‘పాలమూరు’లో సమూల మార్పులు! | 'palamuru' In the Radical changes! | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’లో సమూల మార్పులు!

Published Sat, Sep 12 2015 1:01 AM | Last Updated on Fri, Mar 22 2019 3:19 PM

'palamuru' In the Radical changes!

సాక్షి, హైదరాబాద్:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో సమూల మార్పులు జరుగుతున్నాయి. నిర్ణీత ఆయకట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ముంపు ప్రాంతాలను గణనీయంగా తగ్గిస్తూ నూతన ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో అలైన్‌మెంట్, లెవల్, నాణ్యతను ప్రస్తుతం సర్వే చేస్తున్న అధికారులు ఈ మేరకు రిజర్వాయర్ల సామర్థ్యంలో చిన్నపాటి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముంపు ఎక్కువగా ఉన్నచోట సామర్ధ్యం తగ్గిస్తూ...

వీలైనచోట్ల పెంచుతూ డిజైన్‌కు తుదిరూపమిస్తున్నారు. అన్ని రిజర్వాయర్ల పరిధిలోనూ సర్వే పనులు పూర్తయ్యాకే టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.
 
ముంపు తగ్గేలా మార్పులు
పాలమూరు ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం నుంచి వరద ఉండే 60 రోజుల్లో 70 టీఎంసీల నీటిని తీసుకొని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు నీటిని తరలించి మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో 2.70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించిన విషయం విదితమే. దీనికోసం మొత్తంగా ఆరు రిజర్వాయర్లు, 5 లిఫ్టులు ప్రతిపాదించారు. వీటికింద సుమారు 22 వేల ఎకరాల మేర ముంపు ఉంటుందని నిర్ధారించారు.

రిజర్వాయర్ల నిర్మాణానికి 9,488 కోట్లు అవసరమని తేల్చగా, 13,158 ఎకరాల భూసేకరణకు రూ.2,565 కోట్లు వ్యయాన్ని లెక్కకట్టారు. మొత్తంగా రూ.35,200 కోట్లతో చేపట్టేందుకు సిద్ధమెంది. ప్రస్తుతం రిజర్వాయర్ల పరిధిలో అత్యాధునిక లేజర్ స్కానర్ సాంకేతిక విధానాన్ని ఉపయోగించుకుంటూ సర్వే చేస్తున్నారు. సర్వేలో భాగంగానే పలుమార్పులకు అధికారులు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ముంపు ప్రాంతాలను తగ్గించేలా ఈ మార్పులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.  

కర్వేన నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలుగా నిర్ధారించగా ప్రస్తుతం దాన్ని 19 టీఎంసీలకే పరిమితం చేశారు. దీనిద్వారా నాలుగైదు తండాలకు ముంపు తగ్గనుంది. ఇక లక్ష్మిదేవుని పల్లి సామర్థ్యాన్ని సైతం 10 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు తగ్గించారు. దీని ద్వారా 4 పెద్ద గ్రామాలు ముంపు బారినుంచి బయట పడతాయి. నాలుగు గ్రామాల పరిధిలోనే సుమారు 14 తండాలు, 2 వేల వరకు జనాభా ఉందని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇక నిర్మాణానికి అంత అనువుగా లేని లోకిరేవు ప్రాంతాన్ని మార్చి దానికి సమీపంలోని ఉద్దండాపూర్‌లో అంతే కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. ఇక నార్లాపూర్ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 8.8 టీఎంసీల నుంచి 8.5 టీఎంసీలకు తగ్గించేందుకు నిర్ణయించగా, ఏదుల రిజర్వాయర్‌ను 4.3 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీల సామర్ధ్యాన్ని పెంచనున్నారు. సర్వే పూర్తయిన అనంతరం వీటన్నింటిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
 
ఇండోర్‌కు ప్రభుత్వ బృందం
కాగా, పాలమూరు ప్రాజెక్టులో కాల్వల నిర్మాణానికి బదులు భారీ పైప్‌లైన్‌లను ఏర్పాటు చేసేందుకు యోచనలు చేస్తున్న ప్రభుత్వం, ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, చీఫ్ ఇంజనీర్‌లు ఖగేందర్, పురుషోత్తమరాజులు శనివారం నుంచి ఇండోర్‌లో పర్యటించి పైప్‌లైన్ నిర్మాణాలను పరిశీలించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement