పీసీపల్లి, పెద్దారవీడు : పీసీపల్లి మండలంలోని మురుగమ్మి, పీసీపల్లి, కమ్మవారిపల్లి, గోపవరపు వారిపల్లి, చింతగుంపల్లి, వెలుతుర్లవారిపల్లి, పిల్లివారిపల్లి, లక్ష్మక్కపల్లి, లింగన్న పాలెం వేపగుంపల్లి, తలకొండపాడు, మారెళ్ల, ముద్దపాడు, బట్టుపల్లి తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ) నుంచి సోమవారం నోటీసులు వచ్చాయి. బ్యాంక్ పరిధిలో మొత్తం 1,350 మంది బంగారు, క్రాప్ రుణాలు తీసుకున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం.
18 నెలలు దాటిన ఓవర్ డ్యూ కింద రైతులందరికీ ఇవి అందనున్నాయి. వడ్డీతో సహా రుణం చెల్లించాలంటే ఒక్క రైతు నోటీసుల మీద ఈ నెల 30, 28, 1, 5 తదితర తేదీల్లో బంగారం వేలం వేస్తామని అధికారులు నోటీసులో హెచ్చరించారు. నోటీసులు అందుకున్న కొందరు రైతులు బ్యాంక్‌కు వచ్చి ప్రభుత్వం రుణమాఫీ చేయనుందని, ఆ విషయం తేలే వరకు సమయం కావాలని కోరారు.
నిర్ణీత సమయంలో కట్టకపోతే వేలం వేస్తామని అధికారులు హెచ్చరించారు. ఒకేసారి నోటీసు పంపి అందులో వేలం వేస్తామని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. అసలు తమ గ్రామం వైపు ఫీల్డ్ ఆఫీసర్లు కాని, బ్యాంకు అధికారులు రుణాలు ఇచ్చాక తిరిగి చూడకుండా ఒక్కసారి నోటీసులు జారీ చేయడం ఏమిటని పిల్లి దత్తాత్రేయ, ద్వారశిల వెంకటేశ్వర్లు, దేశిరెడ్డి మాల్యాద్రి, మేకల బాలయ్య, చిలకల బ్రహ్మయ్య, చిలకల నరసింహం ప్రశ్నించారు.
పెద్దారవీడులో...
పెద్దారవీడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణాలు తెచ్చుకున్న రైతులందరికీ నోటీసులు రావడం కలకలం రేపింది. నోటీసు అందిన పది రోజుల్లోపు అసలు, వడ్డీ కట్టని పక్షంలో బంగారాన్ని వేలం వేస్తామని అందులో పేర్కొన్నారు. చంద్రబాబు హామీని నమ్మి మోసపోయామని, ఇప్పటికైనా తమ గోడు ఆలకించి రుణమాఫీ అమలు చేయాలని నోటీసులు అందుకున్న సాదుల లక్ష్మీనర్సారెడ్డి, గుమ్మా గురవయ్య కోరారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు పంపాం : టి.సుధాకర్‌బాబు, ఎస్‌బీఐ మేనేజర్, పెద్దారవీడు
బ్యాంక్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేశాం. లక్ష రూపాయలకు పైబడి మూడేళ్ల నుంచి బకాయిలు చెల్లించని 24 మందికి నోటీసులు అందించాం. మొత్తం 1.35 కోట్ల రుణాలిచ్చాం. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి ఇంత వరకు మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు.
వేలం నోటీసులతో వేదన
Published Wed, Jul 2 2014 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement