స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దేశంలో చాలామంది ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వాలు అంటే తెలియదు. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి కొన్ని రాజ్యాంగ హక్కులు కల్పించినప్పటికీ ఇప్పటి వరకు వాటిని స్వేచ్ఛగా వాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా దళిత హక్కులకు పూర్తిగా భగం వాటిల్లితోంది. అందుకు ఉదాహరణ మండలంలోని రామాయపాలెం.
సాక్షి, మర్రిపూడి(ప్రకాశం): ఈ గ్రామంలో 591 ఓట్లు ఉన్నాయి. దళితవాడలో 250 మంది దళితులు నివసిస్తున్నారు. కాలనీలో 198 మంది దళితుల (మాదిగలు) ఓట్లు ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ నంబరు 14 లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే దాదాపు 35 ఏళ్లుగా ఈ దళితవాడలోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న దాఖలాలు లేవు. అధికారపార్టీకి చెందిన నేతల బెదిరింపులే ఇందుకుకారణ మని దళితులు వాపోతున్నారు.
బెదిరింపుల పర్వం
మండలంలోని సింహభాగం చౌదరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 393 ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో అక్కడ అధికార తెలుగుదేశం పార్టీదే హవా. ఎన్నికల సమయంలో దళితులకు చెందిన ఓట్లను వినియోగిచుకోనివ్వరు. ఎస్సీ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురౌతున్నారు. వారి ఓట్లు లాక్కుని వేసుకోవడం రామాయపాలెం గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. ఆ గ్రామంలో ప్రతి ఎన్నికల్లో ఓటర్లును బెదిరించడం, ప్రలోభాలకు లోను చేయడం, ఎదురుతిరిగితే దౌర్జన్యానికి దిగడం జరుగుతోంది. అందుకే ఆ గ్రామ దళితులు భయపడి తమ ఓటును వినియోగించుకోకుండా బూత్‌ల వద్ద ఉన్న ఏజెంట్‌లకు ఇచ్చి వెళ్లిపోతుంటారు. నా ఓటు నేను వేసుకుంటా అన్న మాట దళితుల నుంచి వినిపిస్తే గ్రామంలోకి రానివ్వరు. పనులకు పిలవరు, డబ్బులు ఇచ్చినా తాగునీరు (బబుల్స్ నీరు), పాలు కట్ అంటారు. అందుకే భయపడి అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లకు ఓటరు స్లిప్ ఇస్తామంటున్నారు.
నాడు 10 ఓట్లే వేశారు
మండలంలోని రామాయపాలెం గ్రామంలోని పోలింగ్ బూత్ నంబరు 14 వద్దకు ఓటు వినియోగించుకోనివ్వకపోవడంతో దళితవాడలో నూతన పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలంటూ గతంలో జిల్లా కలెక్టర్‌కు రెండుసార్లు వినతిపత్రం సమర్పించారు. 2014 ఎన్నికల్లో ఓటు వినియోగించుకోనివ్వకపోవడంతో అప్పటి కలెక్టర్ విజయకుమార్‌ను సంప్రదిస్తే మాకు పోలీస్ సెక్యూరిటీతో 10 ఓట్లు మాత్రమే వేసుకోనిచ్చి మిగిలిన ఓట్లు అన్నీ సీసీ కెమేరాలు తొలగించి అధికార పార్టీకి చెందినవారు వేసుకుని గెలుచుకున్నారని గ్రామ దళితులు వాపోతున్నారు. దళితవాడలో నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ అధికారులను వేడుకున్నా ఉపయోగంలేదు. దీంతో మండల స్థాయి అధికారులు, బూత్‌లెవల్ అధికారుల అండతో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. ఓటరు లిస్టులో ఓట్లు ఉన్నాయని ఈ సారైనా తమ ఓటు హక్కు తమకు కల్పించాలని వేడుకుంటున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రలోభాలా?
ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాస్వామ్యదేశంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు అంబేడ్కర్ దళితులను కల్పించారు. నేటి సమాజంలో అసమానతలు తొలగాలని సమానత్వం పెంపొందించాలని రాజ్యాగంలో దళితులకు ఓటు హక్కు అనే ఆయుధం మాకు ఇచ్చారు. కానీ అ పరిస్థితి లేదు. ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
- కోండ్రు మోజేష్ (నేషనల్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మండల అధ్యక్షుడు)
బూత్ వద్దకు ఎలా వస్తారో చూస్తామంటున్నారు
మాగ్రామంలో పోలింగ్ బూత్ నంబరు 14 వద్ద కు వెళ్లాలంటే భయంగా ఉంది. పోలింగ్‌బూత్ వద్దకు దళితులు ఎలా వస్తారో చూస్తామంటున్నారు.
- మక్కెన బ్రహ్మయ్య
ఓటు లాక్కుని వేసుకుంటారు
ఓట్లు వేయడానికి ఎన్నిసార్లు పోలింగ్‌బూత్ వద్దకు వెళ్లినా నా ఓటు లాక్కుని పచ్చనేతలు వేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మా ఓట మమ్ములనువేసుకోనివ్వండి సారూ.
- మక్కెన శ్యాంసన్
దళితవాడలో పోలింగ్ బూత్
పోలింగ్ బూత్‌నంబరు 14 వద్ద ఎలాగూ ఓటు వేసుకోనివ్వరు. అందు వల్లా మా ఓట్లు మేమువేసుకోవడానికి వీలుగా దళితవాడలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి.
- ఎం. హరి
ఇప్పటి వరకు వినియోగించుకోలేదు
మండలంలోని రామాయపాలెం గ్రామంలోని దళితవాడలో నివసిస్తున్నా దాదాపు 35 ఏళ్లుగా ఓటు వినియోగించుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఎన్నికల సమయంలో మమ్ములను బెదిరించి లాక్కుని ఓటు వేసుకుంటున్నారు.
- మక్కెన శ్రీను
Comments
Please login to add a commentAdd a comment