మృతుడు మర్రిబోయిన అంకమ్మరావు (ఫైల్)
సాక్షి, ప్రకాశం(మర్రిపూడి): అక్కను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని బావను అతికిరాతకంగా బండరాయితో మోది బావమరిది హత్యచేసిన సంఘటన మండలంలోని గంగపాలెంచెరువు అలుగు సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఈర్ల పెదకోటేష్, మంగమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా, కుమార్తె అనూషాను ఒంగోలు సమీపంలోని పేర్నమిట్టకు చెందిన మర్రిబోయిన వెంకటరమణ కుమారుడు అంకమ్మరావు (26)కు ఇచ్చి 8 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి మూడేళ్ల సంతోష్, ఒకటిన్నరేళ్ల రాజ్‌కుమార్ ఉన్నారు.
అంకమరావు మద్యానికి బానిస కావడంతో పెళ్లయిన మూడేళ్లకే భార్యభర్తల మధ్య కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. పోలీస్ స్టేషన్‌లో పంచాయతీలు జరిగినట్లు అతని తండ్రి వెంకటరమణ తెలిపారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం భార్యాభర్తలిద్దరూ అంకమరావు అత్తగారి ఇళ్లయిన కూచిపూడిలో కాపురం పెట్టారు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ పూటుగా నిత్యం మద్యం సేవించి చేతులు కోసుకోవడం, తలుపులు పగలకొట్టడం లాంటి పనులతో గొడవలు పెట్టుకుంటున్నాడని మృతుని అత్త మంగమ్మ తెలిపింది.
చదవండి: (పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు.. ఏకంగా 21 మందికి పైగా..)
ఈ నేపథ్యంలో 10 రోజులుగా అనూషా అతనితో కాకుండా మరో మేస్త్రీ వద్దకు బేల్దారి పనులకు పోతుండటంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న వృద్ధుడు ఈర్ల మూగయ్య హైదరాబాద్‌లో బేల్దారి పనిచేసుకుంటున్న మనుమడు ఈర్ల వినోద్‌కు సమాచారం ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం వినోద్ కూచిపూడి వచ్చాడు. ఈ నెల 23న రాత్రి తన బావ అంకమరావును బావమరిది అయిన వినోద్ ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకెళ్లాడు.
గంగపాలెం చెరువు అలుగుసమీపంలో ఇద్దరూ పూటుగా మద్యం సేవించారు. ఆ మత్తులో అంకమరావును బండరాయితో తలపై మోది అతి కిరాతకంగా వినోద్ హత్య చేశాడు. సమాచారం అందుకున్న కొండపి సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంకమ్మరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment