రుణాలు పొందినట్లు తహశీల్దార్ లావణ్య గుర్తించారు. కలిగిరిలో ఏపీజీబీలో తీసుకున్న పంట రుణాలపై శనివారం తహశీల్దార్ విచారణ జరిపారు. ఇటీవల ఏపీజీబీలో నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు పొందడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకుమేనేజర్‌కు అనుమానంవచ్చి పట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై తహశీల్దార్ విచారణ చేపట్టారు. అందులో భాగంగా 2014 నవంబర్ నుంచి మంజూరు చేసిన 150 పంట రుణాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వాటిలో 10 మంది నకిలీ పాసుపుస్తకాలు, అడంగల్, 1బీలతో రుణాలు పొందినట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ లావణ్య మాట్లాడుతూ 10 మందికి సంబంధించిన పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీలు పూర్తిస్థాయిలో రెవెన్యూ రికార్డుల్లో పరిశీలిం చి, నిర్ధారించుకున్న అనంతరం సంబంధిత వ్యక్తులపై కేసులు పెడతామన్నారు. బ్యాంక్‌ను మోసం చేసి రుణాలు పొందినందుకు బ్యాంకు తరుఫున కూడా కేసు పెట్టాలని మేనేజర్ వీరరాఘవులుకు సూచించారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన అడంగళ్, 1బీలను ఫోర్జరీ చేయడాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. నకిలీ పాసుపుస్తకాల సూత్రధారులను పట్టుకుంటే పూర్తివిషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. 10 మంది నకిలీ పాసుపుస్తకాలు, అడంగళ్, 1బీల వివరాలను నమోదు చేసుకున్నారు.