మర్రిపూడి, న్యూస్‌లైన్ : మలి దశ ప్రాదేశిక ఎన్నికల్లో కూడా టీడీపీ నాయకులు బరితెగించారు. ఓటమి తప్పదని భావించి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. మర్రిపూడి మండలం జువ్విగుంటలో శుక్రవారం జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగి ఓ ఏజెంట్‌తో సహా ఏడుగురిని గాయపరిచారు. వివరాలు.. జువ్విగుంట గ్రామంలోని కేజీకండ్రిక ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు గ్రహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించారు. అనంతరం ఏజెంట్ల మధ్య స్వల్ప వివాదం జరిగింది. తొలుత ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి చివరకు ఘర్షణకు దారితీసింది. పథకం ప్రకారం టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు కముజుల రమణారెడ్డి, రావులపల్లి నరసింహారావు, కార్యకర్తలు రావులపల్లి నాగరాజు, గింజి వీరమ్మ, రావులపల్లి రమణమ్మ, పగడాల బాబుతో పాటు పదేళ్ల చిన్నారి గోళ్ల అనూష గాయపడ్డారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తమ వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొద్దిసేపటి తర్వాత పోలింగ్ సజావుగా సాగింది. ఏజేసీ ప్రకాష్‌కుమార్, కందుకూరు ఆర్‌డీఓ బాపిరెడ్డి, మండల ఎన్నికల అధికారి టి.రమేష్, తహశీల్దార్ ఎం.పూర్ణచంద్రరావులు పోలింగ్ కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.
అగ్ర హారంలో కూడా..
మర్రిపూడి మండలం అగ్రహారంలో కూడా పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తానికొండ శ్రీనివాసులు, రావులపల్లి ఏడుకొండలు, తానికొండ వెంకయ్యలకు గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన కె.వెంకటేశ్వర్లు, తానికొండ సుభాషిణిలు కూడా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
వైఎస్సార్ సీపీకి ఆదరణ చూసే దాడులు : జూపూడి
పొదిలి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆదరణ చూసి ఓర్వలేకనే కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకుల దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మర్రిపూడి మండలం జువ్విగుంటకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను శుక్రవారం సాయంత్రం ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. క్షతగాత్రుల నుంచి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గతంలో కూడా అక్కడ పలుమార్లు టీడీపీ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని జూపూడి దృష్టికి పార్టీ మండల కన్వీనర్ బోదా రమణారెడ్డి తీసుకొచ్చారు. క్షతగాత్రులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని జూపూడి హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఎంపీపీ అభ్యర్థి బీవీ భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఇంకొల్లు పిచ్చిరెడ్డి, తూము బాలిరెడ్డి, మర్రిపూడి సర్పంచ్ పొదిలి శ్రీనివాసరావు, ఇంకొల్లు కోటిరెడ్డి, కోండ్రు ఇజ్రాయేల్, న్యాయవాది ధర్నాసి రామారావు ఉన్నారు.
ప్రాదేశిక ఎన్నికల్లో బరితెగించిన టీడీపీ
Published Sat, Apr 12 2014 3:09 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement