సాక్షి, ఒంగోలు సబర్బన్: అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని అన్నట్లు తయారైంది అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి. అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్ల విలువగల ఆస్తులున్నా వాటిని అమ్మి బాధితులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డు గోడలా మారారు. దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు కన్ను పడింది. ఆయనతోపాటు ఆయన పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గద్దల్లా వాలిపోయారు. ఇంకేముంది దొరికిన కాడికి ఆస్తులు లాగేసుకున్నారు. అయినా ఇంకా డిపాజిట్‌దారులకు చెల్లించేదానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులపై కనికరం లేకుండాపోయింది. నాలుగున్నరేళ్లుగా బాధితులను అవిగో ఇస్తున్నా.. ఇవిగో ఇస్తున్నా అంటూ ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్నారంటే చంద్రబాబుది ఎంత కాఠిన్యమైన మనస్సో అర్థమవుతుంది. చివరకు ఆయన ఐదేళ్లు పరిపాలనా ఫలాలు అనుభవించాడు. కానీ బాధితులకు మాత్రం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. వేల కుటుంబాలను నిలువునా ముంచాడనటంలో సందేహం లేదు.
రూపాయి రూపాయి కూడబెట్టుకున్న వారు కొందరు.. ఉన్నదానిలోనే కొంత దాచుకున్న వారు మరి కొందరు.. వడ్డీ వస్తుందిలే అని ఉన్నది మొత్తం డిపాజిట్ చేసిన ఇంకొందరు.. వృత్తి పని, ఉద్యోగాలు చేస్తూ ప్రవృత్తిగా డిపాజిట్ల సేకరణ చేపట్టిన వారు ఇంకొందరు.. ఇలా అగ్రిగోల్డ్ సంస్థను నమ్మిన వారంతా దగా పడ్డారు. డబ్బు తిరిగొస్తుందో రాదోననే ఆందోళనలో ప్రాణాలు సైతం తీసుకున్నారు. అవ్వా వెంకట రామారావు చైర్మన్‌గా 1995లో అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించిన నాటి నుంచి సంస్థపై కేసులు పెట్టే వరకు ఎందరో నమ్మి డబ్బు దాచుకుంటే వారి నోట్లో మట్టి కొట్టి చోద్యం చూస్తున్నారు. సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లకు డబ్బు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుక మడతేసింది.
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు ఉన్నారు. ప్రస్తుతం వారు అగ్రిగోల్డ్ బాధితులుగా మారారు. ఏపీ సీఐడీ లెక్కల ప్రకారం 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే 19.52 లక్షల మంది ఉన్నారు. డిపాజిటర్లకు మొత్తం రూ.6,380 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం రూ.10 వేల కోట్లు ఉన్నాయని ప్రకటించారు. ఇకపోతే పలువురు మంత్రులు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇన్ని ఆస్తులున్నప్పుడు బాధితులకు డబ్బు చెల్లించేందుకు అభ్యంతరం ఏమిటీ అంటే ఆలస్యమయ్యేకొద్దీ డైరెక్టర్ల పేరు మీద, సంస్థలోని బినామీల పేరుమీద ఉన్న ఆస్తులను కొట్టేయడానికి పరిపాలనలో ఉన్న పెద్దలు వేసిన ఎత్తుగడ.
అందుకే గత నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేస్తూ బాధితుల ఉసురు పోసుకుంటున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. తాను ఎంతో అనుభవమున్న ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు తన అనుభవాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి అమాయకులను, కడు పేద వారిని నిలువునా మోసం చేసి కంటి మీద కునుకు లేకుండా చేయటంలో దిట్ట అనిపించుకుంటున్నాడు. చివరకు గుంటూరు–విజయవాడ హైవేపై ఉన్న హాయ్‌ల్యాండ్ లాంటి రూ.వందల కోట్ల విలువ గల ఆస్తిని కొట్టేయటానికి కూడా వెనుకాడలేదంటే బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన ఏమేరకు ఉందో అర్థమవుతుంది.
ఆది.. అంతం.. బాబు జమానాలోనే..
1995లో అగ్రిగోల్డ్ సంస్థను అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు. అప్పట్లో చంద్రబాబు ఈ సంస్థకు చెందిన కొన్ని ప్రారంభోత్సవాలకు కూడా వెళ్లారు. డిపాజిట్ల ద్వారా అగ్రిగోల్డ్ కూడబెట్టిన ఆస్తులు దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా చేరాయి. చివరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు లబోదిబోమంటున్నారు.
జేబు సంస్థ సీఐడీతో కాలయాపన
సీఐడీని తన కనుసన్నల్లో పెట్టుకుని కోర్టుకు ఎప్పడికప్పుడు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కనీసం చలనం లేకుండా ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుచుకుంటూ బాధితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఆస్తులన్నీ గుర్తించామని చెబుతున్న సీఐడీ గత మూడు నెలల క్రితం అగ్రిగోల్డ్ వ్యవహారంలో చంద్రబూబు, రాష్ట్ర సీఐడీ విభాగం అధికారులు హైడ్రామాకు తెరలేపారు. సంవత్సరాల తరబడి అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కాళ్లా...వేళ్లా పడినా కనికరించని చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ 2019 డిసెంబరులో కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. వేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు స్వాధీనం చేసుకున్న సీఐడీ పోలీసులు కోర్టుకు కూడా సక్రమంగా ఆస్తుల వివరాలు అందించకుండా దాచిపెట్టి ఉంచారు.
అధునాతనంగా జిల్లాల వారీగా కొత్తగా కొన్ని ఆస్తులు కనుగొన్నామని చెప్పడం బాధితుల ముఖాలకు మసిపూసి మారేడు కాయ చందంగా తయారైంది. చివరకు సీఐడీ అధికారుల పనితీరు ఎలా ఉందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. కళ్ల ముందు జిల్లాలో రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా గతంలో తూతూ మంత్రంగా అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించినట్లు కోర్టులకు సమాధానాలు చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ.. తీరా ఎన్నికలు సమీపిస్తుండే సరికి ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలకు ఊతమిస్తూ సాక్షాత్తు సీఐడీ అధికారులు ఇప్పుడు కొత్తగా ఏదో కష్టపడినట్టు.. నూతనంగా ఆస్తులు గమనించామని చెప్పటం విడ్డూరంగా మారింది. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎన్నికల వేళ ‘ఎల్లో’ నాటకం
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి మాత్రమేనని చెప్పారు. అలా చూసుకున్నా సీఐడీ గణాంకాల ప్రకారం 6.49 లక్షల మంది ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే బాధితులకు రూ.336 కోట్లు అవసరం ఉంది. రూ.250 కోట్లు చెల్లించిన ప్రభత్వం మిగతా రూ.86 కోట్ల సంగతి చెప్పనేలేదు. అది కూడా ఎన్నికలు దగ్గర పడేసరికి ప్రకటించారు. ఇక ఎన్నికల షెడ్యూలు వచ్చింది ఎన్నికల తేదీ ఏప్రెల్ 11.. అంటే ఎన్నికల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు వచ్చే పరిస్థితి లేనట్లే. అదికూడా రూ.10 వేల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వారికి మాత్రమే. రోజు వారీ, నెలవారీ, మూడు నెలల వారీ చెల్లించిన వారికి డబ్బు చెల్లించే అవకాశమే లేదు.
బాధితుల ఒత్తిడికి గ్రామాలు విడిచిన ఏజెంట్లు
అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా మారి డిపాజిట్లు వసూలు చేసిన వారు బాధితుల ఒత్తిడితో స్వగ్రామాలు వదిలి వెళ్లిపోయారు. కొందరైతే భార్యా పిల్లలను సైతం వదిలి వెళ్లారు. ఊరుకాని ఊర్లలో హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పనిచేసి జీవనం సాగిస్తున్నారు.
బలికోరిన అగ్రిగోల్డ్..
డిపాజిట్ డబ్బులు వస్తున్నాయని ఆశపెట్టటంతో ఎంతగానో ఎదురుచూసిన బాధితులు నాలుగున్నర సంవత్సరాలుగా రాకపోయేసరికి ఎంతో మనోవేదన చెందారు. డబ్బుపై ఆశలు వదలుకున్న బాధితులు ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. దీంతో రాష్ట్రం మొత్తం మీద 260 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాలో 28 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ మరణాలకు చంద్రబాబే బాధ్యుడని అగ్రిగోల్డ్ బాధితులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా బాండ్ల వెరిఫికేషన్ పేరిట బాధితులను జిల్లా నలు మూలలనుంచి జిల్లా కేంద్రానికి రప్పించి మరీ పరిశీలన చేశారు. గతంలో పోలీసులతో పరిశీలింపజేసిన ప్రభుత్వం తీరా ఎన్నికలు దగ్గరపడే సరికి మళ్లీ రెండోసారి కోర్టుల ద్వారా బాండ్ల వెరిఫికేషన్ అని పితలాటకం పెట్టింది. రెండు దఫాలుగా వ్యవప్రయాసలకోర్చి ఒంగోలు వచ్చినా బాధితులకు డబ్బు ఇవ్వలేదు.
కళ్లకు గంతలు కట్టుకున్న సీఐడీ
జిల్లాలో వందల ఎకరాలు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఖరీదైన స్థలాలు నేరుగా అగ్రిగోల్డ్ పేరుతో ఉన్నా సీఐడీ అధికారులు గుర్తించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెలిగండ్ల మండలం బొంతగుంటపల్లి గ్రామంలో ఏకంగా అగ్రిగోల్డ్ పేరుతో 112.99 ఎకరాల భూములు ఉన్నాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పండ్ల తోటలు, వృక్ష జాతి పంటల విస్తీర్ణాల వివరాల నమోదులో బయటపడిన ఆస్తులివి. కానీ ఈ ఆస్తుల వివరాలను సిఐడీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొనలేదు. బొంతగుంటపల్లి సర్వే నంబర్ 22లో 8.52 ఎకరాలు, 23లో 5.94, 24లో 7.39, 25లో 21.94, 45లో 11.25, 46లో 9.16, 47లో 12, 49/1లో 3.58, 52లో 13.80, 53లో 7.01, 55లో 12.40 ఎకరాలు, మొగుళ్లూరు గ్రామంలోనూ 57.42 ఎకరాలు అగ్రిగోల్డ్ పేరుమీద ఉన్నాయి. సర్వే నంబర్ 334/1లో 10.31 ఎకరాలు, 334/2లో 3.77, 335/1లో 20.83, 335/2లో 8.42, 336లో 14.09 ఎకరాలు ఉన్నాయి.
డైరెక్టర్ల అరెస్ట్‌లో సీఐడీ డ్రామాలు
సంస్థ చైర్మన్‌తో పాటు పలువురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 20 మందికి పైగా డైరెక్టర్లను అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అరెస్టయిన వారితో పాటు బయట ఉన్న డైరెక్టర్ల బినామీ ఆస్తులను వేల కోట్ల రూపాయల విలువగల వాటిని ఇప్పటికే కొట్టేశారు కూడా. ఇకపోతే ప్రశాశం జిల్లాలో ఉన్న ప్రధాన డైరెక్టర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ కూడా చేయలేదు. కొందరిని అరెస్ట్ చేసిన సీఐడీ.. వీరిని విడిచిపెట్టడంపై విమర్శలొస్తున్నాయి. జిల్లాలో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఐదుగురు ఉన్నారు. వారిలో ఎస్‌వీపీ ఆంజనేయులుతో పాటు సంతపేటలోని అగ్రిగోల్డ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న జి.శేషగిరిరావు, కరవదికి చెందిన శిగాకొల్లి మోహనరావు, పెరిదేపికి చెందిన పి.శివరామకృష్ణ, స్థానిక రంగారాయుడు చెరువు సమీపంలో వ్యాపారిగా స్థిరపడిన సాయిని శ్రీనివాసరావు డైరెక్టర్లుగా ఉన్నారు.
నేరుగా డైరెక్టర్ల పేర్ల మీద, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో నివాసం ఉంటున్న ప్రధాన డైరెక్టర్ ఎస్‌వీపీ ఆంజనేయులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 170.41 ఎకరాల భూములు అగ్రిగోల్డ్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఇంకా గుర్తించాల్సిన ఆస్తులు చాలా ఉన్నాయి. దానికితోడు వెలిగండ్ల మండలం బొంతగుంటపల్లి గ్రామంలో 16.24 ఎకరాల భూమి ఎస్‌వీపీ ఆంజనేయులు పేరుమీద ఆస్తులు ఉన్నాయి. సర్వే నంబర్లు 21/1, 35/1, 35/2, 36, 17/2, 32/1లో ఉన్న ఈ ఆస్తిని ఎస్‌వీపీ ఆంజనేయులు 2007 డిసెంబర్ 18న కొనుగోలు చేశారు. అదే గ్రామంలో నేరుగా అగ్రిగోల్డ్ పేరు మీద 21/1 సర్వే నంబర్‌లో 5.50 ఎకరాలు ఉంది.
ప్రకటనలకే పరిమితం
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని బాండ్లు సేకరిస్తూ ఉన్నారు. కానీ ఇంత వరకు న్యాయం జరగలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సార్లు బాధితులకు న్యాయం చేస్తారని చెప్పారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాం. నేను అగ్రిగోల్డ్ వలన రూ.లక్ష నష్టపోయా.
– మారం రామిరెడ్డి, దర్శి
అగ్రిగోల్డ్ లో చేరి తీవ్రంగా నష్ట పోయా
అగ్రిగోల్డ్ సంస్థలో ఏజెంట్‌గా చేరి తీవ్రంగా నష్ట పోయాం. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం రాకపోవడంతో జీవనాధారం కోసం అగ్రిగోల్డ్ సంస్థలో ఏజెంట్‌గా చేరా.రూ.2 లక్షలకు పైగా పాలసీ కట్టించా. ఆ సంస్థను మూసివేయడంతో డబ్బు ఇప్పించాలని పాలసీదారులు గోల చేస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు.
– గోను వెంకటనారాయణరెడ్డి, అగ్రిగోల్డ్ ఏజెంట్, జంగంవారిపల్లి
డబ్బు కోసం ఎదురు చూస్తున్నా..
నేను కిరాణా వ్యాపారం చేస్తుంటా. దానిమీద వచ్చే ఆదాయంతో నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ అగ్రిగోల్డ్ సంస్థలో సుమారు 1.20 లక్షలు దాచుకున్నా. ఇప్పుడేమో కంపెనీ దివాళా తీసింది. నా డబ్బులు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదు. ఇటీవల రూ.10 వేల లోపు డిపాజిట్ చెల్లిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి కోర్టు వద్ద అధికారులకు 15 వేల రూపాయల విలువ గల బాండ్లు, బ్యాంక్ పాస్ పుస్తకం ఇచ్చాం. 20 రోజుల్లో వస్తాయన్నారు. ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నా.
- కందగడ్డల సుబ్రహ్మణ్యం, సింగరాయకొండ
ఆత్మహత్య చేసుకుంటున్నా జాలి లేదా?
అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వ పెద్దలకు కనీసం జాలి కూడా ఉండటం లేదు. లక్షల కుటుంబాలు బజారున పడ్డాయి. కొత్తగా సీఐడీ అధికారులు జిల్లాతో పాటు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులు కనుగొన్నామని చెప్పటం విడ్డూరంగా ఉంది. ఆస్తులను సీఐడీ అధికారులు ఎప్పుడో కనుగొన్నారు. డైరెక్టర్ల ఆస్తులు కూడా కనుగొన్నారు. కానీ అన్నీ తెలియనట్టు సీఐడీ అధికారులు నటిస్తున్నారు. ఇది అత్యంత దారుణం. సంస్థ దెబ్బకు తమకు నష్టమేమీ జరుగలేదు. కేవలం ప్రభుత్వం వల్లనే తాము పూర్తిగా నష్టపోయాం.
– అద్దంకి కోటేశ్వరరావు, అగ్రిగోల్డ్ ఏజెంట్
జగనన్నతోనే అయితేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం
జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అగ్రిగోల్డ్ కస్టమర్లకు, ఏజెంట్లకు న్యాయం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులం రూ.3 లక్షలదాకా అగ్రిగోల్డ్ సంస్థకు కిస్తీలు కట్టా. అదే విధంగా ఏజెంటుగా సుమారు 300 మందితో రూ.1.50 కోట్లమేర డిపాజిట్లు కట్టించా. నేటికి ఒక్కరికి కూడా నయాపైసా రాలేదు. గతంలో డబ్బు ఇస్తామని పోలీస్‌స్టేషన్‌లో బాండ్లు, ఇతర వివరాలు అందజేశాం. నేడు మళ్లీ కోర్టు ఆదేశాలతో రూ..10 వేల లోపు డిపాజిటర్ల వివరాలు ఇవ్వాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ ప్రభుత్వం, నాయకులే అగ్రిగోల్డ్ సొమ్మును కాజేసి కస్టమర్లను అన్యాయం చేయాలని చూస్తున్నట్లు ఉంది. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయితేనే అగ్రిగోల్డ్ డిపాజిట్లు తిరిగి వస్తాయని నమ్మకముంది. రానున్న ఎన్నికల్లో జగన్‌కు అండగా ఉంటాం.
– ఎ.వెంకట సుబ్బమ్మ, అగ్రిగోల్డ్ కస్టమర్, ఏజెంట్, పామూరు
Comments
Please login to add a commentAdd a comment